Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Feb 2022 13:11 IST

1. Ukraine Crisis: ఉక్రెయిన్‌ను మూడు ముక్కలు చేసిన పుతిన్‌..

ప్రపంచం భయపడినంతా అయ్యింది.. తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఉక్రెయిన్‌ను మూడు ప్రాంతాలుగా ముక్కలు చేసినట్లైయింది. అప్పటికే ఉన్న ఉక్రెయిన్‌కు తోడు.. దొనెట్స్క్‌,లుహాన్స్క్‌ ప్రాంతాలు దేశాలుగా ఏర్పడినట్లు రష్యా గుర్తించింది. అంతటితో ఆగకుండా.. ఆ కొత్త దేశాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు శాంతి పరిరక్షక దళాల పేరిట రష్యా సేనలను పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రష్యావి భయానక చర్యలు.. ఐరాస వేదికగా అమెరికా మండిపాటు

2. నెల్లూరు చేరుకున్న మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం నెల్లూరు చేరుకుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు.. అక్కడి నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌లో నెల్లూరు పరేడ్‌ గ్రౌండ్స్‌కు తీసుకొచ్చారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం మంత్రి క్యాంపు కార్యాలయంలో భౌతికకాయాన్ని ఉంచారు. మరోవైపు గౌతమ్‌రెడ్డి పార్థివదేహం వద్ద నివాళులర్పించేందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నెల్లూరు చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Bheemla Nayak: బుధవారం ‘భీమ్లానాయక్‌’ ప్రీరిలీజ్‌ వేడుక

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో సోమవారం ‘భీమ్లానాయక్‌’ వేడుకని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ‘ఈ విషాద సమయంలో ‘భీమ్లా నాయక్‌’ వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే సోమవారం జరగాల్సిన విడుదలకి ముందస్తు వేడుకని వాయిదా వేయాలని నిర్ణయించాం’’ అని పవన్‌కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం రద్దయిన ఆ వేడుకని బుధవారం నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఒకటి, రెండు కాదు ఏడు.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండు!

4. అసలు ఎవరీ గంగుబాయి.. ‘మాఫియా క్వీన్‌’ ఎలా అయ్యింది..?

గంగా హర్‌జీవన్‌దాస్‌ గుజరాత్‌కు చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచే సినిమాల్లో కథానాయికగా రాణించాలని కలలు కనేది. హీరోయిన్‌లా రెడీ అవటం, హావభావాలు పలికించటం, దుస్తులు ధరించడం.. ఇలా సినిమాలపై అంతులేని ప్రేమను పెంచుకుంది. ఎలాగైనా ముంబయి వెళ్లి వెండితెరపై రాణించి ధ్రువతారలా ఓ వెలుగు వెలగాలనుకునేది. పైకి కనిపించే అందమైన గులాబీల వెనుక ముళ్లు ఉంటాయన్న సంగతి గుర్తించలేనంత అమాయకురాలు గంగ. ఒక వైపు సినిమా కలలు, మరోవైపు ప్రేమ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Ukraine: శాంతిని కోరుకుంటున్నాం.. కానీ ఉక్రెయిన్‌ భూభాగాన్ని వదులుకునేది లేదు..!

రష్యా -ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ రష్యా చేసిన తాజా ప్రకటన యుద్ధానికి ఆజ్యం పోసేలా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్‌ జెలెన్‌ స్కీ తమ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, అయితే తమ భూభాగాన్ని కోల్పోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Wriddhiman Saha: సాహాను ఎందుకు తప్పించారు..?

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సాహాను ఎంపిక చేయకపోవడంపై అతడి చిన్ననాటి కోచ్‌ జయంత భౌమిక్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏ కారణం చేత టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయలేదో చెప్పాలని ప్రశ్నించాడు. సాహాతో రాహుల్‌ ద్రవిడ్‌ ముందే మాట్లాడటం మంచి విషయమే అయినా.. టెస్టు జట్టు నుంచి ఎందుకు తొలగించారన్నాడు. ‘ఏ కారణం చేత సాహాను టెస్టు జట్టు నుంచి తప్పించారు? ఆటగాళ్లను ఎంపిక చేసేటప్పుడు.. ఫిట్‌నెస్‌, వాళ్ల గత ప్రదర్శన ఆధారంగానే ఎంపిక చేస్తారు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* బీసీసీఐ అడిగినా ఆ జర్నలిస్టు పేరు చెప్పను: సాహా

7. Andhra News: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు..

తెదేపా సీనియర్‌నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైకాపా నేత రామకృష్ణ నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లజర్లలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించిన సభలో సీఎంపై అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రామకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. అయ్యన్నపై 153ఎ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘టైర్ల లోడు’ లారీలు దారి మళ్లించి దోపిడీలు.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు సభ్యుల గల ముఠాను పహాడీషరీష్‌ పోలీసులు అరెస్టు చేశారు. టైర్ల లోడుతో వెళ్లే లారీలను లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐదు రోజుల కిందట పహాడీషరీఫ్‌ పరిధిలో టైర్ల లారీని దారి మళ్లించి ఓ గోదాములోకి తీసుకెళ్లిన నిందితులు టైర్లను విక్రయించినట్లు వెల్లడించారు. లారీ డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మరో రెండు విజయాలు సాధించిన ప్రజ్ఞానంద

ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను సోమవారం ఓడించిన భారత యువ కెరటం ప్రజ్ఞానంద తాజాగా మరో రెండు రౌండ్లలో విజయం సాధించాడు. మంగళవారం జరిగిన పోటీల్లో ఈ 16 ఏళ్ల యువ గ్రాండ్‌మాస్టర్‌ రష్యా ఆటగాడు నాడిర్‌బెక్‌ అబ్దుసట్టారావ్‌తో డ్రా చేసుకోగా.. 10, 12 రౌండ్లలో అండ్రీ ఎసిపెంకో, అలెగ్జాండ్రా కోస్టిన్యూక్‌లను ఓడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 13 వేలకు దిగొచ్చిన కేసులు.. 1.24 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొద్దిరోజులుగా కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడోరోజు 20 వేల దిగువనే నమోదైన కేసులు.. తాజాగా 13 వేలకు తగ్గిపోయాయి. పాజిటివిటీ రేటు 1.24 శాతానికి క్షీణించింది. మృతుల సంఖ్య కూడా అదుపులోనే ఉంది. మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలను వెలువరించింది.  సోమవారం 10,84,247 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కోలుకున్నా కొందరిలో తీవ్ర దుష్ప్రభావం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని