icon icon icon
icon icon icon

వైకాపాకు కాలం చెల్లింది

రాష్ట్రంలో వైకాపాకు కాలం చెల్లిందని, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవుతాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Published : 30 Apr 2024 06:26 IST

అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవుతాయి
మార్పు కోరుకుంటున్న ప్రజలు
డోన్‌, నందికొట్కూరు సభలలో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, కర్నూలు: రాష్ట్రంలో వైకాపాకు కాలం చెల్లిందని, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవుతాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నంద్యాల జిల్లా డోన్‌, నందికొట్కూరులలో ‘ప్రజాగళం’ సభల్లో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో దొంగలు పడ్డారు. మే 13న వారిని పట్టుకోవాలి. అన్ని వర్గాలు మార్పు కోరుకుంటున్నాయి. ప్రతి ఒక్కరిలోనూ మోసపోయామనే బాధ ఉంది. ఈ ఎన్నికలు విధ్వంస పాలనకు-అభివృద్ధికి, విజన్‌కు-విద్వేషానికి, ధర్మానికి-అధర్మానికి, రాతియుగం-స్వర్ణయుగం పాలకులకు మధ్య పోరాటం. మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, సైకో జగన్‌కు అహంకారం ఎక్కువై అన్నింటినీ విధ్వంసం చేశారు. ప్రజల జీవితాలను చీకటిమయం చేశారు. అలాగే శాశ్వతంగా కొనసాగుతామని అనుకున్నారు. ఐదేళ్లకోసారి ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని మరిచిపోయారు. సైకో ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని తిరిగారు. సచివాలయానికి వెళ్లని వ్యక్తి ముఖ్యమంత్రా? చేసిన ప్రగతేంటో విలేకరుల సమావేశం పెట్టి ఒక్కసారైనా ఆయన చెప్పారా? దద్దమ్మ మంత్రివర్గంతో సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఆయన ఆర్థిక మంత్రో, అప్పుల మంత్రో..

‘పరిపాలన అంటే అప్పులు చేయడం, హరికథలు చెప్పడం కాదు బుగ్గనా! అభివృద్ధి చేయడం. ఆర్థిక వ్యవస్థను నడిపించాల్సిన వ్యక్తివి చివరకు సచివాలయాన్ని, ఆసుపత్రిని, మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ.25 వేల కోట్లను తాకట్టు పెట్టారు. బుగ్గన ఆర్థిక మంత్రో అప్పుల మంత్రో తెలియదు..’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘హు కిల్డ్‌ బాబాయ్‌’ అన్న ప్రశ్నకు సమాధానాన్ని బుగ్గనకు చెవిలో చెప్పండి. ఆయనకు ఏమి తెలియదంట. నంగనాచి కబుర్లు చెబుతున్నారు’ అని సీఎం జగన్‌కు సూచించారు. ‘జగన్‌కు రంగుల పిచ్చి. ఇందుకోసం రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సైకోకు రంగువేసి శాశ్వతంగా ఇంటికి పంపాలి. మీ తాతలిచ్చిన ఆస్తుల పత్రాలపై ముఖ్యమంత్రి ఫొటోలు వేయించుకుంటారా? సర్వే రాళ్లపైనా తన ఫొటో వేయించుకున్నారు’ అని పేర్కొన్నారు. ‘నా జీవితం బీసీలకు అంకితం. ప్రతి బీసీకి న్యాయం చేస్తా. కూటమి తరఫున బలిజలకు తిరుపతి, రాజంపేట టికెట్లనిచ్చాం. రాయలసీమలో బలిజలకు ఒక టికెట్‌ అయినా వైకాపా వారు ఇచ్చారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

మీ భూమి కొట్టేయడానికి సైకో ప్రణాళికలు

‘భూములను కొట్టేయడానికి సైకో ప్రణాళికలేశారు. ఇది చాలా ప్రమాదకరం. కొన్ని రోజుల కిందట ఓ చేనేత కార్మికుడి భూమిని వేరే వారి పేరిట రాస్తే ఏమీ చేయలేక ఆయన రైలు కిందపడి చనిపోయారు. ఆయన కుటుంబసభ్యులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం వచ్చాక రికార్డులు మారిస్తే ప్రజలు ఏమీ చేయలేరు. ఆత్మహత్య తప్ప గత్యంతరం ఉండదు. ప్రస్తుతం ఏ రైతైనా బాగున్నారా? ఐదేళ్లు వ్యవసాయాన్ని నాశనం చేశారు’ అని పేర్కొన్నారు. ‘దిల్లీ మద్యం కుంభకోణంకంటే ఏపీ మద్యం కుంభకోణం చాలా పెద్దది. జే బ్రాండ్లను రద్దు చేసి దోచుకున్న డబ్బును కక్కిస్తా. నేను ఐటీ ఉద్యోగాలిస్తే జగన్‌ వాలంటీరు ఉద్యోగాలిచ్చారు. ఆయన ఇచ్చిన ఉద్యోగాలకు జీతం రూ.5 వేలయితే నేను కల్పించిన ఐటీ ఉద్యోగాలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం ఉంటుంది. మళ్లీ జాబు కావాలంటే బాబు రావాలి. కుల, మత, జనాభా గణన ఉంటుంది’ అని వివరించారు. ‘ఆడబిడ్డలకు తెదేపా పుట్టిల్లు. చెల్లికి ఆస్తి ఇవ్వకుండా ఎగ్గొట్టిన సైకో కావాలా? మహిళల కోసం మహాశక్తి పథకం ప్రకటించిన మేము కావాలా?’ అని ప్రశ్నించారు. మహిళలను లక్షాధికారులను చేసేందుకే డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీలేని రుణాన్ని ఇవ్వడానికి నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img