icon icon icon
icon icon icon

ఆడపడుచులను లక్షాధికారులను చేస్తాం

‘వైకాపాలో అందరూ మోసగాళ్లే ఉన్నారు. ఎన్నికల్లో మళ్లీ వచ్చి మాయమాటలు చెబుతారు. ఆలోచించి ఓటేయాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు మహిళలను కోరారు. ‘ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన నేత ఎన్టీఆర్‌.

Published : 24 Apr 2024 06:46 IST

పన్నులు, ధరలు తగ్గిస్తాం
భవిష్యత్తుపై ఆలోచించి ఓటేయండి
బొండపల్లి మహిళా సభలో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, న్యూస్‌టుడే - విజయనగరం: ‘వైకాపాలో అందరూ మోసగాళ్లే ఉన్నారు. ఎన్నికల్లో మళ్లీ వచ్చి మాయమాటలు చెబుతారు. ఆలోచించి ఓటేయాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు మహిళలను కోరారు. ‘ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన నేత ఎన్టీఆర్‌. చెల్లెలికి ఆస్తి ఇవ్వకుండా, అప్పులిచ్చిన నేత జగన్‌రెడ్డి. అదీ తెదేపాకు, వైకాపాకు ఉన్న తేడా’ అని పేర్కొన్నారు. మహిళలను లక్షాధికారులను చేసే బాధ్యత తమదన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లిలో మంగళవారం ఉదయం మహిళా సభలో చంద్రబాబు  ప్రసంగించారు. 2029 నాటికి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తాయని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో జగన్‌ అధికారం చేపట్టిన తరువాత ఎంతో మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆరోపించారు. ‘మహిళా శక్తి కోసం అన్నిరకాల పథకాలను ప్రవేశపెడతాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున అందిస్తాం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. ప్రతి మహిళకూ నెలకు రూ.1500 ఇస్తాం. ఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. రాష్ట్రంలో నిత్యావసర ధరలే కాదు విద్యుత్తు ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు, చివరికి మద్యం ధరలు కూడా పెంచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బాదుడు లేని పాలన చూస్తారు. పన్నులు, అన్ని రకాల ధరలు తగ్గిస్తాం’ అని చెప్పారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు, విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


భూ సర్వే పేరుతో దందా..

- హైమావతి, మాజీ సర్పంచి, నెలివాడ


 

నేను భూసర్వే బాధితురాలిని. పాస్‌పుస్తకాల్లో ఒకరి పేరు ఉంటే, రికార్డుల్లో వేరొకరి పేర్లు ఎక్కిస్తున్నారు. సర్వే నంబర్లు మార్చేసి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. బెదిరించి, భూములు లాక్కుంటున్నారు.

చంద్రబాబు: ప్రతి గ్రామంలో ఇలాంటి లిటిగేషన్లే ఉన్నాయి. వైకాపా నాయకులు బెదిరించి రాయించుకుంటున్నారు. లేదంటే ప్రభుత్వ భూమి అంటూ 22-ఎలో పెడుతున్నారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం.


వడ్డీ లేకుండా రుణం ఇస్తారా?

- షర్మిల గాయత్రి, తమటాడ

కలలకు రెక్కలు పథకంలో భాగంగా రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణం ఇస్తానంటున్నారు? నేను డాక్టర్‌ కావాలనుకుంటున్నా. నాకు ఇవ్వగలరా?

చంద్రబాబు: ఆర్థిక పరిస్థితులు సహకరించక చదువుకోలేని వారి కోసమే కలలకు రెక్కలు పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. నాదీ గ్యారంటీ. (చంద్రబాబు ఆ యువతిని వేదికపైకి పిలిచి ఓ ధ్రువపత్రంపై సంతకం చేసి, అందించారు)


బీమా లేకుండా చేశారు..

- హైమావతి, ముచ్చర్ల గ్రామం

మా అమ్మ అనారోగ్యంతో హఠాత్తుగా చనిపోతే చంద్ర]న్న బీమా సాయంగా రూ.2 లక్షలు మా నాన్న ఖాతాలో వేసి ఆదుకున్నారు. వైకాపా వచ్చిన తర్వాత మా నాన్నకొచ్చిన పింఛను, నాకు నిరుద్యోగ భృతి తీసేశారు. మీరొస్తే మమ్మల్ని ఆదుకుంటారని భావిస్తున్నా.  

చంద్రబాబు: రూ.2లక్షలున్న బీమాను రూ.5 లక్షలు చేశాం. 2019లో నేను వస్తే రూ.10 లక్షలు చేయాలనుకున్నా. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ నాన్నకు రూ.4 వేల పింఛను, నీకు నిరుద్యోగభృతి అందిస్తాం.


దారి లేకుండా చేశారు..

- పైడిరాజు, గొల్లలపేట, గజపతినగరం మండలం

మా నాన్న తెదేపాలో ఉన్నారని, వైకాపా నాయకులు మా ఇంటికి వెళ్లేందుకు దారి లేకుండా చేశారు. కొన్నిరోజుల క్రితం ఇంటికొచ్చి కొట్టారు.

చంద్రబాబు: మా కార్యకర్తలపై ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. వేధింపులకు పాల్పడుతున్నారు. న్యాయం జరిగేలా నేను చూస్తా.


ఐటీని ఆదుకోవాలి..

- నాగేశ్వరి, ఇంజినీరింగ్‌ పట్టభద్రురాలు, తమటాడ గ్రామం

రాష్ట్రంలో ఐటీ రంగం నిస్తేజంగా మారింది. నాలా ఇంజినీరింగ్‌ చదువుకున్నవారు గ్రామాల్లో ఖాళీగా ఉంటున్నారు. మీరు రాష్ట్రంలో ఐటీకి గతవైభవాన్ని తీసుకురావాలి.

చంద్రబాబు: వైకాపా హయాంలో పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి,  తరిమేశారు. మేం అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితిని మారుస్తాం.ఐటీ రంగాన్ని ఆదుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img