icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు(6)

పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునే అవకాశం ఈ నెల 11వ తేదీ వరకు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్‌ సూర్యనారాయణ ఓ ప్రకటనలో కోరారు.

Updated : 07 May 2024 05:37 IST

11వ తేదీ వరకు బ్యాలట్‌ వినియోగించుకునే అవకాశం కల్పించాలి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునే అవకాశం ఈ నెల 11వ తేదీ వరకు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్‌ సూర్యనారాయణ ఓ ప్రకటనలో కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతీ ఉద్యోగి ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలని అన్నారు.


ఎన్డీయే కూటమి వెంటే ప్రజలు: మోదీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం. మీ ఉత్తేజపరిచే ప్రసంగం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’ అని తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం ఉదయం ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి ప్రధాని మోదీ స్పందించారు. ‘ధన్యవాదాలు మిత్రమా.. ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుని రాజమహేంద్రవరం సభకు వెళ్తున్నాను. మరో సభ అనకాపల్లిలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎన్డీయే కూటమితోనే ఉన్నారు’ అని బదులిచ్చారు.


ఆ మహిళా ఉద్యోగి మనందరికీ స్ఫూర్తి : చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ పాలన, జగన్‌ నోట్లు..రెండూ వద్దని ఛీకొట్టిన ఒంగోలుకు చెందిన మహిళా ఉద్యోగే మనందరికీ స్ఫూర్తి అని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఓటుకు రూ.5 వేలు తీసుకుని వైకాపాకు ఓటేయమని అధికార పార్టీ నాయకులు పెట్టిన ప్రలోభాలకు ఆమె లొంగలేదని తెలిపారు. ‘ఓట్లేయలేం.. మీ నోట్లు మాకొద్దు’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు.


తెదేపా రాష్ట్ర కమిటీలోకి పలువురి నియామకం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా నలుగుర్ని.. కార్యదర్శులుగా ముగ్గుర్ని ఆ పార్టీ నియమించింది. కార్యనిర్వాహక కార్యదర్శులుగా జీవీఎన్‌ శేఖర్‌రెడ్డి (కోవూరు), కసుకుర్తి హనుమంతరావు (గుంటూరు పశ్చిమ), మన్నెం శ్రీనివాసులునాయుడు (తిరుపతి), కొండవీటి భావన (అనంతపురం అర్బన్‌).. కార్యదర్శులుగా గుల్లపల్లి సుదర్శన్‌రావు (కురుపాం), తోట రత్నం (విశాఖపట్నం పశ్చిమ), రాయల్‌ మురళి (అనంతపురం అర్బన్‌)ని నియమించారు. తెలుగుయువత కార్యదర్శిగా అనిల్‌చౌదరి (కళ్యాణదుర్గం)ని ఎంపిక చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.


ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా ఏమిచ్చారో చెప్పండి..?: డూండి రాకేష్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆర్యవైశ్యులను అణగదొక్కడమే లక్ష్యంగా సీఎం జగన్‌ అయిదేళ్ల పాలన కొనసాగించారని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్‌ మండిపడ్డారు. అయిదేళ్ల వైకాపా పాలనలో 12 మంది ఆర్యవైశ్యులను హత్య చేశారని, 100కి పైగా దాడులు చేశారని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘గత ఎన్నికల హామీల్లో ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులిస్తామని చెప్పి మొండిచేయి చూపించారు. పైగా కార్పొరేషన్‌కు నిధులిచ్చామని బూటకపు మాటలు చెబుతున్నారు. వారికి సత్రాలు నడిపే హక్కులు ఇస్తామని మోసం చేశారు. ఈ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్యవైశ్యుల ఊసే లేదు. అందరికీ ఇచ్చేవి కాకుండా ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా నిధులు, పథకాలు ఎప్పుడు ఇచ్చారో చెప్పాలి. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం’ అని సవాల్‌ చేశారు.


సామాన్యుల ఆస్తులకు సంకెళ్లు: కె.రామకృష్ణ

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం అమలుకు జగన్‌ ప్రభుత్వం ఉవ్విళ్లూరడం దుర్మార్గమని, ఈ చట్టం సామాన్యుల ఆస్తులకు సంకెళ్లు వేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం వేగవంతంగా ఈ చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధమైందని, పలు వివాదాలకు తావిస్తోందన్నారు. ఈ చట్టం వల్ల తన తల్లిదండ్రుల భూముల మ్యుటేషన్‌కు సంబంధించి ఎదుర్కొంటున్న ఇబ్బందులను విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డా.పి.వి.రమేష్‌ వెల్లడించారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పెద్ద వారే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటే.. సామాన్యుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుందని పేర్కొన్నారు. భూ యాజమాన్య హక్కు చట్టం సామాన్యుల ఆస్తులకు సంకెళ్లుగా గోచరిస్తోందని, ఇది ప్రజల ఆస్తులపై కేంద్ర, రాష్ట్ర పాలకుల పెత్తనంలా మారిందని రామకృష్ణ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img