icon icon icon
icon icon icon

ఆ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులెవరికీ గాజు గ్లాసు గుర్తు కేటాయించం

రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు ఏయే లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయో ఆయా లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే ఇతర పార్టీల అభ్యర్థులకుగానీ, స్వతంత్ర అభ్యర్థులకుగానీ ఎన్నికల సంఘం గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించదు.

Published : 02 May 2024 06:40 IST

జనసేన పోటీచేసే 21 అసెంబ్లీ సీట్లున్న లోక్‌సభ స్థానాలపై ఈసీ స్పష్టీకరణ
జనసేన పోటీ చేసే రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో
ఏ అసెంబ్లీ స్థానంలోనూ ఇతరులకు గాజు గ్లాస్‌ గుర్తు ఇవ్వబోమని హైకోర్టుకు వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు ఏయే లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయో ఆయా లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే ఇతర పార్టీల అభ్యర్థులకుగానీ, స్వతంత్ర అభ్యర్థులకుగానీ ఎన్నికల సంఘం గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించదు. ఉదాహరణకు.. అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని పాలకొండ అసెంబ్లీ స్థానానికి జనసేన పోటీ చేస్తున్నందున అరకు లోక్‌సభ స్థానానికి జనసేన పోటీలో లేకపోయినా మరే ఇతర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించదు. అలాగే జనసేన లోక్‌సభకు పోటీ చేస్తున్న  స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోనూ ఏ ఇతర రిజిష్టర్డ్‌ పార్టీ అభ్యర్థికిగానీ, స్వతంత్ర అభ్యర్థికిగానీ గాజు గ్లాసు గుర్తును కేటాయించదు. అంటే జనసేన పోటీ చేస్తున్న కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాల పరిధిలో ఏ అసెంబ్లీ స్థానంలోనూ ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు గాజు గ్లాస్‌ గుర్తు ఉండదు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం రాష్ట్ర హైకోర్టుకు వివరించింది. జనసేన ఇచ్చిన వినతిపై ఈ మేరకు చర్యలు తీసుకున్నామని, రిటర్నింగ్‌ అధికారులందరికీ ఆదేశాలిచ్చామని ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ కోర్టుకు వెల్లడించారు. ఆ వివరాలను నమోదు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ వ్యాజ్యంపై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చారు. తెదేపా, భాజపాలతో పొత్తులో భాగంగా రాష్ట్రంలో జనసేన 21 శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన పోటీలో లేని మిగతా శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఇతర రిజిష్టర్డ్‌ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ కేటాయించడాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్‌ హైకోర్టులో సవాలు చేశారు. ఆ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ సందర్భంగా.. జనసేన వినతిపై 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని, విచారణ వాయిదా వేయాలని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈసీ తరఫున బుధవారం అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపించారు. గాజు గ్లాస్‌ గుర్తును ఫ్రీసింబల్‌ జాబితా నుంచి తొలగించాలని, జనసేనకు మాత్రమే కేటాయించాలని ఆ పార్టీ ఈసీకి వినతిపత్రం ఇచ్చిందని తెలిపారు. దానిపై ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు తెలిపారు. ఈసీ నిర్ణయంపై జనసేన తరఫు న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.


ఈసీ ఉత్తర్వులు మరింత గందరగోళం
తెదేపా వ్యాజ్యం.. నేడు విచారణ

తెదేపా, భాజపా, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నందున జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఇతరులెవరికీ కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని తెదేపా అత్యవసరంగా హైకోర్టులో వ్యాజ్యం వేసింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకే రిజర్వు చేయాలని కోరింది. స్వతంత్ర అభ్యర్థులెవరికీ గాజు గ్లాసు గుర్తును కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని కోరింది. తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ వ్యాజ్యాన్ని సమర్పించారు. ఈసీ తాజా ఉత్తర్వులు ఓటర్లను మరింత అయోమయానికి గురిచేసేలా ఉన్నాయన్నారు. గురువారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారించనుంది. ‘అభ్యర్థుల పేర్లను చదవలేని నిరక్షరాస్యులైన ఓటర్లు పార్టీ గుర్తునుబట్టి ఓటేస్తారు. గాజు గ్లాసు గుర్తును నిబంధనల ప్రకారం ఈసీ జనసేనకు కేటాయించింది. ఈ గుర్తును ‘ఫ్రీ సింబల్‌ లిస్ట్‌’లోనూ చేర్చడం వల్ల ఇబ్బందులపై జనసేన పోరాడింది. ఆ తరువాత ఈసీ తీసుకున్న నిర్ణయం ఇబ్బందులను తొలగించకపోగా.. కూటమి అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img