icon icon icon
icon icon icon

జగన్‌ పాలనలో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనే దుస్థితి

సీఎం జగన్‌ పాలనలో నెలల తరబడి జీతాలు అందక.. ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితులు చూసి చలించిపోయా.

Published : 04 May 2024 05:38 IST

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘సీఎం జగన్‌ పాలనలో నెలల తరబడి జీతాలు అందక.. ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితులు చూసి చలించిపోయా. జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బు చేతికందక.. వారి పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఆగిపోవడం వంటి కన్నీటి గాథలు.. తమ హక్కుల కోసం ఉద్యమించిన వారిపై వైకాపా సర్కారు కక్షసాధింపు చర్యలను సహించలేకపోయా’ అని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రివర్స్‌ పీఆర్సీతో ఉద్యోగుల్ని, క్వాంటం పింఛను తగ్గింపుతో పెన్షనర్లను ఈ ప్రభుత్వం దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానన్న హామీని జగన్‌ తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు శుక్రవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇలాంటి అప్రజాస్వామిక, అణచివేత ప్రభుత్వం అవసరమా? అని వారిని ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెడతామని.. సకాలంలో జీతాలు, మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ‘తెదేపా ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల పోస్టింగులు, బదిలీల కోసం కౌన్సెలింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాం. కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలు భర్తీ చేశాం. 11 డీఎస్సీల ద్వారా లక్షలాది ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేశాం. అంగన్‌వాడీల జీతాల్ని రూ.10,500కు పెంచాం. 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. ఒకటో తేదీకి జీతాలివ్వడానికి ఏనాడూ వెనకాడలేదు’ అని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img