icon icon icon
icon icon icon

విమర్శలను విధానాలకే పరిమితం చేయండి

ప్రచార సభల్లో ఏపీ సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు... ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది.

Published : 07 May 2024 04:57 IST

మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
జగన్‌, చంద్రబాబులకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక
ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి పరస్పరం విమర్శించుకున్నట్లు నిర్ధారణ

ఈనాడు, దిల్లీ: ప్రచార సభల్లో ఏపీ సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు... ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని ఇద్దరినీ హెచ్చరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. చంద్రబాబును చంద్రముఖి అని జగన్‌ అన్నారని, అంతేకాకుండా అరుంధతి సినిమాలోని పశుపతితో పోల్చారని, హ్యాబిచ్యువల్‌ అఫెండర్‌ అని విమర్శించారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు... మాయలఫకీరు కంటే జగన్‌ ప్రమాదకారి అని, జగన్‌ గొడ్డలిపోటుకు బలికాని వారులేరు, ముసలివారు చనిపోతే శవ రాజకీయాలు చేశారు.. అని సీఎంను చంద్రబాబు విమర్శించారంటూ వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు ఇచ్చారు. ఈ రెండు ఫిర్యాదులనూ పరిశీలించాక, ఇద్దరు నేతలూ విమర్శల పరంగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలిందని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.

‘ఇతర రాజకీయ పార్టీలపై విమర్శలు చేసేటప్పుడు విధానాలు, కార్యక్రమాలు, పాత రికార్డులు, పనితీరు వరకే పరిమితం కావాలి. నాయకుల వ్యక్తిగత జీవితాలు, ప్రజా జీవితంతో సంబంధంలేని కార్యకలాపాల జోలికి వెళ్లకూడదు. ఇతర పార్టీలు, వారి కార్యకర్తలపై నిరాధారమైన, మోసపూరితమైన ఆరోపణలు చేయకూడదు. రాజకీయ పార్టీలు, నాయకులు... అబద్ధపు స్టేట్‌మెంట్లు ఇవ్వకూడదు. ఆధారాలు లేకుండా ఓటర్లను తప్పుదోవ పట్టించేలా మాట్లాడకూడదు. నాయకులంతా ఆదర్శంగా నిలవాలి. రాష్ట్రంలో ముఖ్యమైన పార్టీలకు అధ్యక్షులు, స్టార్‌ క్యాంపెయినర్లుగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబునాయుడుల నుంచి ప్రచారంలో ఉన్నత ప్రమాణాలను ఆశిస్తారు. ఈ ఇద్దరు నాయకులూ ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలను సూక్ష్మంగా పరిశీలించాక... ఏపీ సీఈవో ఇచ్చిన నివేదికను చూశాక... వారు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు స్పష్టమైంది’ అని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img