India-Pak War: 1965లో ‘పాక్‌ కమాండోలు’ ఆకాశం నుంచి ఊడిపడితే.. మనోళ్లు చితకబాదారు!

సైనిక బలగాలు, నిఘావ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్‌ హమాస్‌ మెరుపు దాడులతో ఉలిక్కిపడింది. అయితే ఇలాంటి దాడులు భారత్‌పై కూడా గతంలో జరిగాయి.

Updated : 12 Oct 2023 19:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: ఇజ్రాయెల్‌ (Israel)పై హమాస్‌ (Hamas) మెరుపు దాడులు ప్రపంచాన్ని కలవరపరిచాయి. అంతర్జాతీయంగా మెరికల్లాంటి సైనిక బలగాలు, నిఘావ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్‌ దాదాపు ఐదు గంటలపాటు చేష్టలుడిగిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి దాడులు భారత్‌పై కూడా జరిగాయి. దాయాది దేశమైన పాకిస్థాన్‌ (Pakistan) నుంచి 1965లోనే ఇలాంటి దాడులు ఎదురుకావడం గమనార్హం. కానీ అప్పట్లోనే మన వీరజవానులు, ప్రజలు కలసికట్టుగా వారి చొరబాట్లను అడ్డుకొని చుక్కలుచూపించారు.

అర్ధరాత్రి 2 గంటలకు పారాచూట్లలో వచ్చి..

1965లో భారత్‌- పాకిస్థాన్‌ యుద్ధం కొనసాగుతోంది. 1947లో భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్‌ ఎలాగైనా భారత్‌ను దొంగదెబ్బ తీయాలని యత్నిస్తోంది. ఈ క్రమంలోనే 1965 సెప్టెంబరు 6 అర్ధరాత్రి 2 గంటలకు పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 180 మంది కమాండోలు భారత్‌లోని పఠాన్‌కోట్‌, హల్వారా, ఆదంపుర్‌ బేస్‌లపై దాడికి పథకం వేశారు. భారత వాయుసేనకు ఈ మూడు ఎయిర్‌బేస్‌లు కీలకమైనవి. వీటిని దెబ్బతీస్తే భారత్‌ వైమానికదళం తమవైపు రాదన్న యోచనతో పాక్‌ అధికారులు వ్యూహం పన్నారు. ఆపరేషన్‌లో భాగంగా అర్ధరాత్రి 2 గంటలకు మూడు విమానాల్లో బయలుదేరారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మూడు ఎయిర్‌బేస్‌లు ఉన్న ప్రాంతంలో పారాచూట్లతో దిగారు.

ఎన్‌సీసీ విద్యార్థుల పహారాలో...

పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో కొందరు ఎన్‌సీసీ విద్యార్థులు ఉన్నారు. వీరితోపాటు కొందరు సిబ్బంది ఆ రోజు రాత్రి బేస్‌ ప్రాంతంలో పాక్‌ కమాండోలు దిగుతుండటాన్ని గుర్తించారు. వెంటనే భద్రతాబలగాలను అప్రమత్తం చేశారు.  వీరికి తోడు స్థానికులు  తోడయ్యారు. బేస్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయభూములతో పాటు పొదలున్నాయి. స్థానికులకు ఈ ప్రాంతంపై పట్టువుండటంతో వేట ప్రారంభించారు. దిగిన పాక్‌ కమాండోలను దిగినట్టే బంధించి చితకబాదారు. వారి నుంచి సమాచారం  సేకరించిన  అధికారులు ఇతర బేస్‌లను అప్రమత్తం చేశారు. ఆదంపుర్‌, హల్వారా ప్రాంతాల్లో ఇలాగే దిగిన  పాక్‌ కమాండోలను పట్టుకున్నారు.  ప్రజలు వీరందరికి దేహశుద్ది చేశారు.  మొత్తం 180 మంది పాక్‌ సైనికుల్లో 22 మంది హతమయ్యారు. దాదాపు 20 మంది వరకు పాక్‌కు పారిపోగా మిగతావారిని జైళ్లకు తరలించారు.

ఎలా సాధ్యమైంది?

భద్రతాబలగాలతో పాటు స్థానిక ప్రజలు శత్రువుల చొరబాటు పట్ల అప్రమత్తంగా ఉండటంతో  మనదేశానికి వచ్చిన ప్రమాదం తొలగిపోయింది. వైరి దేశాలతో సరిహద్దులున్న ప్రాంతాల్లో ప్రజలు శత్రువు కనిపిస్తే వెంటనే స్పందించగలిగేలా వ్యవస్థను  ఏర్పాటు చేసుకోగలిగితే వెంటనే ఫలితముంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని