icon icon icon
icon icon icon

మే 3న తిరుపతిలో అమిత్‌ షా ప్రచారం?

ఎన్డీయే అభ్యర్థుల తరఫున తిరుపతిలో మే 3న నిర్వహించే ఎన్నికల ప్రచార సభకు భాజపా అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరు కానున్నట్లు సమాచారం.

Updated : 28 Apr 2024 07:27 IST

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: ఎన్డీయే అభ్యర్థుల తరఫున తిరుపతిలో మే 3న నిర్వహించే ఎన్నికల ప్రచార సభకు భాజపా అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కూడా పాల్గొననున్నారు. పూర్తి షెడ్యూల్‌ ఒకట్రెండు రోజుల్లో వెలువడనుందని భాజపా నేతలు తెలిపారు. అంతకుముందు అన్నమయ్య జిల్లాలో జరిగే ప్రచారంలో అమిత్‌ షా పాల్గొంటారు.


29, 30 తేదీల్లో పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ పర్యటన

పిఠాపురం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 29, 30 తేదీల్లో పర్యటించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురంలోని తెదేపా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రచారం ప్రారంభమవుతుందని.. చెందుర్తి జంక్షన్‌, వన్నెపూడి, కొడవలి జంక్షన్‌ మీదుగా వెల్దుర్తి, పి.దొంతమూరు, బి.కొత్తూరు, కుమారపురానికి చేరుకుంటుందన్నారు. మంగళవారం చిత్రాడ నుంచి    గొల్లప్రోలు మున్సిపాలిటీ వరకూ ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారని ప్రకటించారు.


విద్యుత్‌ కొనుగోళ్లలో ‘క్విడ్‌ ప్రోకో’ ప్రభుత్వంపై ఎన్డీయే నేతల ఆరోపణ

ఈనాడు, అమరావతి: వైకాపా పాలనలో 9సార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచి, ప్రజలపై జగన్‌ ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపిందని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. మంగళగిరిలో శనివారం మీడియాతో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.విజయ్‌కుమార్‌, తెదేపా, భాజపా నేతలు  జి.వి.రెడ్డి, షేక్‌ బాజీ మాట్లాడారు. ‘ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోళ్లు జరిపి ‘క్విడ్‌ ప్రోకో’ ద్వారా రూ.వేల కోట్లను జగన్‌ మళ్లించారు. అధిక ధరలకు ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలు చేసి తన బినామీ సంస్థ షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు భారీగా లబ్ధి చేకూర్చారు’ అని ఆరోపించారు.


మరోసారి మోసం

-నాదెండ్ల మనోహర్‌

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: ప్రజలను మరో మారు మోసం చేయటానికి, కేవలం ఓట్ల కోసం మాత్రమే సీఎం జగన్‌ మ్యానిఫెస్టో విడుదల చేశారని, అందులో బాధ్యత, ప్రజా సంక్షేమం, అభివృద్ధి శూన్యమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌, తెనాలి అసెంబ్లీ స్థానం ఎన్డీయే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు.


మే 1న హైదరాబాద్‌ పాతబస్తీలో అమిత్‌షా రోడ్‌ షో

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మే ఒకటో తేదీన హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు చార్మినార్‌ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని గౌలిపురలో అమిత్‌షా రోడ్‌ షోలో పాల్గొంటారని పేర్కొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా  ఈ నెల 29న ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబాబాద్‌ బహిరంగసభల్లో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేటలో రోడ్‌ షోలో పాల్గొంటారని తెలిపారు.


కులవృత్తిదారులకు మొండిచేయే

ఈనాడు, అమరావతి: కులవృత్తుల ఆధారంగా ఇచ్చే పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌ పాత విధానానికే కట్టుబడ్డారు. ఆయా వర్గాల్లో కూలి పనులు చేసుకుంటూ బతికే అర్హులైన వారికి నేతన్ననేస్తం, చేదోడు పథకాలను వర్తింపచేయకుండా గత ఐదేళ్లూ అమలు చేసిన విధానాన్నే మళ్లీ కొనసాగిస్తామని ప్రకటించారు. తమకు కూడా పథకాలను వర్తింపచేయాలని పలుమార్లు ఆయా వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. గతంలో మాదిరిగానే సొంత మగ్గం ఉన్నవారికే నేతన్న నేస్తం పథకాన్ని పరిమితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మంది చేనేత కార్మికులుంటే అందులో కూలీ మగ్గాలు నేసే వారు, అనుబంధ రంగాలకు చెందిన వారు దాదాపుగా 2.70 లక్షల మంది ఉన్నారు. చేదోడు పథకాన్ని కూడా సొంత దుకాణాలున్న నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, రజకులకు మాత్రమే కొనసాగిస్తామని ప్రకటించారు. అక్కడ కూలీలుగా పనిచేస్తూ కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉన్న వారిని మాత్రం విస్మరించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img