logo

అన్నంత పనిచేశావ్‌... అంతం చేసేశావ్‌..!

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు... శత్రువైనా సరే ఆకలితో వస్తే కడుపు నిండా భోజనం పెట్టడం ధర్మం. అలాంటి అన్నాన్నే పేదలకు దూరం చేసి జగన్‌ ప్రభుత్వం పాపం మూటగట్టుకుంది. పేదలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ సమకూర్చడం ప్రభుత్వాల బాధ్యత.

Updated : 17 Apr 2024 06:20 IST

పేదల పొట్టకొట్టిన జగన్‌ ప్రభుత్వం
రూ.5కే భోజనం లభించే అన్నక్యాంటీన్ల మూసివేత

అన్నక్యాంటీన్‌లో భోజనం చేస్తున్న  ప్రజలు (పాత చిత్రం)

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు... శత్రువైనా సరే ఆకలితో వస్తే కడుపు నిండా భోజనం పెట్టడం ధర్మం. అలాంటి అన్నాన్నే పేదలకు దూరం చేసి జగన్‌ ప్రభుత్వం పాపం మూటగట్టుకుంది. పేదలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ సమకూర్చడం ప్రభుత్వాల బాధ్యత. గత ప్రభుత్వాలు వివిధ పథకాల కింద తక్కువ ధరకే భోజనం అందించాయి. ఈ సదాశయంతోనే గత తెదేపా ప్రభుత్వం రూ.5కే అల్పాహారం, రూ.5కే భోజనం పేదలకు అందించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ‘అన్న క్యాంటీన్లు’ ఏర్పాటు చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టు బట్టి నామరూపాల్లేకుండా అంతం చేసేసింది. పేదల కడుపు కొట్టి సీఎం జగన్‌ తన కడుపు మంట చల్లార్చుకున్నారు.


బువ్వకు దూరం చేశారు

పేదల ఆకలి తీర్చేందుకు జమ్మలమడుగులో 2018, అక్టోబరు 2న అన్నక్యాంటీన్‌ ఏర్పాటైంది. ప్రభుత్వాసుపత్రి సమీపంలోనే ఉండడంతో రోగుల సహాయకులు, కూలీలు. యాచకులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే శ్రామికులు రూ.5 కే భోజనం చేసేవారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో మూతపడడంతో భోజనానికి రూ.100 వెచ్చించాల్సి వస్తోందని వారంతా వాపోతున్నారు. అన్నక్యాంటీన్‌ స్థానంలో 19, 20 వార్డు సచివాలయంగా నడుస్తోంది.

న్యూస్‌టుడే, జమ్మలమడుగు


గాలికొదిలేశారు

ఇది బద్వేలులో రూ.40 లక్షలతో నిర్మించిన అన్నక్యాంటీన్‌ భవనం. ఇక్కడ ప్రతిరోజూ సుమారు 500 మందికిపైగా రూ.5 చొప్పున అల్పాహారం. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసేవారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూతపడడంతో పేదలు, కూలీలు, యాచకులు, వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

న్యూస్‌టుడే, బద్వేలు


వార్డు సచివాలయంగా మారి...

అన్నక్యాంటీన్‌లో భోజనానికి బారులు తీరిన పేదలు

ప్రొద్దుటూరు పట్టణంలో 2018, జులైలో అన్న క్యాంటీన్‌ ప్రారంభమైంది. రూ.32 లక్షలతో నిర్మించిన భవనంలో రూ.5 చొప్పున ప్రతి రోజు ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి కల్పించింది. అల్ఫాహారానికి 300, భోజనానికి 500 మంది పేదలు వచ్చేవారు. ఏడాది పాటు విజయవంతంగా సాగింది. అనంతరం వైకాపా అధికారంలోకి రాగానే రద్దు చేయడంతో ప్రస్తుతం వార్డు సచివాలయం ఏర్పాటైంది.

న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు


పేదల కడుపు కొట్టారు...!

జడ్పీ కార్యాలయ ఆవరణలో అల్పాహారశాలను తొలగించిన అనంతరం

కడప నగరంలోని పాతరిమ్స్‌, పాతబస్టాండు, జిల్లా పరిషత్తు కార్యాలయాల వద్ద అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాంటీన్‌ వద్ద రోజుకు 600 మంది వరకు భోజనం చేసేవారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసేశారు. క్యాంటీన్‌ ఆనవాళ్లు కూడా ఉండకూడదని పాతరిమ్స్‌ వద్ద ఉన్న క్యాంటీన్‌ను రాత్రికి రాత్రి కూల్చి పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేశారు. పాతబస్టాండు క్యాంటీన్‌ను సచివాలయంగా మార్చారు. జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను ఏకంగా ప్రైవేటు హోటల్‌గా మార్చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రైవేటు హోటల్‌ను మూసివేసి స్వాధీనం చేసుకున్నారు. అన్న క్యాంటీన్‌కు నెలకు రూ.30 వేలు చెల్లించేలా నామినేషన్‌పై ఓ వ్యక్తికి అప్పగించేశారు. ఇష్టారాజ్యంగా అప్పగింతతో ప్రైవేటు వ్యక్తి సైతం మోసపోయారు.

కడప పాతరిమ్స్‌ వద్ద అన్న క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న జనం (పాత చిత్రం)

పాతబస్టాండు వద్ద సచివాలయంగా మారిన అన్న క్యాంటీన్‌

న్యూస్‌టుడే, కడప నగరపాలక, బిల్టప్‌


క్యాంటీన్‌ పోయె....కార్యాలయం వచ్చె

పులివెందులలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌లో ఎస్పీడీసీఎల్‌ డీఈ కార్యాలయంగా ఏర్పాటైంది. తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన అన్న క్యాంటీన్‌లో ప్రతి రోజూ 300 మంది అనాథలు, పేదలు, యాచకులు భోజనం చేసేవారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే మూతపడింది. ఈ క్రమంలో ఆర్టీసీˆ బస్టాండును కూల్చినప్పుడు బస్సుల రాక పోకల వివరాలను తెలిపే కేంద్రంగా, ప్రయాణికుల వస్తువుల నిల్వ చేసేందుకు ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఎసీˆ్పడీసీˆఎల్‌ డీఈ కార్యాలయంగా మారింది.

న్యూస్‌టుడే, పులివెందుల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు