icon icon icon
icon icon icon

రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది

‘రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. పథకాలకు సంబంధించి బటన్లు నొక్కినా.. ఖాతాల్లో డబ్బులు పడకుండా కుట్రలు పన్నుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారు.

Published : 07 May 2024 04:16 IST

అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారు
సీఎం జగన్‌ నిరాశావాదం
మాచర్ల, రేపల్లె, మచిలీపట్నం సభల్లో ప్రచారం

ఈనాడు, అమరావతి, బాపట్ల - ఈనాడు డిజిటల్‌, మచిలీపట్నం, నరసరావుపేట: ‘రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. పథకాలకు సంబంధించి బటన్లు నొక్కినా.. ఖాతాల్లో డబ్బులు పడకుండా కుట్రలు పన్నుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారు. రూ.2.70 లక్షల కోట్లను నేరుగా మీ ఖాతాల్లో జమ చేశాను. మీ బిడ్డ పరిపాలన కారణంగా అందరి కుటుంబాలకూ మేలు జరిగింది. దీనిని అడ్డుకునే వారితో యుద్ధం చేస్తున్నాం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాలా అవసరం. ఇక్కడ ఓటు వేస్తే.. దిల్లీ దాకా ఈ సందేశం వినిపించాలి’ అని సీఎం జగన్‌ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె, పల్నాడు జిల్లా మాచర్ల, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు.

దుష్ప్రచారం చేస్తున్నారు

‘వైకాపా ప్రభుత్వంపై లేనిపోని అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయి. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే పేదలకు మేలు చేసిన ఒక్క పథకమూ గుర్తుకురాని పరిస్థితి. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టం కారణంగా యజమానులకు సంపూర్ణ హక్కులు దక్కుతాయి. రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఉన్న భూముల సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకే దీనిని తీసుకొచ్చాం’ అని సీఎం చెప్పారు. ‘2014లో భాజపా, జనసేనతో కలిసి చంద్రబాబు పోటీ చేశారు. అప్పుడు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్నీ అమలు చేయలేదు. మళ్లీ ఇప్పుడు ఆ ముగ్గురూ కూటమి కట్టి సూపర్‌-6 అని వచ్చారు. వీరిని నమ్మాలా?’ అని ప్రశ్నించారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఆయనకు ఉన్నత పదవి ఇప్పిస్తానని సీఎం చెప్పారు.నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థి అనిల్‌కుమార్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.

మండుటెండలో జనానికి ఇక్కట్లు

రేపల్లెలో ఉదయం 9 గంటలకే సభ అని చెప్పి వైకాపా నాయకులు.. గ్రామీణ ప్రాంతాల నుంచి జనాన్ని తరలించారు. సీఎం రెండు గంటలు ఆలస్యంగా చేరుకోవడంతో ఎండవేడికి తాళలేక పలువురు స్పృహ తప్పి పడిపోయారు. వారిని పట్టించుకున్నవారు లేరు. సభ జరిగే చోటు ఇరుకుగా ఉండటంతో ఊపిరాడక కొందరు అస్వస్థతకు గురయ్యారు. తాలూకా సెంటర్‌ మొదలుకుని పలు మార్గాల్లో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గుంటూరు, పొన్నూరు, తెనాలి, బాపట్ల, చీరాల వైపు నుంచి రేపల్లెకు వచ్చే ఆర్టీసీ బస్సులను సీఎం సభ ఉందని చెప్పి.. పట్టణం వెలుపల అంకమ్మ చెట్టు సెంటర్‌ వద్ద నుంచే వెనక్కి మళ్లించారు. అక్కడి నుంచి కిలోమీటరున్నర మేర వ్యయ, ప్రయాసలకోర్చి ప్రయాణికులు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లకు చేరుకోవాల్సి వచ్చింది. మాచర్లలో సీఎం జగన్‌ సభను ఎలాగైనా విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు నియోజకవర్గ వ్యాప్తంగా డబ్బు, బిర్యానీ, మద్యం పంచి, జనాన్ని తరలించారు. జగన్‌ మధ్యాహ్నం 12.30 గంటలకు రావాల్సి ఉంది. ఆయన ఆలస్యంగా 1.45 గంటలకు వచ్చి ప్రసంగం మొదలు పెట్టగానే అప్పటిదాకా వేచిచూసిన జనం ఇళ్లబాట పట్టారు. జనం వెళ్లి పోతుండటాన్ని చూసిన సీఎం అసహనంతో గట్టిగా గట్టిగా అరుస్తున్న మాదిరిగా ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img