icon icon icon
icon icon icon

వైకాపా, బీసీవైపీ వర్గాల మధ్య ఘర్షణ

ఎన్నికల ప్రచారంలో వైకాపా, భారత చైతన్య యువజన పార్టీ(బీసీవైపీ) కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది.

Published : 27 Apr 2024 05:51 IST

పుంగనూరు మండలంలో ఉద్రిక్తత

పుంగనూరు, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో వైకాపా, భారత చైతన్య యువజన పార్టీ(బీసీవైపీ) కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మాగాండ్లపల్లెలో బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ శుక్రవారం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీవైపీ కార్యకర్తలు గ్రామంలోని వైకాపా కార్యకర్త శశిభూషణ్‌రెడ్డికి కరపత్రం అందజేసే సమయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డాయి. దాడిలో బీసీవైపీకి చెందిన ఓ వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఆ పార్టీ కార్యకర్త నారాయణ గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డ నారాయణను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కరపత్రం అందజేసిన సమయంలో వైకాపా కార్యకర్తలు తమ నాయకుడిని ఎద్దేవాచేస్తూ అసభ్యంగా సంజ్ఞలు చేశారని బీసీవైపీ నాయకులు ఆరోపించారు. కరపత్రం తీసుకోకపోవడంతో వారే దాడి చేశారని వైకాపా నాయకులు చెబుతున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో మాగాండ్లపల్లె, మద్దనపల్లెలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. వైకాపా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలను పుంగనూరు సీఐ రాఘవరెడ్డి విచారిస్తున్నారు. నియోజకవర్గంలో వైకాపా నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ ఆరోపించారు. ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటుంటే ఇలా దాడులకు పాల్పడటం సమంజసమా అని ప్రశ్నించారు. పారదర్శక పోలింగ్‌కు ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img