icon icon icon
icon icon icon

‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’తో భూదోపిడీ

వైకాపా సర్కారు తీసుకువచ్చిన ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ భూ దోపిడీని ప్రోత్సహించేలా ఉందని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు.

Published : 26 Apr 2024 05:33 IST

సామాన్యుల హక్కులను హరిస్తున్నారు
జగన్‌ ప్రభుత్వంపై ఎన్డీయే నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా సర్కారు తీసుకువచ్చిన ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ భూ దోపిడీని ప్రోత్సహించేలా ఉందని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. భూహక్కు చట్టం-1909లోని ఏ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సీఎం జగన్‌ ఈ కొత్త చట్టం అమలుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్‌, తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి సంయుక్తంగా విలేకర్లతో మాట్లాడారు. ‘లోపభూయిష్ఠంగా ఉన్న చట్టాన్ని కేంద్రం వ్యతిరేకించినా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసి అమలుకు యత్నిస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఎన్డీయే పార్టీలు పోరాడాయి. బాధిత భూ హక్కుదారులు కోర్టులను ఆశ్రయించకుండా ఈ చట్టంలో కఠిన నిబంధనలు పెట్టారు. ప్రభుత్వం కేవలం 4 వేల గ్రామాల్లోనే భూసర్వే చేసింది. ఇంకా 13 వేల గ్రామాల్లో సర్వే చేయకుండానే ఆఘమేఘాలపై చట్టాన్ని అమలు చేయడం తగద’ని శివశంకర్‌ పేర్కొన్నారు.

బినామీలకు భూములు కట్టబెట్టే ఎత్తుగడ

తెదేపా నేత పట్టాభిరామ్‌ మాట్లాడుతూ ‘జగనన్న భూరక్ష పేరుతో జగన్‌ భూ భక్షణకు పాల్పడుతున్నారు. సౌర విద్యుత్‌ పార్క్‌ పేరిట వేల ఎకరాల ప్రభుత్వ భూములను తన బినామీ సంస్థలైన ఇండోసోల్‌, షిర్డీ సాయి కంపెనీలను ధారాదత్తం చేశారు. వైకాపా నేతల భూ దాహానికి తాళలేక కడప జిల్లాలో చేనేత వర్గానికి చెందిన సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భూముల రీసర్వే పేరుతో జగన్‌ ప్రజల ఆస్తుల చుట్టూ తన ఫొటోతో హద్దు రాళ్లు వేయించుకోవడంలో మర్మమేంటో గ్రహించాలి’ అని కోరారు. భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ ‘భూ చట్టాన్ని డిజిటలైజ్‌ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు తూట్లు పొడుస్తూ, జగన్‌ భూ హక్కు చట్టాన్ని తెచ్చారు. రెవెన్యూ అధికారుల చేతిలో చట్టాన్ని పెడితే.. ప్రజలకు ఎలాంటి మేలూ జరగదు. తిరుపతిలో రిజిస్టరైన పట్టా భూములను సైతం వైకాపా నేతలు కబ్జా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ చట్టాన్ని రద్దు చేస్తామ’ని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img