icon icon icon
icon icon icon

ప్రజాకంటకుడిని గద్దె దించడానికే మూడు పార్టీల కలయిక

‘దుష్టపాలనను అంతమొందించేందుకు, ప్రజా కంటకుడిని గద్దె దించేందుకు మూడు పార్టీల కలయిక జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్‌కల్యాణ్‌ శక్తి ఈ కలయికలో ఉంది’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి పురందేశ్వరి అన్నారు.

Published : 07 May 2024 05:03 IST

దుష్టపాలనలో విసిగిన వారంతా కూటమిని ఆశీర్వదించాలి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

‘దుష్టపాలనను అంతమొందించేందుకు, ప్రజా కంటకుడిని గద్దె దించేందుకు మూడు పార్టీల కలయిక జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్‌కల్యాణ్‌ శక్తి ఈ కలయికలో ఉంది’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం శివారులో సోమవారం జరిగిన ‘ప్రజాగళం’ సభలో ఆమె మాట్లాడారు. ‘గత ఐదేళ్లలో మనమేలా ఇబ్బందిపడ్డామో.. ఏ రకంగా పేదల నడ్డివిరిచారో అందరికీ తెలుసు. ఎవరికీ న్యాయం చెయ్యని ప్రభుత్వ పాలనను మనం చూశాం. ఈ ప్రజాకంఠక వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడానికే మూడు పార్టీలూ కలిసి వచ్చాయి. ‘సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌’ అంటూ భాజపా నినదిస్తోంది. సమాజంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నది మా పార్టీ లక్ష్యం. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో సమాజంలో ఉన్న పేదలు, బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేసే దిశగా తెదేపా పనిచేస్తోంది. సమాజంలో ఎవరైనా అన్యాయానికి గురైతే వారి తరఫున నిలబడుతూ గళం విప్పి ప్రశ్నిస్తానని జనసేన నాయకత్వం ముందుకెళ్తోంది. రాబోయే కాలంలో ప్రజల ఇబ్బందులు, కడగండ్లను దూరంచేస్తూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి ఈ కలయిక దోహదపడుతుంది. విసిగివేసారిన వారంతా కూటమిని ఆశీర్వదించేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కావాలి, అవినీతి రహిత పాలనను చూడాలని అనుకుంటే.. ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలి. రాజమహేంద్రవరం లోక్‌సభ అభ్యర్థిగా కూటమి నన్ను నిలబెట్టడం అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరి ఆశీర్వాదం ఎన్డీఏ కూటమి తరఫున నిలబడిన ప్రతి అభ్యర్థికీ ఉంటుందని ఆశిస్తున్నా’ అని పురందేశ్వరి అన్నారు.

రాజమహేంద్రవరం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img