logo

ఆదుకుంటాం.. అండగా ఉంటాం

తెదేపా అధినేత అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది.

Published : 28 Mar 2024 04:39 IST

మృతుల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా

పడమరవిప్పర్రులో మాట్లాడుతున్న భువనేశ్వరి

న్యూస్‌టుడే-టి.నరసాపురం, తాడేపల్లిగూడెం అర్బన్‌, పెంటపాడు, నిడమర్రు గ్రామీణ: తెదేపా అధినేత అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. టి.నరసాపురం, తాడేపల్లిగూడెం, పెంటపాడు, నిడమర్రు మండలాల్లో నలుగురు మృతుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భవిష్యత్తులో మీకు ఏ కష్టం వచ్చినా తెదేపా తోడుగా ఉంటుందని చెప్పారు. చంద్రబాబు పంపిన భరోసా పత్రం అందించారు.

నిడమర్రులో అభివాదం చేస్తూ...

యాత్ర సాగిందిలా.. ఉదయం 11 గంటలకు టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెం వాసి అబ్బదాసరి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడికి తరలివచ్చిన మహిళలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన కుంటి శేఖర్‌ కుటుంబానికి ధైర్యం చెప్పారు. పెంటపాడు మండలం పడమర విప్పర్రులో కోడి అప్పారావు ఇంటికి వెళ్లారు. అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అక్కడ చంద్రబాబు అక్రమ అరెస్టు, వైకాపా అరాచకాల గురించి ప్రసంగించారు. సాయంత్రం నిడమర్రులో గొర్రెల సుబ్బారావు కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. అక్కడికి భారీగా తరలి వచ్చిన మహిళలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడి నుంచి యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వైపు సాగింది. కార్యక్రమంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల తెదేపా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, ఘంటా మురళీ, నాయకులు బొరగం శ్రీనివాసు, వలవల బాబ్జీ, పుట్టా మహేశ్‌కుమార్‌, జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్‌, చిర్రి బాలరాజు, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

వెల్లువెత్తిన అభిమానం.. భువనేశ్వరి యాత్రకు సంఘీభావంగా మహిళలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. హారతులు పడుతూ ఆహ్వానించారు. ఆమె వైకాపా అరాచకాలు, చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి ప్రసంగిస్తున్న సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.
నేటి యాత్ర ఇలా.. గురువారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలో నివాసం నుంచి బయలుదేరి 11.25కి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో, అనంతరం 12 గంటలకు ఆగిరిపల్లిలో మృతుల కుటుంబాలకు ధైర్యం చెబుతారు. అక్కడి నుంచి నూజివీడు మండలం గొల్లపల్లి వెళ్లి బాధిత కుటుంబాలను కలుస్తారు. అనంతరం ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గానికి వెళతారు.

కుంచనపల్లిలో కుంటి శేఖర్‌ కుటుంబ సభ్యులను ఓదార్చుతూ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని