icon icon icon
icon icon icon

వైకాపా కోటను బద్దలు కొడుతున్నాం

ఎన్నికల్లో వైకాపా కోటను బద్దలు కొడుతున్నామని.. ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మట్టి, ఇసుక దోపిడీ.. మద్యంతో సహా అన్నీ కుంభకోణాలేనని రాష్ట్రాన్ని ఈ విషపు ఘడియల నుంచి అమృత ఘడియల్లోకి నడిపించాలని ప్రధాని మోదీని కోరారు.

Published : 07 May 2024 05:05 IST

ఈనాడు, రాజమహేంద్రవరం: ఎన్నికల్లో వైకాపా కోటను బద్దలు కొడుతున్నామని.. ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మట్టి, ఇసుక దోపిడీ.. మద్యంతో సహా అన్నీ కుంభకోణాలేనని రాష్ట్రాన్ని ఈ విషపు ఘడియల నుంచి అమృత ఘడియల్లోకి నడిపించాలని ప్రధాని మోదీని కోరారు. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటికీ పేర్లు మార్చి జగన్‌ పేరు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను రాష్ట్రంలో వైఎస్సార్‌ ఫసల్‌ బీమా యోజనగా మార్చారు. పీఎం పోషణను వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ చేశారు. మిషన్‌ వాత్సల్య, శక్తి తదితర కేంద్ర పథకాలను జగనన్న గోరుముద్ద, జగనన్న పాలుగా మార్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులనూ మళ్లించారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున కేంద్రం ఇస్తుంటే.. దానికి జగనన్న కాలనీలనే పేరు పెట్టారు. అందరి సహకారంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. జగన్‌ మాత్రం తన పార్టీ, తనవారే అన్నట్లుగా అయిదుకోట్ల మంది ప్రజల్ని హింసిస్తున్నారు’ అని పవన్‌ ధ్వజమెత్తారు.

యువతకు చేయూత ఇవ్వండి

రాష్ట్రంలో యువత ఎక్కువగా ఉన్నారని వారికి చేయూతనివ్వాలని ప్రధాని మోదీకి పవన్‌ విజ్ఞప్తి చేశారు. ‘కాశ్మీర్‌ మనదని చెప్పి ఆర్టికల్‌ 370 రద్దు చేసిన నాయకుడు మోదీ. భారత్‌ వైపు కన్నెత్తాలంటే ఉగ్రవాదులే భయపడే పరిస్థితికి దేశాన్ని చేర్చిన నాయకుడు మోదీ. అయోధ్యకు శ్రీరామచంద్రుణ్ని తీసుకొచ్చిన మహానుభావుడు ఆయనే’ అని కొనియాడారు. ‘మోదీ కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధి, ప్రతి ఒక్కరికీ ఉపాధి, పరిశ్రమలు, సాగు, తాగునీరు ఇస్తున్నారు.  భారత్‌దేశాన్ని నంబర్‌ 1 స్థానంలో నిలపడానికి మోదీ వెన్నంటి నడుస్తాం. ఈ ఎన్నికల్లో 400కు పైగా లోక్‌సభ స్థానాలు సాధించాలనే ప్రధాని లక్ష్యాన్ని  చేరుకునేందుకు కృషి చేస్తాం. వికసిత్‌ భారత్‌ కలలో ఏపీ ప్రజలు మోదీ వెంట నడుస్తారు. పెద్ద మనసుతో కూటమికి ఆశీస్సులు తెలియజేసినందుకు 5 కోట్ల మంది ప్రజల తరఫున మోదీకి చేతులెత్తి నమస్కరిస్తున్నాం’ అని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img