icon icon icon
icon icon icon

మద్యపాన నిషేధమని.. మీరే కల్తీ మద్యం అమ్ముతారా?

‘ప్రపంచంలో ఎక్కడా దొరకని మద్యం బ్రాండ్లను ఏపీలోనే అమ్ముతున్నారు. వాటి పేర్లు భూంభూం, స్పెషల్‌ స్టేటస్‌, కేపిటల్‌, జీఎస్టీ అట! రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాకే 2024లో ఓట్లు అడుగుతానని చెప్పిన మీరు.. ఈ నకిలీ బ్రాండ్లను, అదీ ప్రభుత్వ దుకాణాల్లో ఎందుకు అమ్ముతున్నార’ని ముఖ్యమంత్రి జగన్‌ను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిలదీశారు.

Published : 30 Apr 2024 06:10 IST

ఏపీకి ఏమిచ్చిందని భాజపాతో మీ రహస్య పొత్తు
న్యాయ్‌యాత్రలో జగన్‌పై షర్మిల మండిపాటు

 కాకినాడ, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం-న్యూస్‌టుడే: ‘ప్రపంచంలో ఎక్కడా దొరకని మద్యం బ్రాండ్లను ఏపీలోనే అమ్ముతున్నారు. వాటి పేర్లు భూంభూం, స్పెషల్‌ స్టేటస్‌, కేపిటల్‌, జీఎస్టీ అట! రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాకే 2024లో ఓట్లు అడుగుతానని చెప్పిన మీరు.. ఈ నకిలీ బ్రాండ్లను, అదీ ప్రభుత్వ దుకాణాల్లో ఎందుకు అమ్ముతున్నార’ని ముఖ్యమంత్రి జగన్‌ను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిలదీశారు. రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా నడుస్తోందని, నకిలీ మద్యం కారణంగా తాగేవారిలో 25 శాతం మంది లివర్‌, కిడ్నీలు చెడిపోయి చనిపోతున్నారని వాపోయారు. ‘హెల్త్‌ ఆడిట్‌ లేదు. మద్యం వ్యాపారంపై లెక్కల్లేవు. ఎంత అమ్ముతున్నారో, రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో, కేంద్రానికి ఎంత కడుతున్నారో, జీఎస్టీ ఎంతో ఏ వివరాలూ లేవ’ని మండిపడ్డారు. న్యాయ్‌యాత్రలో భాగంగా షర్మిల సోమవారం ఉదయం కాకినాడలో, సాయంత్రం ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో, రాత్రి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రోడ్‌ షోలు నిర్వహించారు. ఇండి కూటమి తరఫున సీపీఐ, సీపీఎం శ్రేణులు పాల్గొన్నాయి.

భాజపాతో ముక్కోణపు ప్రేమ

‘భాజపాతో తెదేపా, వైకాపాలది ముక్కోణపు ప్రేమకథ. బాబుది బహిరంగ పొత్తు అయితే జగన్‌ది రహస్య, అక్రమ పొత్తు. ప్రత్యేక హోదా దక్కక పదేళ్లలో ఏపీకి 10 పరిశ్రమలైనా రాలేదు. ఎంపీల బలముంటే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్న జగన్‌, నేడు తానే వంగి గులాంగిరి చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా దీక్షలు చేసి, సీఎం అయ్యాక ఆ మాటే మరిచారు. విభజన హామీలు నెరవేర్చకపోయినా చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ ఎందుకు భాజపా కొంగు పట్టుకుని వేలాడుతున్నారు?’ అని షర్మిల ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను త్యాగధనులని కీర్తించి, ఇప్పటికీ వారికి పునరావాసం కల్పించలేదని మండిపడ్డారు.

మన బిడ్డలకు ఇది అవమానం

‘అన్ని రాష్ట్రాల ప్రజలకు రాజధానులుంటే.. ఏపీ ప్రజలకు చేతిలో చిప్ప, నెత్తిన కుచ్చుటోపీ ఉంది. మన బిడ్డలకు రాజధాని ఏదో చెప్పుకోలేని అవమానం మిగిల్చారు. చంద్రబాబు అమరావతి పేరిట భ్రమలు కల్పిస్తే, జగన్‌ ఒకటి చాలదు, మూడు రాజధానులు కడతానన్నారు. చివరకు మిగిలింది గుండు సున్నా’ అని ఎద్దేవా చేశారు. ‘2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, ఐదేళ్ల తర్వాత 2.20 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచారు. మెగా డీఎస్సీ అని నమ్మించి, ఎన్నికల ముందు దగా డీఎస్సీ వేశారు. ఐదేళ్లూ బయటకు రాకుండా, ఎన్నికల ముందు సిద్ధమంటూ తిరుగుతున్నారు. దేనికి సిద్ధం? మరో రూ.8 లక్షల కోట్ల అప్పు చేయడానికా’ అని షర్మిల ధ్వజమెత్తారు.

వాళ్లేం రాళ్లు వేయరులే..

కొయ్యలగూడెంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి లావణ్య మాట్లాడుతుండగా ఎదురుగానున్న భవనం పైఅంతస్తు బాల్కనీలో ఉన్న కొందరిని పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. షర్మిల కల్పించుకొని ‘వారిని అక్కడే ఉండనివ్వండి. వాళ్లేమీ రాళ్లు వేయరులే. ఏమ్మా.. నాపై రాళ్లు వేస్తారా?’ అని ప్రశ్నించడంతో అంతా నవ్వారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img