icon icon icon
icon icon icon

అమరావతి విధ్వంసంతో ఆగిన అభివృద్ధి

‘‘అమరావతిని జగన్‌ విధ్వంసం చేయకపోతే రాజధానిలో భాగమైన గుంటూరు అభివృద్ధి చెందేది. అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు 185 కిలోమీటర్లు.

Published : 02 May 2024 05:55 IST

డబ్బులు ఇచ్చారని ఓట్లు వేస్తే  అంతే సంగతులు
ముస్లింలకు 4% రిజర్వేషన్‌ కోసం పోరాడతాం
గుంటూరు ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ‘‘అమరావతిని జగన్‌ విధ్వంసం చేయకపోతే రాజధానిలో భాగమైన గుంటూరు అభివృద్ధి చెందేది. అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు 185 కిలోమీటర్లు. అమరావతి కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచస్థాయి నగరం కళ్లముందుకు వచ్చేది. నా కలలన్నీ జగన్‌ వచ్చి వమ్ము చేశారు. అమరావతి విధ్వంసంతో గుంటూరు అభివృద్ధి ఆగిపోయింది. జగన్‌ వచ్చాక భూముల విలువలు పడిపోయాయి. గుంటూరులో ఇళ్ల అద్దెకూ గిరాకీ లేదు. ఇప్పటికైనా మీరు ఏం నష్టపోయారో అర్థమైందా? జగన్‌ డబ్బులు ఇచ్చారని ఓట్లు వేస్తే అంతే సంగతులు. అమరావతిపై వాళ్ల స్టాండ్‌ చెప్పి ఓట్లు అడగాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు హిమని సెంటర్‌లో బుధవారం రాత్రి జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘ఐదేళ్లలో ప్రజలు పడిన బాధలు, ఇబ్బందులు తట్టుకోలేక, భవిష్యత్తుపై బెంగతో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ రోడ్డుపైకి వచ్చారు. నన్ను అరెస్టుచేస్తే మీరంతా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తే ఆ రోజు పోలీసులు అడ్డుకున్నారు. ఈ రోజు పోలీసులే స్వాగతం పలుకుతున్నారు. ఇదే మార్పు. ఇప్పుడు పోలీసులు ఎన్నికల సంఘం చేతిలో ఉన్నారు. ఎన్నికలకు 12 రోజుల సమయం ఉంది. మే 13న చరిత్ర తిరగరాసే రోజు. జగన్‌కు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు’ అని ధ్వజమెత్తారు.

జగన్‌కు ఎందుకు ఓట్లేయాలి

ముస్లింలకు జగన్‌ ఒక్క పథకమైనా ఇచ్చారా? మరి జగన్‌కు ఓట్లు ఎందుకేయాలని చంద్రబాబు నిలదీశారు. ‘మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేశాం. తెదేపా పాలనలో ఒక్క ముస్లింకైనా ఇబ్బంది ఎదురైందా? అమరావతి చుట్టూ ఎక్కువమంది ముస్లింలు ఉన్నారు. కానీ రాజధానిని ఇక్కడి నుంచి విశాఖపట్టణం తీసుకెళ్తానని జగన్‌ అంటున్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్‌ కోసం పోరాడతాం’ అని హామీ ఇచ్చారు. గుంటూరులో అంతర్జాతీయ స్థాయి రహదారులు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.

ఐటీ టవర్లు కట్టి ఉపాధి కల్పిస్తాం

‘కూటమి ఎన్నికల మేనిఫెస్టో అందరూ చదివి ఆశీర్వదించండి. గుంటూరులో ఐటీ టవర్స్‌ కట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా గుట్కా వ్యాపారం చేస్తున్నారు. వÚ్్ఫ ఆస్తులను ఆక్రమించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను వెనక్కి తీసుకుంటాం’ అని చంద్రబాబు తెలిపారు. ఆయన సమక్షంలో గుంటూరు డిప్యూటీ మేయరు సజీల తెదేపాలో చేరారు. కార్యక్రమంలో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నసీర్‌ అహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img