logo

మొదటి రైలు ప్రమాద ఘటనకు 121 ఏళ్లు

దేశంలోనే మొట్టమొదటి రైలు ప్రమాదం జరిగి మంగళవారం నాటికి 121 ఏళ్లు పూర్తయింది. వైయస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరు మండలం మంగపట్నం వద్ద 1902లో దేశంలోనే తొలి రైలు ప్రమాదం చోటు చేసుకుంది.

Published : 13 Sep 2023 05:52 IST

స్తూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు

కొండాపురం, న్యూస్‌టుడే : దేశంలోనే మొట్టమొదటి రైలు ప్రమాదం జరిగి మంగళవారం నాటికి 121 ఏళ్లు పూర్తయింది. వైయస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరు మండలం మంగపట్నం వద్ద 1902లో దేశంలోనే తొలి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదానికి గుర్తుగా మంగపట్నం సమీపంలో స్తూపం ఏర్పాటు చేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ స్తూపం ప్రస్తుతం గండికోట వెనుక జలాల్లో ముంపునకు గురైంది. దేశాన్ని ఆంగ్లేయులు పాలిస్తున్న సమయంలో మద్రాసు నుంచి ముంబయికి ‘మెయిల్‌’ ప్రయాణికులతో బయలుదేరింది. 1902 సెప్టెంబరు 12న వైయస్‌ఆర్‌ జిల్లా మంగపట్నం రైల్వేస్టేషన్‌కు చేరింది. ఆ సమయంలో జోరుగా వర్షం పడటంతో.. వరద నీటిలో మంగపట్నం సమీపంలోని రైల్వే వంతెన కొట్టుకుపోయింది. అదే దారిలో వచ్చిన రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది యూరోపియన్లు, 61 మంది భారతీయులు మృతి చెందారు. ప్రమాద ప్రాంతంలోనే వారిని ఖననం చేసి స్తూపాన్ని నిర్మించారు. ఈ ప్రమాదంలో బెంగుళూరు కార్మెలైట్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ థెరిస్సా (సీఎస్‌ఎస్‌టీ) సంస్థ అధినేత్రి ఆంగ్లో-ఇండియన్‌ థెరిస్సా లీమా సిస్టర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో భారత్‌లో సుమారు వందకుపైగా పాఠశాలలు నడుస్తున్నాయి. ఆమె జ్ఞాపకార్థం 2003లో మంగపట్నం వద్ద ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ఏర్పాటు చేసి సుమారు 400 మంది విద్యార్థులకు విద్య అందిస్తున్నారు. థెలిస్సా లీమా జ్ఞాపకార్థం పోస్టల్‌ శాఖ వారు 2021 ఏడాది ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంగళవారం లీమా వర్ధంతి సందర్భంగా స్తూపం వద్ద పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

గండికోట వెనుక జలాల్లో మునిగిపోయిన స్తూపం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని