logo

మంచి చేస్తానని ముంచేసి..

తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500, ఆయా, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ.7,500 చెల్లించే వారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా రూ.1000 అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నమ్మబలికారు.

Published : 24 Apr 2024 03:56 IST

అయిదేళ్లలో ఒక్క సమస్యా తీర్చని జగన్‌
అంగన్‌ వాడీ సిబ్బంది ఆవేదన

ఏలూరు కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీ సిబ్బంది నిరసన

తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500, ఆయా, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ.7,500 చెల్లించే వారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా రూ.1000 అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలో మాత్రమే రూ.వెయ్యి పెంచి, మిన్నకున్నారు. తెలంగాణలో రూ.13,650 ఇస్తున్నారు.

ఏలూరు నగరం, కుక్కునూరు, న్యూస్‌టుడే: ‘‘మీ అన్నొస్తాడు.. మీకు మంచే చేస్తాడు’’ అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలకు చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వారిని నిండా ముంచారు. కొత్తగా చేసింది లేకపోగా, జీతభత్యాలు మెరుగ్గా ఉన్నాయంటూ అప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాల వర్తింపును నిలిపేశారు. ఎన్నికలకు ముందు మంచి చేస్తానని చెప్పిన పెద్దమనిషి.. ఏరు దాటాక   ముంచేశాడంటూ అంగన్‌వాడీ సిబ్బంది లబోదిబోమంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కంటే రూ.వెయ్యి అదనంగా వేతనం పెంచడమే కాదు, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానంటూ 2019 ఎన్నికలకు ముందు అంగన్‌వాడీ కార్యకర్తలను జగన్‌ నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్య పరిష్కరించక పోగా రకరకాల యాప్‌లు, సర్వేల పేరుతో పని భారం మోపారు. నాలుగున్నరేళ్లు ఓపికగా ఎదురు చూసినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విధిలేక  రోడ్డెక్కి నిరసన గళం విప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎస్మా, ఉద్యోగాల నుంచి తొలగింపు వంటి అస్త్రాలతో బెదిరించి విధుల్లో చేరేలా చేసిందే తప్ప, చిరుద్యోగుల సమస్య ఒక్కటైనా తీర్చుదామన్న మానవత్వం చూపలేదు.

సమ్మె వేతనం ఏదీ?

నిర్దేశిత పదకొండు డిమాండ్ల సాధన కోసం గతేడాది డిసెంబరు 12 నుంచి ఈ ఏడాది జనవరి 22 వరకు అంగన్‌వాడీలు నిరవధిక సమ్మె చేశారు. ప్రభుత్వ చర్చల్లో భాగంగా సమ్మెకాలానికి వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. ఏలూరు జిల్లాకు చెందిన వారికి వారం రోజుల కిందట సమ్మె వేతనాలు అందగా.. పశ్చిమగోదావరి వారికి అందలేదు. 3,165 మంది కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.

ఊసే లేని మెనూ ఛార్జీలు

గత అయిదేళ్లలో టీఏ, డీఏలు కూరగాయలు, నిత్యావసర సరకుల బిల్లులు చెల్లించలేదు. గ్యాస్‌, నిత్యావసర వస్తువులకు సంబంధించి అంగన్‌వాడీలు సొంత డబ్బులే చెల్లించే దుస్థితి నెలకొంది. ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న వేతనం పెంపు, గ్రాట్యుటీ, మినీ కేంద్రాల సిబ్బందిని ప్రధాన కార్యకర్తలుగా గుర్తింపు, ఆయాలకు అంగన్‌వాడీలుగా పదోన్నతి, పదవీ విరమణ వయసు పెంపు, కేంద్రాల అద్దె బకాయిలు చెల్లింపు.. ఇలా ఏ ఒక్కటీ పరిష్కారానికి చొరవ చూపలేదు.

పథకాలన్నీ గోవిందా

అంగన్‌వాడీలకు అమ్మఒడి, విద్యా, వసతి దీవెనలు, చేయూత, ఒంటరి, వితంతు, దివ్యాంగులకు  సామాజిక పింఛన్‌ పథకాలకు అనర్హులను చేసింది.

ఎన్నో చెప్పారు.. ఒక్కటీ అమలు కాలేదు

‘ఎన్నికల ముందు అంగన్‌వాడీల కార్యకర్తలకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ ఎన్నో చెప్పారు. కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. పదకొండు డిమాండ్లతో దాదాపు 42 రోజులు నిరవధిక సమ్మె చేస్తే.. ప్రభుత్వం ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. ప్రభుత్వం పట్టుదలగా వ్యవహరించిందే తప్ప, మానవతా ద]ృక్పథంతో వ్యవహరించలేదు’అని అంగన్‌వాడీ వర్కర్స్‌ ,హెల్పర్స్‌ యూనియన్‌ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని