icon icon icon
icon icon icon

గాలి మళ్లుతోందని.. గాలం వేస్తున్నారు..!

పిఠాపురం నియోజకవర్గంలో వైకాపాను ఓటమి భయం వెంటాడుతోంది. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తుండటంతో అధికార పక్షం సర్వశక్తులూ ఒడ్డుతోంది.

Published : 28 Apr 2024 05:52 IST

పిఠాపురంలో వైకాపా ప్రలోభాలు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పిఠాపురం నియోజకవర్గంలో వైకాపాను ఓటమి భయం వెంటాడుతోంది. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తుండటంతో అధికార పక్షం సర్వశక్తులూ ఒడ్డుతోంది. తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలతో ఆ పార్టీ నేతలు చెమటోడ్చుతున్నారు. ఆఖరికి గాలి మళ్లుతోందని భావించి తాయిలాలకు తెరతీశారు. స్థానికంగా బలమైన ఓ సామాజిక వర్గం ఇప్పటికే పవన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో మత్స్యకారులను తమ వైపు తిప్పుకోవాలని వైకాపా నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. ప్రస్తుతం సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉండటంతో ఒక్కో రేషన్‌కార్డుకు రూ.1,500 నుంచి రూ.2 వేల నుంచి చొప్పున పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, అమీనాబాద్‌, మూలపేట, కోనపాపపేట వంటి గ్రామాలపై ఆ పార్టీ నాయకులు దృష్టి సారించారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా, ఎన్నికల నిఘా బృందాలు ఏం చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అప్పులు మాఫీ చేస్తూ.. 

అనపర్తి నియోజకవర్గానికి చెందిన కొందరు వడ్డీ వ్యాపారులు ఉప్పాడ, కొత్తపల్లి, తాటిపర్తి గ్రామాల్లో అప్పులు ఇస్తుంటారు. వీరితో వైకాపా నేతలు ముందే ఒప్పందాలు చేసుకుంటున్నారు. చిరు వ్యాపారులు, తక్కువ మొత్తంలో అప్పులు తీసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేస్తే వడ్డీతో సహా అప్పులు మాఫీ చేస్తామని వడ్డీ వ్యాపారులతో ప్రలోభాలకు గురిచేయిస్తున్నారు. ఇలా మాఫీ చేసిన సొమ్మును అధికార పక్ష నాయకులు వడ్డీ వ్యాపారులకు చెల్లిస్తున్నారు.  

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రూ.లక్ష..

పవన్‌కల్యాణ్‌కు అన్ని వర్గాల మద్దతు లభిస్తుండటంతో కొందరు నాయకులు సైతం అధికార పార్టీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలను ముందుగానే పసిగట్టిన ఆ పార్టీ నేతలు నోట్ల కట్టలతో వారిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కూటమి పార్టీల వైపు మొగ్గుచూపుతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రూ.లక్ష చొప్పున అందజేస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img