logo

జగనాసురుడికి పగ్గాలు.. కన్నీళ్లలో చేనేత మగ్గాలు!

‘నేను ఉన్నాను... నేను విన్నాను’ అంటూ సీఎం జగన్‌ చేనేత కార్మికులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారు. గత ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన పథకాలకు మంగళం పాడేశారు.

Published : 24 Apr 2024 03:54 IST

రాయితీ పథకాలకు మంగళం కార్మికుల్ని ఆదుకోని సర్కారు
న్యూస్‌టుడే, కడప, సిద్దవటం

‘నేను ఉన్నాను... నేను విన్నాను’ అంటూ సీఎం జగన్‌ చేనేత కార్మికులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారు. గత ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన పథకాలకు మంగళం పాడేశారు. చేనేత మగ్గం కన్నీరు పెడుతున్నా కార్మికులకు అన్యాయం చేశారు. అరకొరగా వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ఒక్కటే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. రాయితీలివ్వకుండా ముఖం చాటేశారు. ఇంటిల్లిపాది శ్రమించినా తగినంత ఆదాయం లేక చేయూత కరవై బతుకు భారమైనా సీఎం జగన్‌ కరుణించకపోవడం ఆయన అరాచక పాలనకు నిదర్శనం.

మ్మడి కడప జిల్లాలో 32 మండలాల్లో 55 వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం కింద కేవలం 10,569 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందుతోంది. అదీ సొంత మగ్గం ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో మగ్గం ఏర్పాటు చేసుకోలేక షావుకారులు (మాస్టర్‌ వీవర్స్‌) కింద పనిచేసే వారికి మొండిచేయి చూపారు. ఇంకా వేలాది మందికి అర్హత ఉన్నా ఇవ్వలేదు. నేతన్నలకు ఇవ్వాల్సిన రాయితీలను ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. పింఛన్లు అందరికీ రావడం లేదు. నేత పని చేసి జీవిస్తున్నవారికి గృహ విద్యుత్తు వినియోగంలో రాయితీలిస్తామని దగా చేశారు. బ్యాంకుల్లో అతి తక్కువ మందికి మాత్రమే రుణాలిస్తున్నారు. ముడి పట్టుపై వసూలు చేస్తున్న జీఎస్‌టీని మినహాయించాలని అడుగుతున్నా సీఎం జగన్‌ ఆలకించడం లేదు.


రాయితీ ఎగ్గొట్టారు

ఒక్కో చేనేత కుటుంబానికి 4 కిలోల పట్టుకు రాయితీ ఇవ్వాలని 2012, సెప్టెంబరులో అనుమతిచ్చారు. తొలుత కిలోకు రూ.150 వంతున రూ.600 ఇచ్చారు. ఇది చాలడం లేదని కార్మికుల నుంచి విన్నపాలు రావడంతో గత తెదేపా ప్రభుత్వం కిలోకు రూ.250 వంతున నెలకు రూ.వెయ్యి అందజేసేది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని పెంచాలని కార్మికుల నుంచి అభ్యర్థనలు రావడంతో 2019, ఫిబ్రవరి 22న ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ముడి పట్టు ధరలు నింగిని తాకడంతో తెదేపా పాలకులు హామీ ఇవ్వడంతో కార్మికులు ఊరట చెందారు. ఉమ్మడి కడప జిల్లా పరిధిలో 2014-2019 ఆర్థిక సంవత్సరం వరకు  రూ.25.56 కోట్లు వెచ్చించారు. పథకం ద్వారా 6,500 మందికి పైగా కార్మికులు లబ్ధి పొందారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చిన అనంతరం నిలిపేశారు.


మార్కెట్‌ వసతి ఏదీ?

చేనేత వస్త్రాలకు విపణిలో మునుపటిలా గిరాకీ లభించడం లేదు. గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని అడుగుతున్నా సీఎం జగన్‌ గుండె కరగడం లేదు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. ఆప్కో ద్వారా పెద్దగా కొనడం లేదు.


నెరవేరని సొంతింటి కల

ఎంతోమంది కార్మికులకు సొంతిల్లు లేదు. కొందరికీ ఇంటి జాగా లేదు. పక్కాగృహాల్ని నిర్మించి ఇంటి తాళాలు అప్పగిస్తామని మూడేళ్ల కిందట సీఎం జగన్‌ మాటిచ్చి మడమ తిప్పారు. వ్యక్తిగత వర్క్‌షెడ్‌లు కావాలని కార్మికులు అడుగుతున్నా  ఎలాంటి స్పందన లేదు.


అరోగ్య సమస్యలతో సతమతం

గతంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిపేసింది. ఎంతోమంది కార్మికులు కంటి చూపు సమస్యతో,  అరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


మాయమాటలతో మోసం...

మైలవరంలో టెక్స్‌టైల్స్‌ పార్కుకు గతంలో సర్వే సంఖ్య 49-1లో 62.78 ఎకరాలు సేకరించారు. పనుల విలువ రూ.7.38 కోట్లు. మౌలిక వసతులకు రూ.2.80 కోట్లకు పైగా వెచ్చించారు. ఇక్కడ 118 ప్లాట్లు సిద్ధం చేశారు. వైకాపా అధికారంలోకి వస్తే వినియోగంలోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఇంతవరకు అమలు ఊసే లేదు.  

  • ప్రొద్దుటూరులో అపెరల్‌ పార్కుకు 76.17 ఎకరాలు సేకరించారు. భూసేకరణ, రహదారికి రూ.5.51 కోట్లు వెచ్చించారు. ఆ తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు.
  • సిద్దవటం మండలం ఎస్‌.కె.ఆర్‌.నగర్‌లో చేనేత సమీకృత అభివృద్ధి పథకం కింద రూ.2 కోట్లతో మెగా యూనిట్‌ను పదేళ్ల కిందట ప్రారంభించారు. రాయితీపై మగ్గాలు, జకార్డ్‌ యంత్రం, డాబీలు, అచ్చు-పన్నె, ముడి నూలు, ఇతర రకాలు తక్కువ ధరకే ఇస్తారని కార్మికులు ఆశించినా ఫలితం లేదు. రూ.లక్షల విలువ చేసే యంత్రాలు తుప్పుపట్టాయి. రాట్నాలు, మగ్గాలు మూలన చేరాయి. నూలు, నాణ్యతా పరీక్షల సామగ్రి నిరుపయోగంగా మారింది. రంగుల అద్దకం విభాగంలో బాయిలర్లు, డ్రస్సింగ్‌ యంత్రాలు దెబ్బతిన్నాయి. సీఎం జగన్‌ పాలనలో తెరిపిస్తారని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలింది.

మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడి పేరు దాసరి వెంకటేష్‌. ఈయన సిద్దవటం మండలం మాధవరం 123 వార్డులో నివాసం ఉంటున్నారు. నాలుగు దశాబ్దాల నుంచి మగ్గంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉండేందుకు కనీసం ఇల్లు లేదు. అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇంటి స్థలం, పక్కాగృహం మంజూరు చేయాలని అధికారులకు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదని వాపోతున్నారు.


జీవనం కష్టంగా మారింది
- శ్రీరామదాసు సత్యనారాయణ, మాధవరం 123 వార్డు

నాలుగు దశాబ్దల నుంచి చేనేత పని చేసుకుంటూ జీవిస్తున్నాం. ఇప్పటికీ సొంతిల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. పక్కాగృహం మంజూరు చేసినా ఆర్థిక స్థోమత లేక నిర్మించుకోలేపోయాను. మూడేళ్ల కిందట వైకాపా ప్రభుత్వం ముందుకొచ్చి స్వయంగా నిర్మిస్తామని హామీ ఇచ్చింది. సొంతింటి కల సాకారమవుతుందని ఆశించాను. అనంతరం ఇంటి నిర్మాణ విషయమే విస్మరించింది. ప్రస్తుతం జీవనం చాలా కష్టంగా ఉంది.


కూలి పనికి వెళుతున్నా...
-బండి హరికృష్ణ, మాధవరం-1

ఇరవై ఏళ్ల నుంచి నేత పనులు చేస్తున్నాను. మూడేళ్ల కిందట చేనేత ముడి సరకుల ధరలు పెరగడం, నేసిన వస్త్రాలు కొనుగోళ్లు లేకపోవడంతో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. గత రెండేళ్ల నుంచి రూ.10 వేలు కూడా ఆదాయం రావడం లేదు. విధిలేక ఏడాదిన్నర నుంచి మగ్గం పని మానేసి కూలి పనులకు వెళుతున్నాను. పరిహారం, బీమా తదితర సాయాలు ప్రభుత్వం నుంచి అందడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని