icon icon icon
icon icon icon

ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. జగన్‌ ఇక ఇంటికే!

పోస్టల్‌ ఓట్లు కొనేందుకు వెళ్తున్న వైకాపాను ఉద్యోగులంతా ఛీ కొడుతున్నారని.. రాష్ట్రంలో జగన్‌ సీను అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ఉద్యోగులంతా ఎన్డీయేకు ఓట్లు వేశారని, ఇంకా వేస్తున్నారని.. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా జగన్‌ ఇక ఇంటికి పోవడం ఖాయమని స్పష్టం చేశారు.

Published : 07 May 2024 05:06 IST

పోస్టల్‌ ఓట్లకు డబ్బిస్తామన్న వైకాపాను ఛీ కొడుతున్న ఉద్యోగులు
అనకాపల్లి సభలో విరుచుకుపడిన చంద్రబాబు
కూటమిదే పీఠమని ధీమా

ఈనాడు, అనకాపల్లి: పోస్టల్‌ ఓట్లు కొనేందుకు వెళ్తున్న వైకాపాను ఉద్యోగులంతా ఛీ కొడుతున్నారని.. రాష్ట్రంలో జగన్‌ సీను అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ఉద్యోగులంతా ఎన్డీయేకు ఓట్లు వేశారని, ఇంకా వేస్తున్నారని.. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా జగన్‌ ఇక ఇంటికి పోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఎన్డీయే గెలుపును ఎవరూ అడ్డుకోలేరని.. 160 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.  అనకాపల్లిలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘వైకాపా వాళ్లు వెళ్లి డబ్బులిస్తున్నా ఉద్యోగులు వద్దని ఛీ కొడుతున్నారు. ఒంగోలులో ఒక మహిళకు వైకాపా వాళ్లు ఓటుకు రూ.5 వేలు ఇస్తామన్నా వద్దన్నారు. అంతేకాకుండా ఆమె తెదేపా నేతలకు రూ.10 వేలు ఇచ్చారు. వాటిని ఖర్చు పెట్టి తెదేపాను గెలిపించాలని కోరారు. ఉద్యోగుల్ని చూస్తుంటే కడుపు నిండిపోయింది’ అని చెప్పారు.

కల్లోలానికి, కలలకు పోటీ

‘రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి.. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి.. విధ్వంసానికి, అభివృద్ధికి.. కల్లోల ఆంధ్రప్రదేశ్‌కు, కలల ఆంధ్రప్రదేశ్‌కు మధ్య జరిగే పోరాటం’ అని చంద్రబాబు అభివర్ణించారు. ఉత్తరాంధ్ర ప్రగతి తెదేపా, జనసేన, భాజపాలతోనే సాధ్యమని వివరించారు. పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నానికి వస్తే.. అడుగడుగునా ఆటంకాలు కల్పించడమే కాకుండా, ఉన్నపళంగా వేరే ప్రాంతానికి తరలించి వేధించారని చంద్రబాబు మండిపడ్డారు. ‘విశాఖపట్నం వీళ్ల జాగీరా? అధికారం ఉందని విర్రవీగుతారా? ఉత్తరాంధ్రపై వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పెత్తనమేంటి? ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకనా? విశాఖపట్నం వైకాపా నేతల దోపిడీకి బలైంది. భూములపై కన్నేశారు. అభివృద్ధి ఆపేశారు’ అని విరుచుకుపడ్డారు. మోదీ గ్యారంటీలు, తెదేపా- జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ముందు వైకాపా మ్యానిఫెస్టో వెలవెలబోయిందన్నారు. 

మోదీ నాయకత్వంలో దేశం ముందుకు..

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, అభివృద్ధిని పట్టాలెక్కిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘నరేంద్ర మోదీ గడిచిన పదేళ్లలో దేశాన్ని ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. రాబోయే ఐదేళ్లలో మూడో స్థానానికి తీసుకెళ్లాలని సంకల్పించారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ అనేది మోదీ కల. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కల. మోదీ నాయకత్వంలో దేశం ముందుకెళ్లాలి. ప్రపంచంలో భారతదేశం, భారతీయులు నంబర్‌ 1 కావాలి. తెలుగుజాతి ప్రపంచంలో నంబర్‌ 1 కావాలి. పేదరికం లేని దేశం, రాష్ట్రం మా కల.. అందుకే ఈ కలయిక’ అని చెప్పారు.

పవన్‌ నిజమైన హీరో

‘జగన్‌ పోవాలి, ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి.. ఇందుకు ఏ త్యాగానికైనా సిద్ధమని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఆయన సీట్ల కోసం ఆలోచించలేదు. సినీ జీవితంలో లేని గౌరవం ఇక్కడొస్తుందని కాదు. నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచించారు. పొత్తు ఉంటుందని మొట్టమొదట చెప్పిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. సినిమాల్లోనే కాదు.. ప్రజాజీవితంలోనూ ఆయన నిజమైన హీరో’ అని చంద్రబాబు కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img