icon icon icon
icon icon icon

రాజమహేంద్రవరంలో జన గోదావరి!

గోదావరి తీరం పులకరించింది. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో సోమవారం జరిగిన ఎన్డీయే సభ దిగ్విజయమైంది. సభా ప్రాంగణంలోని గ్యాలరీలు నిండిపోగా, కార్యకర్తలతో వేమగిరి ఉప్పొంగింది.

Updated : 07 May 2024 07:15 IST

భారీగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు

రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక ప్రతినిధి: గోదావరి తీరం పులకరించింది. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో సోమవారం జరిగిన ఎన్డీయే సభ దిగ్విజయమైంది. సభా ప్రాంగణంలోని గ్యాలరీలు నిండిపోగా, కార్యకర్తలతో వేమగిరి ఉప్పొంగింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ సభలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్లు మైకులో వినిపించగానే సభకు హాజరైన వారి నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెలుగుదేశం, జనసేన, భాజపా కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజాగళం సభకు తరలివచ్చారు. సభ దిగ్విజయం కావడంతో ఎన్డీయే నేతల్లో సంతోషం పెల్లుబికింది. నిర్దేశిత సమయం కంటే ప్రధాని మోదీ అరగంట ఆలస్యంగా వేదిక వద్దకు రాగా..70 నిమిషాల్లో సభ ముగిసింది. ప్రధాని మోదీ.. ‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో మాట్లాడుతూ రెండు చేతులూ పైకెత్తి సభికులకు అభివాదం చేశారు. ఆ తరవాత హిందీలో రాజమహేంద్రవరం వాసులకు నమస్సులు. గోదావరి మాతకు ప్రణామాలు. ఈ నేలపైనే తెలుగు కవి ఆదికవి నన్నయ్య తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు. ఈ మహత్తర నేల నుంచి ఇప్పుడు కొత్త చరిత్ర ప్రారంభమవుతుంది’ అని పేర్కొన్నారు. ఆ తరవాత ఆయన వైకాపా ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

తాపేశ్వరం కాజా రుచి చూడాలని మోదీని కోరిన లోకేశ్‌

నారా లోకేశ్‌ తన ప్రసంగంలో..‘నాకు అన్న సమానమైన పవన్‌ అన్నకు’ అని అనగానే సభ హోరెత్తింది. ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా రుచి చూడాలని మోదీని ఈ సందర్భంగా లోకేశ్‌ కోరారు. ఫిర్‌ ఏక్‌బార్‌.. మోదీ సర్కార్‌ అని లోకేశ్‌ అనడంతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.

పవన్‌ పేరు చెప్పగానే విశేష స్పందన

సభలో పవన్‌ కల్యాణ్‌ పేరు చెప్పగానే అనూహ్య స్పందన కనిపించింది. రాజమహేంద్రవరానికి సుమారు 10 కి.మీ. దూరంలో వేమగిరి ఉంది. సభ కోసం సుమారు 50 ఎకరాల్లో జర్మన్‌ హ్యాంగర్లను ఏర్పాటుచేశారు. రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, ఏలూరు, నరసాపురం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మూడు పార్టీల కార్యకర్తలు సోమవారం ఉదయం 11 గంటల నుంచే వేమగిరికి రావడం మొదలైంది. ప్రధాని మోదీ వేదిక వద్దకు చేరుకున్న తరవాత కూడా కార్యకర్తలు వస్తూనే ఉన్నారు. పోలీసులు బందోబస్తు పేరుతో కొంత అతిగా వ్యవహరించారు. బస్సులను హెలిప్యాడ్‌కు దూరంగా నిలిపివేయడంతో కార్యకర్తలు ఎండలో ఇబ్బందులు పడుతూ సభాస్థలికి చేరుకున్నారు. పోలీసులు ప్రధాన రహదారిని పర్యవేక్షిస్తూ రాకపోకలను నిలిపివేశారు. దీంతో వేల మంది అవస్థలుపడ్డారు.


ప్రధాని మోదీకి పవన్‌ పాదాభివందనం

పాదాభివందనం చేస్తున్న పవన్‌కల్యాణ్‌ను వారిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 

ప్రధాని మోదీ వేదికపైకి రాగానే నిల్చొని ఉన్న నేతల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. ఈ సందర్భంగా  మోదీని పవన్‌ కల్యాణ్‌ శాలువాతో సత్కరించి పాదాభివందనం చేశారు. స్పందించిన ప్రధాని పాదాభివందనం వద్దంటూ వేలు చూపిస్తూ ఆప్యాయంగా ఆయనను వారించారు. ఈ సమయంలో పీఎం మోదీ కూడా ప్రతీ నమస్కారం కింద కాస్త వంగారు. అంతకుముందు వేదికపై పవన్‌ను భుజం తట్టి పలకరించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కూడా శాలువాతో ప్రధానిని సత్కరించి జ్ఞాపిక అందజేశారు. లోకేశ్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారు. నరసాపురం భాజపా లోక్‌సభ అభ్యర్థి శ్రీనివాస వర్మ తదితరులు మోదీకి ధనస్సును అందించారు. ఈ బహిరంగ సభ కవరేజీకి జాతీయ మీడియా ప్రతినిధులు,  అమెరికా నుంచి కాలమిస్టులూ వచ్చారు.

  • రాజమహేంద్రవరం తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, సిటింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీలను ప్రధాని మోదీకి లోకేశ్‌ పరిచయం చేశారు.
  • రాజమహేంద్రవరం సభలో ఆయన ప్రసంగం వీడియోను మోదీ ఎక్స్‌లో ఉంచారు. ఎన్డీయేకు లభిస్తున్న మద్దతు ఏపీలో కూటమేతర పక్షాలకు నిద్రలేని రాత్రులు ఇస్తోందంటూ పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img