icon icon icon
icon icon icon

తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతల రాళ్ల దాడి

చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థులు పులివర్తి నాని, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిలు గురువారం ఒకేసారి నామినేషన్లు వేసేందుకు తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి రావడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

Published : 26 Apr 2024 03:37 IST

తిరుపతిలో ఉద్రిక్తంగా నామినేషన్ల ప్రక్రియ
రెచ్చగొట్టేలా వ్యవహరించిన అధికార పార్టీ శ్రేణులు
సీసాలో పెట్రోలుతో ఉన్న వ్యక్తి అదుపులోకి..విచారించి వదిలేసిన పోలీసులు

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి (రెవెన్యూ): చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థులు పులివర్తి నాని, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిలు గురువారం ఒకేసారి నామినేషన్లు వేసేందుకు తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి రావడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నామినేషన్ల దాఖలు కేంద్రానికి వంద మీటర్ల వెలుపల ఉండాలన్న నిబంధనను తోసిరాజని వైకాపా కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయం సమీపానికి చేరుకున్నారు. తెదేపా కార్యకర్తలు సైతం ఎదురుగా రావడంతో వైకాపా కార్యకర్త ఒకరు రెచ్చగొట్టేలా తెదేపా జెండాలను కింద పడేయడంతోపాటు వైకాపా జెండాను ఎగరవేశారు. దీంతో తెదేపా కార్యకర్తలు కూడా తమ పార్టీ జెండాలను ఎగరేస్తూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు పార్టీల కార్యకర్తలూ బాహాబాహీకి దిగారు. ఈలోగా ఒక్కసారిగా వైకాపా కార్యకర్తల వైపు నుంచి రాళ్ల దాడి మొదలైంది. ఈ సమయంలోనే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒక్కరే ఆర్డీవో కార్యాలయం నుంచి తన వాహనంలో బయటకు రావడంతో తెదేపా కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఒక్కరే వాహనంలో బయటకు రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాళ్ల దాడులు..

ఇరుపక్షాలూ రాళ్ల దాడులు కొనసాగించడంతో పరిస్థితి చేయిదాటింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కొద్దిసేపు ప్రశాంతంగా కనిపించినా వైకాపా కార్యకర్తలు ఒక్కసారిగా మళ్లీ ఆర్డీవో కార్యాలయం ఎదురుగా సందులో నిలిపిన తెదేపా అభ్యర్థుల వాహనాలను ధ్వంసం చేసేందుకు యత్నించడంతో పోలీసులు వారిని నిలువరించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఉద్రిక్తత 2.30 గంటల వరకు కొనసాగింది. ఇరుపార్టీల అభ్యర్థులూ నామినేషన్లు వేసి వెలుపలికి వచ్చిన తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఇరు పార్టీల నేతలు ఒకే రోజు భారీ ర్యాలీలో నామినేషన్లు వేసేందుకు వస్తున్నట్లు సమాచారం ఉన్నా పోలీసులు సరైన భద్రతాచర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి.

పెట్రోల్‌తో యువకుడు..: ఉద్రిక్తత కొనసాగుతున్న క్రమంలో తెదేపా కార్యకర్తలు ఉన్న ప్రాంతంలో సీసాలో పెట్రోల్‌తో ఉన్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెదేపా కార్యకర్తలు, నేతలపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించేందుకు వైకాపా నేతలు చేసిన చర్యగా ఆరోపించారు. అయితే అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చిందనే విషయమై యువకుడిని ప్రశ్నించగా పలు విధాలుగా సమాధానం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. వాహనంలో పెట్రోల్‌ అయిపోయిందని తీసుకెళ్లేందుకు వచ్చినట్లు చెప్పడంతో వివరాలు తీసుకుని అతన్ని విచారించి వదిలేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img