Jharia coalfield : వందేళ్లుగా మండుతున్న బొగ్గు క్షేత్రం.. చుట్టూ మసి బారుతున్న జీవితాలు!

ఝార్ఘండ్‌లోని ఝరియా బొగ్గు క్షేత్రం గత వందేళ్లుగా మండుతోంది. దాని వల్ల పర్యావరణానికి, ప్రజలకు ఎలాంటి హాని జరుగుతోందో తెలుసుకోండి.

Published : 03 Jul 2023 15:00 IST

భారత దేశంలోని (India) అతి పెద్ద బొగ్గు క్షేత్రాల్లో ఒకటిగా ఝరియా పేరుగాంచింది. ఇది ఝార్ఘండ్‌  (jharkhand) రాష్ట్రం ధన్‌బాద్‌ జిల్లాలో ఉంది. బొగ్గు (Coal) కారణంగా ఈ ప్రాంతం గత వందేళ్లుగా మండుతోంది. అలా ఎందుకు జరుగుతోంది? దాని వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం వాటిల్లుతోంది? తదితర విషయాలు తెలుసుకోండి.

బ్రిటిష్‌ హయాంలోనే ఝరియా బొగ్గు క్షేత్రంలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1916లో ఇక్కడ తొలిసారి మంటలు చెలరేగాయి. అప్పుడు మొదలైన జ్వాల ఇప్పటికీ రగులుతూనే ఉంది. 1973లో ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్ (బీసీసీఎల్‌) ఇక్కడ బొగ్గు తవ్వకాలు చేపట్టింది. అప్పటికే భూగర్భంలో చాలా చోట్ల మైనింగ్‌ జరిగింది. మరోసారి ఒపెన్‌ కాస్ట్ మైనింగ్‌ చేయడం వల్ల మంటలు మరింత అధికమయ్యాయి. మైనింగ్ షాప్ట్‌లలోకి ఆక్సిజన్‌ ప్రవహించడం వల్ల పొగలు కక్కుతున్న బొగ్గుల కుంపట్లు ఎక్కువైపోయాయి. ఆ మంటలు కొన్నిసార్లు అరవై అడుగుల ఎత్తు వరకు ఎగసి పడేవని ఆ భయానక దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు చెబుతున్నారు. 

37 మిలియన్‌ టన్నుల బొగ్గు వృథా

ఝరియా బొగ్గు క్షేత్రంలో మంటల కారణంగా ఇప్పటి దాకా 37 మిలియన్‌ టన్నుల బొగ్గు వృథా అయిందని నిపుణులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో దాని విలువ బిలియన్ల డాలర్లు ఉంటుందట. మంటల వల్ల మరో 1.4 బిలియన్‌ మెట్రిక్‌ టన్నులు అందుబాటులో లేకుండా పోయాయి. కర్బన ఉద్గారాలు అధికంగా గాలిలో కలవడం వల్ల కాలుష్యం స్థాయి కూడా పెరిగింది.

షూ వేసుకున్నా నడవలేరు

నిరంతరం బొగ్గు కాలుతుండటం వల్ల ఈ ప్రాంతం అత్యంత వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయి. కొన్ని సార్లు షూ ధరించి కూడా ఇక్కడ నడవలేమని స్థానికులు చెబుతున్నారంటే వేడి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

క్షీణించిన గాలి నాణ్యత

బొగ్గు మండటం వల్ల విడుదలైన వాయువుల కారణంగా గాలి కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. దాంతో ఊపిరి పీల్చుకోవటం కూడా కొన్ని సార్లు కష్టంగా మారుతోంది. ఇక్కడ గాలి నాణ్యతను పరిశీలించగా.. వాటిలో 40 నుంచి 50 హైడ్రో కార్బన్‌ కాంపాండ్స్‌ వెలుగుచూశాయి. అవన్నీ విషపూరితం, క్యాన్సర్‌ కారకాలని పరిశోధకులు తేల్చారు. ఇక మంటలు ఎక్కువ రోజులు కొనసాగడం వల్ల అనేక చోట్ల భారీ గుంతలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

ముసురుతున్న వ్యాధులు

ఝరియా బొగ్గు గనుల చుట్టూ సుమారు 5 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారిలో చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చిన్నారుల్లో వైకల్యాలు, మస్తిష్క సమస్యలు బయటపడ్డాయి. తల్లి గర్భంలో ఉండగానే కొన్ని వ్యాధులు సంక్రమిస్తున్నట్లు తెలిసింది.

Image : Ehsan Ahmed khan

పెరుగుతున్న బాల కార్మికులు

బొగ్గు గనిలో పనికి వెళ్తూ అనేక మంది చిన్నారులు చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు కూలి వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు వారిని పనికి పంపిస్తున్నారు. పేదరికం కారణంగా దాదాపు 2500-3000 మంది పిల్లలు ఈ పని చేస్తున్నారని కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నాయి.

అదే జీవనాధారం

కేవలం ఝరియాలో మాత్రమే కాదు. ఒక్క అంటార్కిటికాలో తప్ప ప్రపంచంలోని చాలా ఖండాల్లో ఇలాంటి నిప్పు కొండలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఝరియాలో బొగ్గు వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను మరో చోటకు తరలించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే వారు ఇప్పటిదాకా కేవలం 3వేల మందిని మాత్రమే ఝరియాకు 15 కిలోమీటర్ల దూరంలోని బెల్గోరియాకు తరలించగలిగారు. ఎందుకంటే ఇక్కడ ప్రజల జీవితం బొగ్గుతో ముడిపడి ఉంది. బొగ్గు గనిలో పనికి వెళ్తేనే వారికి పూట గడుస్తుంది. అందుకే చావైనా బతుకైనా అక్కడేనని కాలం వెల్లదీస్తున్నారు.

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు