icon icon icon
icon icon icon

సంక్షిప్తవార్తలు

శ్రమ దోపిడీని ఎదిరించి కార్మిక శక్తి గెలిచిన చారిత్రక దినం.. మే డే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.

Updated : 02 May 2024 07:05 IST

మ్యానిఫెస్టోలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట
మే డే శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: శ్రమ దోపిడీని ఎదిరించి కార్మిక శక్తి గెలిచిన చారిత్రక దినం.. మే డే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. తమ కష్టంతో సమాజ నిర్మాణానికి చేయూతనిచ్చే శ్రామికుల హక్కుల్ని కాపాడటంలో తెదేపా ఎప్పుడూ ముందుంటుందని స్పష్టంచేశారు. వైకాపా ప్రభుత్వంలా ఓ చేత్తో సాయం ఇచ్చి.. మరో చేత్తో పదింతలు జరిమానాల రూపంలో లాగేసుకొనే మాయలు చేయబోమన్నారు. మే డే సందర్భంగా ఎక్స్‌ వేదికగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.


కార్మికులే సౌభాగ్య ప్రదాతలు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునే ఏకైక వేడుక మే డే అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఎక్కడ కష్టం ఉంటుందో.. ఎక్కడ స్వేదం చిందుతుందో అక్కడ సౌభాగ్యం విలసిల్లుతుందనేది జగమెరిగిన సత్యమని బుధవారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. ‘కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు. శ్రమైక జీవనంలో తరించే ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నాను. కార్మికులను చూసినప్పుడల్లా గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పిన... డ్యాములు ఎందుకు కడుతున్నానో.. భూములు ఎందుకు దున్నుతున్నానో నాకే తెలియదు! నా బతుకొక సున్నా.. అయినా నడుస్తున్నా! చెట్టుగా ఉంటే ఏడాదికొక్క వసంతమైనా దక్కేది... మనిషినై అన్ని వసంతాలూ కోల్పోయాను... అనే  పద్యం గుర్తుకొస్తుంది’ అని అన్నారు.


గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించొద్దు

సీఈవోకు తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: హైకోర్టు ఆదేశాల మేరకు గాజు గ్లాసు గుర్తును జనసేన అభ్యర్థులు మినహా.. ఇతరులకు కేటాయించొద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌మీనాను తెదేపా నేతలు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను బెదిరిస్తున్న వైకాపా అభ్యర్థులు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, అనంతపురంలో వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఈవోకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తదితరులు బుధవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎంవీవీ సత్యనారాయణ, మేకపాటి రాజమోహన్‌రెడ్డి అడ్డుఅదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండదు’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.


ముద్రగడ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ విమర్శించారు. కాపు ఉద్యమ నేతగా చెప్పుకొనే పద్మనాభం వారి అభ్యున్నతికి ఏం చేశారో చెప్పాలని బుధవారం ఓ ప్రకటనలో డిమాండు చేశారు. ‘కాపులకు రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని స్పష్టం చేసిన సీఎం జగన్‌ పంచన చేరి వారికి ఎలా న్యాయం చేస్తారో చెప్పాలి. వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే ముద్రగడ పవన్‌పై విమర్శలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం. కాపు ఉద్యమాన్ని రాజకీయ పునరావాసంగా మార్చుకున్న ఘనుడు ముద్రగడ. ఆయన సవాలు చేసినట్లు ఎలాగూ పవన్‌ను ఓడించలేరు. అందుకే ముందుగానే ముద్రగడ పేరు మార్చుకోవాలి’ అని అన్నారు.


ఒక్క పరిశ్రమైనా కట్టారా?

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్న

రాజమహేంద్రవరం (దేవీచౌక్‌), న్యూస్‌టుడే: అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్లలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ అయినా కట్టారా? కనీసం ఒక్క రోడ్డు అయినా వేశారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో, కేంద్రంలో అరాచక, నియంతృత్వ పాలన సాగిందన్నారు. సొంత చెల్లెలికే న్యాయం చేయలేని జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారని ప్రశ్నించారు. సమావేశంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.


‘వైకాపాకు ఓటెయ్యకపోతే చంపేస్తారా?’

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సైకిల్‌ గుర్తుకు ఎవరూ ఓటెయ్యకూడదని.. తెదేవా వాళ్లను చంపేస్తానని బహిరంగంగా హెచ్చరిస్తున్న ఉదయగిరి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారని ఎన్నికల సంఘాన్ని, పోలీసుశాఖను తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.


ఎన్డీయేతోనే రైతు సంక్షేమం: మర్రెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రైతు సంక్షేమం సాధ్యమవుతుందని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయంతో కర్షకులందరికీ మేలు జరుగుతుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img