icon icon icon
icon icon icon

వందల ఫిర్యాదులిచ్చాం.. ఏం చర్యలు తీసుకున్నారు?

ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలు.. వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్న అధికారుల తీరుపై ఇప్పటివరకు సుమారు 600 ఫిర్యాదులు ఇచ్చామని.. వీటిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి హరీంధిర ప్రసాద్‌ను తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు.

Updated : 05 May 2024 06:53 IST

సీఈఓ మార్గదర్శకాలు కలెక్టర్లకు అర్థంకావట్లేదు
అదనపు ఎన్నికల అధికారికి  తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలు.. వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్న అధికారుల తీరుపై ఇప్పటివరకు సుమారు 600 ఫిర్యాదులు ఇచ్చామని.. వీటిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి హరీంధిర ప్రసాద్‌ను తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు. ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చడానికి అధికారగణం పనిచేయకూడదని వారు హితవు పలికారు. పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు ప్రభుత్వానికి పడవనే అనుమానంతో.. వాటిని చెల్లకుండా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ ప్రక్రియను ఈ నెల 6వరకు పొడిగించాలని కోరారు. ఈ మేరకు నేతలు వర్ల రామయ్య, అశోక్‌బాబు, బుచ్చిరాంప్రసాద్‌, మన్నవ సుబ్బారావు, ఏఎస్‌ రామకృష్ణ, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. ‘సీఈఓ ఇస్తున్న మార్గదర్శకాలు.. జిల్లా కలెక్టర్లకు అర్థంకావడం లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెజిటెడ్‌ స్టాంప్‌ ఉందా? లేదా? అనేది చూడకుండానే పోస్టల్‌ ఓటింగ్‌ జరిపారు. స్టాంప్‌ ఉండాలని ఆర్వో వారికి చెప్పలేదు. దీంతో సుమారు 50 మంది ఓట్లు ఇన్‌వాలిడ్‌ అయ్యే ప్రమాదం ఉంది. గెలుపోటముల్ని ఒక్కఓటే నిర్ణయిస్తున్న నేపథ్యంలో వీరి ఓట్లనూ పరిగణనలోకి తీసుకోవాలి’ అని వారు డిమాండ్‌ చేశారు. పొన్నూరులో పవన్‌ పర్యటనను అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.


కావాలనే పింఛనుదారుల్ని కష్టపెడుతున్నారు: సీపీఐ

అనంతపురం, న్యూస్‌టుడే: రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగానే పింఛనుదారుల్ని వైకాపా ప్రభుత్వం కష్టపెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అనంతపురంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు వల్ల భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.


‘జగన్‌ కోసం పింఛనర్లనూ వేధిస్తున్న సీఎస్‌’

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌కు రాజకీయ లబ్ధి చేకూర్చడానికే వృద్ధులు, దివ్యాంగుల్ని ఇబ్బందిపెట్టేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. 92 శాతం మందికి పింఛన్‌ పంపిణీ పూర్తయ్యిందని సీఎస్‌ అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.


వైకాపాకు ఓటేస్తే... మీ ఆస్తులు దక్కవు: లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసేందుకు  సీఎం జగన్‌ తెచ్చిన చట్టమే ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. పొరపాటున వైకాపాకు మళ్లీ ఓటేస్తే... మీ భూములు, ఆస్తులు దక్కవని ప్రజల్ని హెచ్చరించారు. జగన్‌ తెచ్చిన ఈ దుర్మార్గపు చట్టాన్ని ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తామని ఎక్స్‌ వేదికగా శనివారం హామీ ఇచ్చారు. ‘ఆలోచించు ఆంధ్రుడా.. మళ్లీ మళ్లీ మోసపోవద్దు’ అని లోకేశ్‌ హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img