icon icon icon
icon icon icon

వైకాపా ప్రలోభాల పర్వం.. కుప్పం, పిఠాపురంలలో ఓటుకు రూ.3-5 వేలు..

ఓటర్లను ఆకట్టుకునేందుకు వైకాపా నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికే అనుకూల పవనాలు వీస్తున్నాయి.

Updated : 10 May 2024 07:42 IST

‘తూర్పు’లో ఓటర్లకు చీరలు, నగదు పంపిణీ

ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ, చిత్తూరు-న్యూస్‌టుడే, కుప్పం: ఓటర్లను ఆకట్టుకునేందుకు వైకాపా నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికే అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైకాపా నాయకులు ఓటర్లను నగదు, చీరలు, బహుమతులతో ప్రలోభ పెడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా నాయకులు, ఐప్యాక్‌ సభ్యులు, రాజీనామా చేసిన వాలంటీర్ల పర్యవేక్షణలో ఓటుకు రూ.2,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఎన్నికల షెడ్యూల్‌ రాక ముందే సిటింగ్‌ ఎంపీ, వైకాపా అసెంబ్లీ అభ్యర్థి భరత్‌రామ్‌ చీరలు పంపిణీ చేశారు. కొత్తపేటలో చీరలు, తాజాగా పోస్టల్‌ బ్యాలట్‌ ఓటర్లకు వెండి నాణేలు అందజేశారు. రాజమహేంద్రవరంలో రూ.2,500, కొవ్వూరు, అనపర్తి, నిడదవోలుల్లో రూ.2,000 చొప్పున, రాజానగరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో రూ.1,500 చొప్పున పంపకాలు చేస్తున్నారు. కాకినాడ, పెద్దాపురంలలో రూ.2,000, తుని, ముమ్మిడివరం, రామచంద్రపురంలలో రూ.1,500, జగ్గంపేటలో రూ.1000 చొప్పున అందజేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఎదుర్కొనేందుకు వైకాపా నాయకులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇక్కడి కొత్తపల్లి మండలంలో ఓటర్లకు రూ.3 వేలు చొప్పున పంచుతున్నారు. గరిష్ఠంగా రూ.5 వేల వరకు ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదని తెలుస్తోంది.

చంద్రబాబు మెజార్టీని తగ్గించేందుకు విశ్వప్రయత్నాలు

కుప్పం నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబును ఓడించడం అసాధ్యమని గ్రహించిన చిత్తూరు జిల్లాకు చెందిన ‘పెద్ద’మంత్రి, వైకాపా నాయకులు ఆయన మెజార్టీ తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కుప్పం పురపాలిక పరిధిలో ఓటుకు రూ.4 వేలు, గుడుపల్లె, రామకుప్పం, శాంతిపురం, కుప్పం మండలాల్లో రూ.3 వేలు చొప్పున ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. ‘పెద్ద’మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి తన మనుషులను కుప్పానికి పంపారు. ఒక్కో మండలంలో 30-50 మందితో పంపకాలు చేయిస్తున్నారు. ఈ విషయంలో స్థానిక నాయకుల చేతికి డబ్బులు ఇవ్వకుండా, ‘పెద్ద’మంత్రి మనుషులను ఓటర్ల వద్దకు తీసుకెళ్లేంత వరకే వారి పాత్రను పరిమితం చేయడం గమనార్హం. ‘మీకు ఎంత అవసరమో చెప్పండి.. అంతేకానీ ఓటర్లకు డబ్బుల పంపిణీలో జోక్యం చేసుకోవద్దు’ అని కుప్పం నియోజకవర్గ వైకాపా నాయకులకు ‘పెద్ద’మంత్రి చెప్పినట్లు తెలిసింది.


ఓటర్లకు వైకాపా కూపన్ల పంపిణీ

దాచేపల్లి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఓటర్లకు తాయిలాలు అందించేందుకు వైకాపా నాయకులు కూపన్లు పంపిణీ చేస్తున్నారు. గురజాల నియోజకవర్గం వైకాపా అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి తరఫున స్థానిక వైకాపా నాయకులు కూపన్లు, సీఎం జగన్‌ చిత్రాలతో ఉన్న క్యాలెండర్లు, స్టార్‌ క్యాంపెయినర్‌ అంటూ ఓ పుస్తకం, వాటి కిందనే ఓటరు వివరాలు, పోలింగ్‌ కేంద్రం పేరు ముద్రించి మాజీ వాలంటీర్లతో పంపిణీ చేయిస్తున్నారు. ఎన్నికల అధికారులకు విషయం తెలిసినా.. పట్టించుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


వైకాపా నాయకుడి ఇంట్లో రూ.కోటి స్వాధీనం!
విశాఖలో రెండు రోజుల కిందట ఐటీ తనిఖీలు

పెందుర్తి, న్యూస్‌టుడే: విశాఖలో ఓ వైకాపా నాయకుడి ఇంట్లో రూ.కోటి నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నగర పాలక సంస్థ 97వ వార్డు సుజాతనగర్‌లోని వైకాపా నాయకుడి ఇంట్లో రెండు రోజుల కిందట ఆదాయపు పన్ను విభాగం(ఐటీ) తనిఖీలు నిర్వహించింది. ఇందులో సుమారు రూ.కోటి నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తనిఖీలు జరిగిన విషయాన్ని పెందుర్తి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి పి.శేష శైలజ, సీఐ రామకృష్ణ ధ్రువీకరించారు. అయితే దానిపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. పెందుర్తి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తరఫున ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు ఈ మొత్తాన్ని నిల్వ చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పక్షాల సానుభూతిపరులు, నాయకుల ఇళ్లలో పెద్దమొత్తంలో డబ్బు ఉండవచ్చనే అంచనాల నేపథ్యంలో ఐటీ విభాగం దీనిపై దృష్టి సారించినట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img