logo

మాటల మేడలు కట్టేసి.. స్మార్ట్‌గా చేతులెత్తేసి!

మధ్య తరగతి వర్గాల వారికి జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇస్తాం. వీటిని అన్ని హంగులు, రహదారులు, సౌకర్యాలతో ప్రైవేటు లేఅవుట్‌లకు దీటుగా తీర్చిదిద్దుతాం అంటూ వైకాపా సర్కారు ప్రకటించింది.

Published : 24 Apr 2024 03:58 IST

జగనన్న టౌన్‌షిప్‌ల పేరిట బురిడీ
మధ్య తరగతి ఆశలపై నీళ్లు

ఏలూరు టూటౌన్‌, భీమవరం పట్టణం, ఆకివీడు, న్యూస్‌Ãటుడే: మధ్య తరగతి వర్గాల వారికి జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇస్తాం. వీటిని అన్ని హంగులు, రహదారులు, సౌకర్యాలతో ప్రైవేటు లేఅవుట్‌లకు దీటుగా తీర్చిదిద్దుతాం అంటూ వైకాపా సర్కారు ప్రకటించింది. అసెంబ్లీ నియోజకవర్గానికో స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి సంబంధిత వెబ్‌సైట్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో 2022లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ప్రారంభించారు. తొలిదశలో ఉమ్మడి జిల్లాలోని ఏలూరులోని లేఅవుట్‌కు శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ ఈ పథకాన్ని విస్తరిస్తామన్నారు. తర్వాత ఆ ఊసే మరిచారు. దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ఆశలపై నీళ్లుచల్లారు.

మధ్య ఆదాయ వర్గాల(ఎంఐజీ) సొంతింటి కలను సాకారం చేసేలా మార్కెట్‌ ధరకంటే తక్కువకు స్థలం ఇస్తామని సర్కారు ఆర్భాటంగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో 15,176 మంది దరఖాస్తుచేస్తున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో అత్యధికంగా 5,397 దరఖాస్తులు అందాయి. వీటికి 580 ఎకరాలు అవసరం కాగా 36 ఎకరాలు మాత్రమే దొరికింది. 70 మంది నగదు చెల్లించగా వారికి ఇప్పటికీ స్థలాలు కేటాయించలేదు. మిగిలిన పట్టణాల్లో స్థలాల పరిశీలన తప్ప ఎక్కడా సెంటు భూమి కూడా కొనుగోలు చేయలేదు. ఈ పథకానికి సంబంధించి స్థలం సేకరించిన వెంటనే ప్లాట్లను కేటాయించేలా చర్యలు తీసుకున్నామని యూడా వైస్‌ ఛైర్మన్‌ సాయిశ్రీకాంత్‌ చెప్పారు.

ఏలూరులో స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లేఅవుట్‌ ఇది. ఇక్కడ రూ.18.20 కోట్ల అంచనా వ్యయంతో రహదారులు, తాగునీటి పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజీ, ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేస్తామంటూ 2022 మే 18న శంకుస్థాపన చేశారు. మూడేళ్లు గడుస్తున్నా అంగుళం పని కూడా జరగలేదు.

  • ఏలూరుకు చెందిన వ్యక్తి ఈ పథకం ద్వారా 150 గజాల స్థలం తీసుకున్నారు. దీనికి 10 శాతం అంటే రూ. 1.40 లక్షలు చెల్లించారు. స్థలం అప్పగించకపోగా కట్టిన సొమ్ముకు సమాధానం చెప్పేవారు లేరు. అప్పు తెచ్చి చెల్లించిన సొమ్ముకు వడ్డీ కట్టలేక ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మరో ప్రైవేటు ఉద్యోగి 200 గజాల స్థలానికి 10 శాతం సొమ్ము చెల్లించారు. లేఅవుట్‌ను సిద్ధం చేసిన తర్వాత జాగా అప్పగిస్తామంటూ అధికారులు కాలం వెళ్లదీశారు.
  • భీమవరం, తాడేపల్లిగూడెంలలో వేలాది మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎంఐజీ-1లో 150 గజాలు, ఎంఐజీ-2లో 200 గజాలు, ఎంఐజీ-3లో 240 గజాలు ఇస్తారని.. వీటిలో ఏది కావాలో చెప్పాలంటూ వాలంటీర్లు వివరాలు నమోదు చేసుకున్నారు. అంతటితోనే కథ ముగిసిపోయింది.
  • భీమవరం పట్టణ పరిధిలో 140 ఎకరాలను సేకరించాల్సి ఉండగా నర్సయ్యఅగ్రహారం ప్రాంతంలో 50 ఎకరాలను అధికారులు పరిశీలించారు. ఆ ప్రాంత రైతులను సమావేశపరిచి పథకం వివరాలు చెప్పారు. భూమి విక్రయిస్తే ప్రభుత్వం వెంటనే చెల్లిస్తుందో.. లేదోననే భయంతో రైతులు ముందుకురాలేదు. తణుకు, తాడేపల్లిగూడెంలలో అధికారులు పరిశీలించిన స్థలాలను ఈ పథకానికి కేటాయించవద్దంటూ అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తేవడంతో ఆ ప్రక్రియ నిలిచింది. ఆకివీడు, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో స్థల సేకరణకు కనీస ప్రయత్నాలు చేయలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం భూమి ధర రూ.50 లక్షలపైనే ఉంది. పట్టణపరిధిలో రూ.కోట్ల నుంచే  ప్రారంభమవుతుంది. అంత వ్యయం భరించలేమనుకున్న జగన్‌ సర్కారు ముందుగానే చేతులెత్తేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని