icon icon icon
icon icon icon

ఉక్రోషంతోనే రాళ్లు వేయిస్తున్నారు..

‘ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నారు. అయ్యా.. మీరు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా, ధైర్యంగా వస్తున్నా.

Published : 21 Apr 2024 05:08 IST

నన్ను ఎదుర్కోలేక కూటమిగా వస్తున్నారు
నేను లేకపోతే పథకాలు ఆగిపోతాయి.. వాలంటీర్లు ఇంటికి రారు
అనకాపల్లి జిల్లా సిద్ధం సభలో సీఎం జగన్‌

ఈనాడు, అనకాపల్లి: ‘ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నారు. అయ్యా.. మీరు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా, ధైర్యంగా వస్తున్నా. మూడుసార్లు సీఎంగా చేసి ఈ బచ్చాను చూసి భయపడి పొత్తులతో వస్తున్న మిమ్మల్ని ఏమనాలి? కుట్రలు పన్ని పది మందిని పోగేసుకుని కూటములు కట్టి నా ఒక్కడిపైకి వస్తున్నారు. బాబుకు తోడుగా దత్తపుత్రుడు, భాజపా, కాంగ్రెస్‌ కలిసి ఎగబడుతున్నాయి..’ అని సీఎం జగన్‌ విమర్శించారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం గొబ్బూరు వద్ద శనివారం ‘సిద్ధం’ సభలో ఆయన మాట్లాడారు. ‘బాబు బచ్చా అంటే నాకు కొన్ని కథలు గుర్తుకొస్తున్నాయి. కృష్ణుడిని బచ్చాగా అనుకున్న కంసుడి పరిస్థితేంటి? రాముణ్ని బచ్చా అనుకున్న మారీచుడు, హనుమంతుణ్ని బచ్చా అనుకున్న రావణుడు గుర్తుకొస్తున్నారు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు విలన్లు అందరికీ అటువైపు హీరోలందరూ బచ్చాల్లాగే కనిపిస్తారు..’ అని తనను తాను హీరోగా జగన్‌ ప్రకటించుకున్నారు.  

నేను చేసినంత అభివృద్ధి చేశారా?

‘గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులన్నీ 58 నెలల్లోనే చేసి చూపించా. వచ్చే 60 నెలలు పేదల తలరాతలు నిర్ణయించే ఎన్నికలివి. ప్రజల మనసు గెలిచి మనం.. మోసం, కుట్రల పొత్తులతో వస్తున్న వాళ్లతో తలపడబోతున్నాం. దీనికి మీరంతా సిద్ధమేనా?’ అని ప్రశ్నించారు. ‘మన ఈ సిద్ధం సభలు చూసి వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉక్రోషం, కడుపుమంటతో చంద్రబాబు నాపై రాళ్లు వేయమంటున్నారు. జగన్‌కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, పంచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలట. ఓ బాబూ.. ఎప్పుడైనా నేను చేసినంత అభివృద్ధి, సంక్షేమం చేశారా?’ అంటూ ప్రశ్నించారు.

జగన్‌ లేకపోతే పథకాలన్నింటికీ ముగింపే..

‘ఈ ఎన్నికలు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి కావు. పేదల భవిష్యత్తును నిర్ణయించేవి. జగన్‌ లేకపోతే ప్రజలు మోసపోతారు. పథకాలన్నింటికీ ముగింపే. వాలంటీర్లు ఇంటికి రారు. మోసపూరిత వాగ్దానాలు చూసి ఓట్లేయకండి’ అని జగన్‌ హితవు పలికారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేశారు. అనకాపల్లి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర తుస్సుమంది. నక్కపల్లి మండలం గొడిచర్ల నుంచి ఉదయం బయలుదేరిన జగన్‌కు ఎక్కడా ఆదరణ కనిపించలేదు. నక్కపల్లి, ఎస్‌.రాయవరం కూడళ్లలో కొంతమేర జనాలను కూడబెట్టి జేజేలు పలికించినా మిగతా చోట్ల ఎవరూ లేరు. ఎలమంచిలి వై జంక్షన్‌లో కనీసం 30 మంది లేరు.

జాతీయ రహదారి దిగ్బంధం

జగన్‌ బస్సు యాత్ర మొత్తం జాతీయ రహదారిపైనే సాగింది. గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిపేయడంతో ప్రయాణికులంతా ఎండల్లో ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం జాతీయ రహదారిని ఆనుకుని సభ నిర్వహించడంతో మధ్యాహ్నంనుంచే వాహనాలను 50 కి.మీ. ముందు నుంచే మళ్లించేశారు. ఈ సభ కోసం ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలనుంచి వెయ్యికిపైగా బస్సులు తరలించారు. ఈ వాహనాలు 4 కి.మీ.మేర జాతీయ రహదారిపై నిలిచిపోవడంతో చాలా మంది బస్సులు దిగకుండానే వెనుదిరిగారు. సిద్ధం సభను చిన్న మైదానంలో నిర్వహించారు. వెయ్యికిపైగా బస్సుల్లో జనాలను తరలించడంతో సభా ప్రాంగణంలో నిల్చోడానికి చోటు లేకుండాపోయింది. దీంతో సభకు రాకముందే చాలామంది వెనక్కుమళ్లారు.

సమస్యలపై సీఎంకు వినతులు

నక్కపల్లి, పాయకరావుపేట, న్యూస్‌టుడే: సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి బస్సు యాత్రలో పలువురు సమస్యలపై విన్నపాలనిచ్చారు. గ్రూప్‌1 అభ్యర్థులు ఆయన్ని కలిసి మాట్లాడారు. ప్రిలిమ్స్‌లో గ్రూప్‌-2 అభ్యర్థులకు 1:100 నిష్పత్తిలో అర్హత కల్పించినట్లే.. గ్రూప్‌-1 వారికి ఇవ్వాలన్నారు. తాండవ చక్కెర కర్మాగారం మూతపడటంతో రావాల్సిన వేతన బకాయిలను ఇప్పించాలని కార్మికులు కోరారు. నక్కపల్లి వద్ద హెటెరో మందుల పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img