icon icon icon
icon icon icon

జనసేన ఇబ్బందులను 24 గంటల్లో పరిష్కరిస్తాం

జనసేన పార్టీ పోటీలో లేనిచోట్ల స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయించొద్దని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, ప్రధాన కార్యదర్శి టి.శివశంకరరావు ఇచ్చిన వినతులపై 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ హైకోర్టుకు నివేదించారు.

Published : 01 May 2024 05:59 IST

స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తు వద్దన్న వినతిపై నిర్ణయం తీసుకుంటాం
హైకోర్టుకు నివేదించిన కేంద్ర ఎన్నికల సంఘం

ఈనాడు, అమరావతి: జనసేన పార్టీ పోటీలో లేనిచోట్ల స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయించొద్దని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, ప్రధాన కార్యదర్శి టి.శివశంకరరావు ఇచ్చిన వినతులపై 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ హైకోర్టుకు నివేదించారు. జనసేన ఇబ్బందులను 24 గంటల్లో పరిష్కరిస్తామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. తెదేపా వేసిన ఇంప్లీడ్‌ పిటిషన్లను ప్రస్తుత వ్యాజ్యంతో జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌, న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. ‘‘తెదేపా, భాజపా, జనసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేన పోటీచేయని స్థానాల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఈసీ కేటాయించింది. ఆ పార్టీ ఎక్కడ పోటీ చేసినా అభ్యర్థులందరికీ ఇదే గుర్తు ఉంటుంది. కానీ, జనసేన పోటీలో లేనిచోట స్వతంత్రులకు, ఇతరులకు గాజుగ్లాసు గుర్తు కేటాయిస్తే.. ఓటర్లు అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉంది. తద్వారా తెదేపా, భాజపా తరఫున పోటీచేస్తున్న కూటమి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. గుర్తింపు పొందిన పార్టీలైన తెదేపా, భాజపాతో పొత్తు ఉన్నందున జనసేనకు కేటాయించిన గుర్తును స్వతంత్రులకు కేటాయించడానికి వీల్లేదు. ఓ పార్టీ దురుద్దేశపూర్వకంగా తెరవెనుక మంత్రాంగం నడిపింది. ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించొద్దంటూ జనసేన పార్టీ ఇచ్చిన వినతిపై ఈసీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు.

కూటమి అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం

మరోవైపు జనసేన దాఖలు చేసిన వ్యాజ్యంలో తమను ప్రతివాదులుగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌, అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌ అనుబంధ పిటిషన్లు వేశారు. వారి తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. ఈసీ నిర్ణయం కూటమి అభ్యర్థులపై ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.


జనసేనకే పరిమితం చేయండి: కనకమేడల

ఈనాడు, దిల్లీ: జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసును అది పోటీలో లేనిచోట్ల స్వతంత్రులకు, ఇతరులకు కేటాయించడం ఓటర్లకు ఇబ్బందికరమని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ గుర్తును జనసేన అభ్యర్థులకే పరిమితం చేసి, మిగిలిన వారికి ఇతర గుర్తులు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు లేఖ రాశారు. మే నెల సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈసీకి రాసిన మరో లేఖలో కనకమేడల కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img