కరోనా అంటే వైరస్‌ ఒక్కటే కాదు.. చాలా అర్థాలున్నాయ్‌

కరోనా.. ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతున్న వైరస్‌. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి అన్ని దేశాలకూ పాకింది. దీంతో ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని పలకరించినా కరోనా గురించే మాట్లాడుతున్నారు. ఏ వార్త చూసినా కరోనా వైరస్‌కు సంబంధించినవే ఉంటున్నాయి. 

Published : 04 Apr 2020 12:18 IST

కరోనా.. ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతున్న వైరస్‌. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి అన్ని దేశాలకూ పాకింది. దీంతో ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని పలకరించినా కరోనా గురించే మాట్లాడుతున్నారు. ఏ వార్త చూసినా కరోనా వైరస్‌కు సంబంధించినవే ఉంటున్నాయి. నిజానికి కరోనా అంటే లాటిన్‌ భాషలో కిరీటం అని అర్థం. ఈ వైరస్‌కి కొమ్ములు ఉండి చివరన కిరీటంలాంటి ఆకారం ఉండటంతో కరోనా అని పేరు పెట్టారు. అయితే కరోనా అంటే అది ఒక్కటే అర్థం కాదు.. చాలా అర్థాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

సూర్యుడు భగభగ మండిపోతుంటాడు. ఆ సూర్యుడి నుంచి వెలువడే మంటలను కరోనా అంటారు. అలాగే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో సూర్యుడి చుట్టూ వలయం ఆకారంలో కనిపించే కాంతిని కూడా కరోనా అని పిలుస్తారట.


విద్యుత్‌ను ప్రసరింపజేసే కండక్టర్‌ చుట్టూ ఉండే విద్యుత్‌శక్తిని కూడా కరోనా అని అంటారు 


మన శరీరంలో కొన్ని భాగాలకు పైభాగంలో కిరీటంలాంటి ఆకారం ఉంటుంది. అలాంటి భాగాన్ని కూడా కరోనా ఉంటారు. ఉదాహరణకు పంటి కొనభాగం, పుర్రెపై భాగం


కొన్ని రకాల పూల మొక్కల్లో పూల మధ్యలో కప్పు ఆకృతి ఉంటుంది. ఆ ఆకృతిని కరోనా అని పిలుస్తారు.


గదిలో గోడ మూలల్లో అలంకరణ కోసం ఏర్పాటుచేసే సీలింగ్‌ డిజైన్‌ను కూడా కరోనా అనే అంటారట.


చర్చిల్లో అమర్చే షాండిలియర్‌నూ కరోనా అనే పిలుస్తారు.


క్యూబా రాజధాని హవానా కేంద్రంగా ‘లా కరోనా’ పేరుతో సిగార్‌లు తయారు అవుతాయి. ‘లా కరోనా’ పేరుకు ట్రేడ్‌మార్క్‌ ఉంది. దీంతో కరోనా అంటే.. ఇది కూడా జాబితాలోకి వచ్చేస్తుంది. మెక్సికోలో ‘కరోనా ఎక్స్‌ట్రా’ పేరుతో బీర్లు ఉత్పత్తి అవుతాయి. తాజాగా కరోనా నేపథ్యంలో వాటి ఉత్పత్తిని నిలిపివేశారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని