Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... 

Updated : 07 Nov 2022 12:59 IST

1. పార్టీ పేరు మార్పుపై తెరాస బహిరంగ ప్రకటన

తెరాస పేరు మార్పుపై ఆ పార్టీ బహిరంగ ప్రకటన జారీ చేసింది. పార్టీ పేరును ‘భారత్‌ రాష్ట్ర సమితి’గా మారుస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ పేరిట జారీ అయిన ఈ ప్రకటనలో పార్టీ కొత్త పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే పంపాలని అందులో సూచించారు. అభ్యంతరాలను 30 రోజుల్లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. సోనియా, రాహుల్‌ గాంధీకి మళ్లీ ఈడీ సమన్లు?

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు మళ్లీ విచారించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ కేసులో ఆ మధ్య వీరిద్దరినీ ఈడీ అధికారులు కొన్ని రోజులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత చేపట్టిన దర్యాప్తులో కాంగ్రెస్‌కు చెందిన ‘యంగ్‌ ఇండియా’ సంస్థకు కొన్ని అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అతడిని ఎంతో నమ్మాను.. బాయ్‌ఫ్రెండ్‌ గురించి పెదవి విప్పిన జాన్వి

తన ఆప్త మిత్రుడు ఒర్హాన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor). అతడితో ఉంటే తాను ఎప్పుడూ సంతోషంగా ఉంటానని ఆమె చెప్పారు. ‘మిలీ’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్నేహితుడి గురించి స్పందించారు. ‘‘ఒర్హాన్ నాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. అతడితో ఉంటే నేను ప్రతిక్షణం ఆనందంగానే ఉంటా. అన్నివిషయాల్లోనూ ఎంతోకాలం నుంచి అండగా నిలిచాడు. అతడిని ఎంతో నమ్మాను. అతడు నా పక్కన ఉంటే మా ఇంట్లో ఉన్నాననే భావన కలుగుతుంది’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ సమయంలో ధోనీ చేసిన మెసేజ్‌ నాకు బలంగా తాకింది: విరాట్

యువ క్రికెటర్లకు స్ఫూర్తిమంతంగా నిలిచిన టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ.. కష్టాల్లో ఉన్న సహచరులకు ధైర్యం చెప్పడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడని అభిమానులకు తెలిసిన విషయమే. దానికి ప్రత్యక్ష ఉదాహరణ విరాట్ కోహ్లీ ఉదంతమే. గత ఏడాది టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత స్పందించిన ఏకైక వ్యక్తి ధోనీ అని విరాట్ చెప్పాడు కదా.. తాజాగా ధోనీ గురించి మరో విషయం కూడా విరాట్ బయటపెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మెటాలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ కోతలు వేల సంఖ్యలోనే ఉండొచ్చని ఆంగ్లపత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో పేర్కొంది. నవంబర్‌ 9వ తేదీన ఈ అంశంపై మెటా నుంచి ప్రకటన వెలువడవచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పినట్లు తెలిపింది. సెప్టెంబర్‌ 30వ తేదీ నాటి గణాంకాల ప్రకారం ప్రస్తుతం మెటాలో ప్రపంచ వ్యాప్తంగా 87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ సరైందే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10శాతం కోటా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. ఈ రిజర్వేషన్లను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ విషయంపై దాఖలైన పలు పిటిషన్లపై ఇటీవల విచారణ ముగించిన సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై 3:2తో ధర్మాసనం తీర్పు వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అయ్యో.. తప్పు దొర్లింది.. తిరిగి ఆఫీసుకి రండి!

తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందిని తిరిగి ఆఫీసుకు రమ్మంటూ ట్విటర్‌ (Twitter) సందేశాలు పంపిస్తోందట! జాబితాలో కొన్ని తప్పులు దొర్లాయని దీంతో పొరపాటున కొంతమందిని ఇంటికి పంపించాల్సి వచ్చిందని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. అలాగే మరికొంత మంది నైపుణ్యాన్ని, అనుభవాన్ని గుర్తించడంలోనూ విఫలమైనట్లు ట్విటర్‌ (Twitter) భావిస్తున్నట్లు సదరు వ్యక్తులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మాస్టారూ.. మళ్లీ మీరే రావాలంటూ రోడ్డెక్కిన విద్యార్థినులు

తమ అభిమాన టీచర్‌ బదిలీపై వెళ్తున్నారని తెలిసి కన్నీటిపర్యంతమైన విద్యార్థినులు.. ఆయన మళ్లీ రావాలంటూ నేడు రోడ్డెక్కారు.  ఖమ్మం జిల్లా కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు తన డిప్యుటేషన్ రద్దు కావడంతో కారేపల్లి మండలం రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. ఆయన వెళ్తున్న సమయంలో విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. వెళ్లొద్దంటూ బోరున విలపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బౌలర్‌ ఎలా ఆలోచిస్తాడో.. నేనూ అలానే ఆలోచిస్తా: సూర్యకుమార్‌ యాదవ్‌

 ఈ పొట్టి ప్రపంచకప్‌లో తన బ్యాటింగ్‌ విశ్వరూపం చూపిస్తూ.. బౌలర్లను ఊచకోత కోయడమే పనిగా పెట్టుకుంటూ.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు భారత యువ 360 సూర్య కుమార్‌ యాదవ్‌. ఇక నిన్న జింబాబ్వేపై జరిగిన సూపర్‌ 12 చివరి మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌ అద్భుతం. తనకు మాత్రమే సాధ్యమైన షాట్లతో వీరవిహారం చేస్తూ కేవలం 25 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇమ్రాన్‌ఖాన్‌ ఆ నటులను మించిపోయారు..!

ఇటీవల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ డ్రామా చేస్తున్నారని అక్కడి రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. పాకిస్థాన్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ అధినేత మౌలాన ఫజ్లూర్‌ రెహ్మాన్‌ మాట్లాడుతూ.. ఇమ్రాన్‌పై దాడిని ఓ డ్రామాగా అభివర్ణించారు. ఇమ్రాన్‌ నటనా చాతుర్యంలో.. సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌లను మించిపోయారని ఎద్దేవా చేశారు. వజీరాబాద్‌ ఘటన తర్వాత తనకు ఇమ్రాన్‌పై సానుభూతి కలిగిందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని