Japan Airlines : ఆ జపాన్ విమానాల్లో లగేజీ సమస్యకు చెక్.. విదేశీయులకు అద్దె దుస్తులు!
తమ విమానంలో ప్రయాణం చేసి జపాన్ (Japan) చేరుకున్న విదేశీయులకు ఆన్ అరైవల్ అద్దె దుస్తులు అందజేస్తామని ‘జపాన్ ఎయిర్ లైన్స్’ (Japan Airlines) కంపెనీ ప్రకటించింది. అసలు ఈ కొత్త పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టింది? ఎలా అమలు చేస్తోంది? తదితర విషయాల గురించి చదివేయండి.
విదేశీ విహార యాత్రలు చేసే వారంతా ఎక్కువగా హోటళ్లలో బస చేస్తుంటారు. అయితే.. ఎక్కడికెళ్లినా వారు దుస్తుల లగేజీ మోసుకెళ్లాల్సిందే. అందుకే ‘జపాన్ ఎయిర్ లైన్స్’(జేఏఎల్) ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. తమ విమానాల్లో ప్రయాణించి జపాన్ (Japan) చేరుకున్న విదేశీ పర్యాటకులకు దుస్తులు అద్దెకిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఆ విశేషాలు తెలుసుకోండి.
అద్దెకు నప్పే దుస్తులు
ఈ నెల 5న జపాన్ ఎయిర్ లైన్స్ ‘ఎనీ వేర్.. ఎనీ వేర్’ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. దాని ప్రకారం జపాన్ చూడాలనుకునే పర్యాటకులు ఎవరైనా సరే రెండు వారాలకు సరిపడా దుస్తులను నెల రోజులు ముందే అద్దెకు తీసుకోవచ్చు. తాము ఆ దేశానికి.. ఏ పని మీద వస్తున్నామో చెబితే నప్పే దుస్తులను నిర్వాహకులు సూచిస్తారు. జపాన్‌లో ఇల్లు లేదా హోటల్ ఎక్కడ బస చేస్తే అక్కడికే ఎంపిక చేసుకున్న దుస్తులను డెలివరీ చేస్తారు. భారత కరెన్సీలో రూ.2300 నుంచి ఈ ప్యాకేజీలు ప్రారంభవుతాయి. మహిళలు ఎవరైనా బిజినెస్ ట్రిప్ కోసం వెళ్తే రూ.2900 ప్యాకేజీలోనే కావాల్సిన వస్త్రాలు అందజేయనున్నారు.
ఈ సౌకర్యాన్ని అందించేందుకు జపాన్ ఎయిర్‌లైన్స్ సుమిటోమో అనే సంస్థతో చేతులు కలిపింది. బుకింగ్, లాండ్రీ, సేకరణ, డెలివరీ బాధ్యతలన్నీ ఆ కంపెనీయే చూసుకుంటుంది. అయితే ఈ దుస్తులన్నీ ఎవరో ఒకరు వాడినవి అయ్యుంటాయి. ఒక వేళ వినియోగదారులు వాటికి నష్టం కలిగిస్తే అందుకు అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
Image : Japan Airlines
పర్యావరణహితం కోసం..
తమ విమానాల నుంచి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చామని జపాన్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ప్రయాణికుల లగేజీ బరువు తగ్గడం వల్ల ఇంధన వినియోగం కూడా తగ్గనుంది. ఈ పథకం ఎంత వరకు విజయవంతం అవుతుందో ఏడాది పాటు పరిశీలిస్తామని వైమానిక సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
వాతావరణ సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలు విడుదల చేసే ఉద్గారాల గురించి అనేక సదస్సుల్లో చర్చలు జరుగుతున్నాయి. నిజానికి విమానయాన రంగం 2 శాతం కార్బన్ డై ఆక్సైడ్ మాత్రమే విడుదల చేస్తోంది. ఇతర ఉద్గారాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే భూగోళం వేడికి విమానయాన సంస్థలు 5 శాతం కారణమవుతున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అందుకే జపాన్ ఎయిర్ లైన్స్ ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
మార్పుపై డేటా సేకరణ
కొవిడ్ మహమ్మారి కథ ముగియడంతో ఇటీవల జపాన్‌ను సందర్శించే విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మే నెలలో 19 లక్షల మంది ఆ దేశాన్ని సందర్శించారు. గతేడాది మేతో పోలిస్తే ఈ సంఖ్య 1200 శాతం అధికం. అందుకే 2024 ఆగస్టు వరకు ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అప్పటి వరకు ప్రయాణికుల లగేజీ ఎంత తగ్గింది? ఇంధన వినియోగంలో మార్పులు వచ్చాయా? కర్బన ఉద్గారాల నియంత్రణ జరిగిందా? ఇటువంటి అంశాల డేటాను సేకరించనున్నారు. జపాన్ ఎయిర్ లైన్స్ అంచనా ప్రకారం 10 కేజీల ప్రయాణికుల సామగ్రి తగ్గిస్తే 7.5 కేజీల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించినట్లవుతుందట. అది 78 రోజులపాటు.. రోజూ 10 నిమిషాల పాటు హెయిర్ డ్రయర్ వినియోగిస్తే వెలువడే ఉద్గారాలకు సమానం.
వెల్లువెత్తుతున్న విమర్శలు
జపాన్ ఎయిర్ లైన్స్ చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం సఫలమవుతుందా? లేక విఫలమవుతుందా అనే విషయం తేలాలంటే ఏడాది ఆగాల్సిందే. అయితే ఈ పథకాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. దుస్తులను అద్దెకివ్వడం వల్ల పర్యావరణానికి ఎలాంటి మేలు జరగదని వారు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రక్రియ లాండ్రీ, ప్యాకేజింగ్ వంటి చర్యలతో ముడిపడి ఉందని అంటున్నారు. అందువల్ల జల కాలుష్యం, ప్లాస్టిక్, డిటర్జెంట్‌ల వాడకం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఒక్కో వ్యక్తికి దుస్తులను డెలివరీ చేయడం కోసం వినియోగించే రోడ్డు రవాణా వ్యవస్థ కూడా కాలుష్యానికి కారణమవుతుందని చెబుతున్నారు. అయితే ఈ నూతన పథకం వల్ల విమానయాన సంస్థ లగేజీ బరువు కోసం ఖర్చు చేసే ఇంధనాన్ని ఆదా చేసుకోనుంది. అద్దె దుస్తుల ఖర్చు మాత్రం ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Seethakka: నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదు: హైకోర్టులో సీతక్క పిటిషన్
-
Mahabubabad: జిల్లా కోర్టు సంచలన తీర్పు.. బాలుడి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
-
Peddha Kapu-1 Movie Review: రివ్యూ: పెదకాపు.. విరాట్, శ్రీకాంత్ అడ్డాల మూవీ మెప్పించిందా?
-
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభం
-
Vishal: సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణలు.. స్పందించిన కేంద్రం
-
Watch: జుట్టుపట్టుకుని.. కిందపడి తన్నుకుని: లైవ్ డిబేట్లో నేతల కొట్లాట