icon icon icon
icon icon icon

జగన్‌ మానసిక స్థితే వేరు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కర్నూలులోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌లో సోమవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి మానసిక స్థితిపై ఒక డాక్టర్‌ కొన్ని విషయాలు చెప్పారు.

Published : 07 May 2024 05:12 IST

ఆయన చెప్పిందే జరగాలన్న మొండిపట్టు
ఇదేంటని ప్రశ్నిస్తే దాడులు
మీ ఆస్తులు కొట్టేసేవారు మీకు కావాలా?
కర్నూలు సభలో చంద్రబాబు ధ్వజం

ఈనాడు, కర్నూలు: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కర్నూలులోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌లో సోమవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి మానసిక స్థితిపై ఒక డాక్టర్‌ కొన్ని విషయాలు చెప్పారు. జగన్‌కు నార్సిస్టిక్‌ సమస్య ఉందని తేల్చారు. ఆ సమస్యతో ఉన్నవాళ్లు చెప్పినవే మళ్లీ మళ్లీ చెబుతుంటారు. తాము చేసేదే ఇతరులు కూడా చేయాలని కోరుకుంటారు. ఎదురుతిరిగితే దాడి చేస్తారు. చంపేస్తారు. హిట్లర్‌, బిన్‌లాడెన్‌, తాలిబన్లు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ ఆ కోవకు చెందినవారే. ఆ కిమ్‌కు తాత మన జిమ్‌ అని పేర్కొన్నారు. జగన్‌ కూడా ప్రజలకు పదేపదే అబద్ధాలు చెబుతున్నారా? లేదా? ఆయన అందరినీ మోసం చేస్తూనే ఉంటారు. ఎవరైనా అడ్డొస్తే నరికేస్తారు. ఆయనకు తల్లి మీద కూడా ప్రేమ లేదు. మొన్నటి వరకు వైకాపాకు గౌరవాధ్యక్షురాలైన ఆయన తల్లి  ఇప్పుడు ఎక్కడున్నారు? తల్లిని చూసుకోలేని వ్యక్తి ప్రజల్ని చూస్తారా? చెల్లెలికి ఆస్తిలో సమానహక్కు ఇచ్చారా? చెల్లెలు కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడుతున్నారంటే మానసిక వైకల్యమే. ఇలాంటివారు తండ్రిని, పిల్లలను, చివరికి వారిని వారు కూడా ప్రేమించుకోలేరు. నంద్యాల జిల్లాలో నాపై ఏ కేసూ లేదు. అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేస్తామన్నారు. ఎందుకని అడిగితే అరెస్టు చేసిన తర్వాత చెబుతామన్నారు. నాకే దిక్కులేకుండా పోతే మీ పరిస్థితేంటి అని అడుగుతున్నా. పాలించమని అధికారం ఇస్తే ఐదేళ్లపాటు సచివాలయానికే రాలేదు. ఇది అహంకారం కాదా? కర్నూలులో ఒక్క అంగుళం అభివృద్ధి అయినా జరిగిందా? ఇది మోసం కాదా’ అని చంద్రబాబు నిలదీశారు.

చెట్టు, పుట్ట ఏది చూసినా భయమేనా?

‘జగన్‌కు చెట్టును చూస్తే భయం. పుట్ట చూస్తే భయం. ఇప్పుడు మాత్రం పరదాలు తీసేసి ఓట్ల కోసం వస్తున్నారు. రాయలసీమలో 198 ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేశారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతుంటే చూస్తూ ఆనందపడుతున్నారు. అదీ మానసిక సమస్యే’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. తనను కూడా చంపాలని ప్రయత్నించారన్నారు. జగన్‌ 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని చంపేసి తానొక్కడే బతకాలనుకున్నారని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి క్లాస్‌వార్‌ అంటున్నారని.. తాను ఆయన దోచేసిన డబ్బులపై క్యాష్‌వార్‌ చేస్తున్నానని వ్యాఖ్యానించారు. 

పులివెందులలో జగన్‌కు ఎదురుగాలి

జగన్‌కు పులివెందులలో కూడా ఎదురుగాలి వీస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్‌లో అసహనం పెరిగిపోతోందని, ఓటమి తట్టుకోలేక ఆయన ఏం చేస్తారో తెలియదని వ్యాఖ్యానించారు. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు, గూండాగిరిని అణచివేయడానికి, మళ్లీ పోలవరాన్ని నిర్మించి రైతులకు నీళ్లు ఇచ్చేందుకు, అమరావతిని నిర్మించి ఉద్యోగాలు ఇచ్చేందుకు పొత్తుపెట్టుకున్నామని అమిత్‌షా కూడా చెప్పారన్నారు. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో వేయించుకున్నారని, ల్యాండ్‌ టైటిలింగ్‌ పేరుతో మరో నల్లచట్టం తెచ్చి, ప్రజల భూములన్నీ తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్‌ ఫొటో ఉన్న పాసుపుస్తకాల ప్రతులను, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రతులను ఆయన తగలబెట్టారు. మీ ఆస్తులు కొట్టేసేవారు మీకు కావాలా అని ప్రశ్నించారు.

సూపర్‌ సిక్స్‌తో ప్రజల జీవితాలు మారతాయి

సూపర్‌సిక్స్‌తో ప్రజల జీవితాలు మారతాయని.. అందుకే ప్రజా మ్యానిఫెస్టోతో వచ్చానని చంద్రబాబు చెప్పారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వస్తాయన్నారు. బీసీల సంక్షేమానికి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నామని పేర్కొన్నారు. ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లను కాపాడతానన్నారు. వాలంటీర్లు లేరన్న సాకుతో జగన్‌.. పింఛన్ల కోసం వృద్ధులను బ్యాంకులు, సచివాలయాల చుట్టూ తిప్పించుకుని 33 మందిని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. సచివాలయంలో ఉండే 14 మంది ఉద్యోగులు ఒక్కొక్కరు 40 మందికి పింఛన్లు ఇచ్చినా పంపిణీ పూర్తయ్యేదన్నారు.

ఉద్యోగుల్లో 80% మంది తెదేపాకే ఓట్లేశారు

ఉద్యోగుల్లో 80%మంది తెదేపాకే వేశారని చంద్రబాబు వివరించారు. ఎండలంటూ ఎవరూ ఓటు వేయకుండా వదిలేయొద్దని కోరారు.ఓటేసి జీవితాలు మార్చుకుందామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img