Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 May 2022 13:03 IST

1. వైకాపా రాజ్యసభ సభ్యుల పరిశీలనలో ఐదుగురి పేర్లు!

ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై అధికార వైకాపా దృష్టి సారించింది. రాజ్యసభ అభ్యర్థుల పరిశీలనలో విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి, కిల్లి కృపారాణి, ఆర్‌.కృష్ణయ్య ఉన్నట్లు సమాచారం. ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్‌. కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు సీఎం జగన్‌ను కలిసే అవకాశం ఉంది. మరోవైపు జగన్‌ ఇవాళ పార్టీ ముఖ్యనేతలలో సమావేశం కానున్నారు. అనంతరం రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ట్విటర్‌ కొనుగోలుపై మరో బాంబ్‌ పేల్చిన మస్క్‌!

ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం ఖరారు తర్వాత రోజుకో అప్‌డేట్‌తో ఎలాన్‌ మస్క్‌ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన మంగళవారం చేసిన ఓ ట్వీట్‌ వ్యాపారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక్కో ట్విటర్‌ షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తానని ఒప్పందంలో పేర్కొన్న ఆయన.. తాజాగా దాన్ని తగ్గించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెప్పుకొచ్చారు. అంటే ఆయన ఒప్పుకున్న 44 బిలియన్‌ డాలర్ల కంటే తక్కువ చెల్లించి ట్విటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 పరుగు పందెంలో విజేతగా నిలిచిన 60 ఏళ్ల మహిళ యధార్థ గాథ

3. బెంగళూరుపై పులి.. ఇతర జట్లపై పిల్లి.. పంజాబ్‌పై విమర్శలు

భారత టీ20 లీగ్‌లో ఇప్పటివరకు ట్రోఫీ అందుకోని వాటిల్లో బెంగళూరు, పంజాబ్‌ జట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ టోర్నీ ప్రారంభమై 15 సీజన్లు పూర్తికావస్తున్నా ఇంకా తొలి కప్పు కోసం నిరీక్షిస్తూనే ఉన్నాయి. అయితే, గత మూడేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న పోటీల్లో పంజాబ్‌దే ఆధిపత్యం. గతరాత్రి దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 160 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేకపోయినా.. ఈ సీజన్‌లో బెంగళూరుపై రెండు సార్లు 200పైచిలుకు పరుగులు చేసి విజయాలు సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నిరాశపర్చిన ఎల్‌ఐసీ లిస్టింగ్‌

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎల్‌ఐసీ ఐపీఓ షేర్లు నేడు మార్కెట్లలో లిస్టయ్యాయి. గత కొన్ని రోజులుగా గ్రేమార్కెట్‌ ట్రేడింగ్‌ సూచించినట్లుగానే షేర్లు నష్టంతో ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. దీంతో భారీ ఆశలతో దరఖాస్తు చేసుకున్న మదుపర్లకు నిరాశ తప్పలేదు. ముఖ్యంగా లిస్టింగ్‌ గెయిన్స్‌ కోసం బిడ్లు దాఖలు చేసిన చిరుమదుపర్లు చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది. ఎన్ఎస్‌ఈలో ఈ షేరు ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే 8.11 శాతం నష్టంతో రూ.872 వద్ద లిస్టయ్యింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ₹50లక్షలు తీసుకుని చైనీయులకు వీసా.. కార్తి చిదంబరంపై కొత్త కేసు

 కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తిపై కేంద్ర దర్యాప్తు సంస్థ మరో కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేడు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది. అయితే ఈ తనిఖీలపై కార్తి వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. తమ ఇంట్లో సీబీఐ రికార్డు స్థాయిలో సోదాలు చేసి ఉంటుంది అంటూ విమర్శించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సయమంలో కార్తి రూ.50లక్షలు తీసుకుని 250 మంది చైనా దేశస్థులకు వీసా సదుపాయం కల్పించారని ఆరోపణలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 మహేశ్‌బాబును ఇలా చూసుండరు.. వేదికపై డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

6. విశాఖలో ఉపాధ్యాయుల మహా నిరసన

సీపీఎస్‌ రద్దు, టెన్త్‌ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్‌, ఇతర సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాలు విశాఖలో మహా నిరసన చేపట్టాయి. క్వీన్‌మేరీ పాఠశాల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులు తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. తమ సమస్యలను ఎన్నో సార్లు ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని.. అందుకే నిరసనకు దిగాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కిమ్‌ రాజ్యంలో ఒక్కరోజే 2.7లక్షల కరోనా కేసులు..!

ఉత్తర కొరియాలో కొవిడ్‌ విజృంభణ తీవ్ర స్థాయికి చేరినట్లే కన్పిస్తోంది. అక్కడ రోజువారీ కేసులు ఏకంగా లక్షల్లో ఉండటం వైరస్‌ ఉద్ధృతికి అద్దం పడుతోంది. భారీగా టెస్టులు చేసే అవకాశం ఉత్తరకొరియాకు లేకపోవడంతో.. లక్షణాల ఆధారంగానే కరోనాగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే 2,69,510 మంది తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు మీడియా వెల్లడించింది. ఇక జ్వరం కారణంగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తమిళానికి అడ్డొస్తే హిందీని వ్యతిరేకించక తప్పదు

‘హిందీని వ్యతిరేకించను. అలాగని నా మాతృభాష తమిళానికి అడ్డుపడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని’ విశ్వనటుడు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. కమల్‌ స్వీయ నిర్మాణంలో హీరోగా నటించిన చిత్రం ‘విక్రమ్‌’. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు. ఫహద్‌, విజయ్‌సేతుపతి తదితరులు నటించారు. జూన్‌ 3న చిత్రం విడుదల కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 పోలీసు కొలువులకు దరఖాస్తుల వెల్లువ

9. ఆరునెలల్లో గ్రీన్‌కార్డ్స్‌ దరఖాస్తుల ప్రాసెస్‌..!

అమెరికాలో గ్రీన్‌ కార్డులు లేదా శాశ్వత నివాసం కోసం వచ్చిన దరఖాస్తులను ఆరు నెలల్లోపు ప్రాసెస్‌ చేయాలనే సిఫార్సును అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సిఫార్సును ఆమోదం కోసం శ్వేత సౌధానికి పంపించనున్నారు. ఆసియా అమెరికన్లు, నేటివ్‌ హవాయిన్స్‌, పసిఫిక్‌ ఐలాండర్స్‌పై నియమించిన ఈ అడ్వైజరీ కమిషన్‌ సిఫార్సును అమలు చేస్తే.. గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న చాలా మంది ఇండో-అమెరికన్ల కల సాకారం కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ దేశాలు నాటోలో చేరితే మాకు సమస్యేం లేదు.. కానీ!

ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాలు.. అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో చేరితే తమకెలాంటి సమస్యలు లేవని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. వీటి చేరిక తన దేశానికి ‘తక్షణ ముప్పు’ కలిగించదన్నారు. ఇప్పటికే క్లిష్టంగా ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల్ని మరింత తీవ్రం చేయడానికి అమెరికా నాటో విస్తరణను దూకుడుగా ఉపయోగిస్తోందని మండిపడ్డారు. నాటోలో చేరేందుకు ముందుకువచ్చిన దేశాల్లో సైనిక సదుపాయాలను పెంపొదిస్తే.. తమ స్పందన చవిచూస్తాయని వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని