logo

ఒక్కసారి ఇచ్చారంటే వందేళ్లు రాసిచ్చినట్టే!

లీజు ద్వారా పొందినా, ఆక్రమించినా ఒక్కసారి నగరపాలకసంస్థకు చెందిన గదులు చేజిక్కితే అవి వారి సొంతమైనట్టే ! లీజు ద్వారా పొందిన గదులకు అద్దె కట్టినా కట్టకపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. 

Published : 26 May 2023 02:15 IST

వివాదాస్పదంగా మారిన నగరపాలక సంస్థ లీజులు
కాలపరిమితి ముగిసినా ఖాళీ చేయించని అధికారులు
న్యూస్‌టుడే, కడప నగరపాలక

లీజు ద్వారా పొందినా, ఆక్రమించినా ఒక్కసారి నగరపాలకసంస్థకు చెందిన గదులు చేజిక్కితే అవి వారి సొంతమైనట్టే ! లీజు ద్వారా పొందిన గదులకు అద్దె కట్టినా కట్టకపోయినా ఎవ్వరూ పట్టించుకోరు.  నిర్ణీత కాలవ్యవధిలో అద్దె పెంచమని అడిగేవారే ఉండరు. లీజు కాలపరిమితి ముగిసినా ఆ గదులను ఖాళీ చేయాల్సిన అవసరం ఉండదు. లీజు ద్వారా పొందిన గదులను ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరికైనా సబ్‌ లీజులకు ఇచ్చుకోవచ్చు. ఇలాంటి వెసులుబాటు ఉండడంతోనే నగరపాలక, పురపాలక, పంచాయతీ, జిల్లా పరిషత్తు, రెవెన్యూ స్థలాలు గదులకు అంత గిరాకీ ! ఇలాంటి ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదని 25 ఏళ్ల కాలపరిమితి ముగిసిన గదులను లీజుదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. కడప నగరపాలక సంస్థకు చెందిన దాదాపు 65 వాణిజ్య గదుల లీజు కాలపరిమితి ముగిసి దాదాపు పదేళ్లు అవుతోంది. అయినా వాటిని స్వాధీనం చేసుకుని కొత్తగా వేలంపాట నిర్వహించడానికి నగరపాలక సంస్థ యంత్రాంగం ఆసక్తి చూపడంలేదు. లీజు కాలపరిమితి ముగిసిన గదుల నుంచి వసూలు చేయాల్సిన అద్దె వ్యత్యాసమే రూ.3,25,60,389 ఉండడం గమనార్హం.

అధికారుల ప్రయత్నాలు విఫలం : కడప నగరపాలక సంస్థ పరిధిలో వైవీస్ట్రీట్‌ వాణిజ్య సముదాయం (పాతమార్కెట్‌ కాంప్లెక్స్‌), మద్రాసురోడ్డు కాప్లెక్సు, దేవునికడప రోడ్డు వాణిజ్య సముదాయం, పాత యునాని స్టాల్స్‌, వన్‌టౌన్‌ కూడలిలోని ఖాళీ స్థలాల లీజు కాలపరిమితి 2012-14 మధ్య ముగిసింది. ఈ గదులను ఖాళీ చేయించడానికి అప్పట్లో నగరపాలక సంస్థ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.అప్పటి నుంచి 2023 వరకు 25 ఏళ్ల కాలపరిమితి ముగిసిన గదులను ఖాళీ చేయించడానికి వివిధ సందర్భాల్లో ప్రజాప్రతినిధులు అధికారులతో కూడిన కమిటీలను నియమించారు. ఆ కమిటీలు ఏమయ్యాయో ... వాణిజ్య గదులను స్వాధీనం చేసుకోవడానికి ఎలాంటి ప్రతిపాదనలు ఇచ్చారో ఎవరికీ తెలియదు. వాణిజ్య గదుల లీజు అంశం రచ్చకెక్కిన ప్రతిసారి ఒక కమిటీని వేయడం  పరిపాటిగా మారింది. కొందరు ప్రజాప్రతినిధులు లీజుదారులకు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా నగరపాలక సంస్థకు చెందిన గదుల అద్దెను ప్రతి మూడేళ్లకొకసారి 33.33 శాతం పెంచుతారు. 2014 నుంచి లీజు ముగిసిన గదుల నుంచి పాత అద్దెలనే వసూలు చేస్తున్నారు. ఈ అంశం గతేడాది కమిషనర్‌ దృష్టికి వెళ్లింది. 2014 నుంచి 2017 వరకు, 2017 నుంచి 2020 వరకు, 2020 నుంచి 2023 వరకు వాణిజ్య గదుల అద్దెలను మూడు సార్లు సవరించి వసూలు చేయాలని వారు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అద్దె పెంపునకు ముందు పెంచిన అనంతరం దాని వ్యత్యాసం రూ.3.25 కోట్లకు చేరింది. లీజుదారులు ముందు ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని కమిషనర్‌ స్పష్టం చేయడంతో వసూళ్లు మొదలయ్యాయి. లీజు గడువు ముగిసిన గదులను ఖాళీ చేయించడంలో మాత్రం జాప్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి లీజుదారులకే గదులను తిరిగి అద్దెకిస్తారన్న ప్రచారం సాగుతోంది. లీజు కాలపరిమితి ముగిసిన గదులను ఖాళీ చేయించి కొత్తగా వేలం పాట నిర్వహిస్తే గుడ్‌విల్‌ రూపంలో కనీసం రూ.6 కోట్లు నుంచి రూ.8 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తంతో నగపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలను నిర్మించడానికి ఆస్కారం ఉంటుంది.


చర్యలు తీసుకుంటాం

- రమణారెడ్డి ఉపకమిషనర్‌, కడప నగరపాలక సంస్థ

లీజు కాలపరిమితి ముగిసిన గదుల లీజుదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 25 ఏళ్ల లీజు ముగిసినందున అద్దె గదులను ఖాళీ చేయించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సమస్య పరిష్కారమైన వెంటనే పునర్నిర్మాణం లేదా వేలంపాటపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని