Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Jun 2023 17:02 IST

1. జగన్ పులివెందులకు ఏం చేశారు?: నారా లోకేశ్‌

వైఎస్‌ జగన్ పాలనలో రాష్ట్రంలో విపరీతంగా పన్నులు పెంచి ప్రజల్ని పీడిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. పులివెందుల ప్రజలు కూడా జగన్ బాధితులే అని అన్నారు. గురువారం పులివెందులలోని తెదేపా నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. పులివెందులలో గెలవకపోయినా ఈ నియోజకవర్గాన్ని ఎప్పుడూ చిన్న చూపు చూడలేదన్నారు. అన్ని నియోజకవర్గాల లాగే పులివెందులను అభివృద్ధి చేశామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విద్యార్థులు నైపుణ్యాలు అలవరుచుకుంటే ఉద్యోగాలు అవే వస్తాయి: కేటీఆర్‌

తెలంగాణలో ఆ రోజుల్లో రెడ్‌టేప్‌ ప్రభుత్వం ఉంటే.. ఇవాళ రెడ్‌కార్పెట్‌ సర్కారు ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మెట్టుగడ్డలోని బాలికల ఐటీఐ కళాశాలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వివేకా హత్యకేసులో 8వ నిందితుడిగా అవినాష్‌రెడ్డి: సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దని ఈనెల 5న దాఖలు చేసిన కౌంటర్‌లో సీబీఐ పలు కీలక విషయాలు ప్రస్తావించింది. వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఈ కేసులో సీబీఐ ఎనిమిదో నిందితుడిగా చేర్చింది. గతంలో దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాష్‌రెడ్డిని సహనిందితుడిగా పేర్కొన్నారు తప్ప ఎక్కడా కూడా నిందితుడిగా చెప్పలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా మోదీకి మద్దతుగా నినాదాలు.. !

గత కొద్ది నెలలుగా దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీలో ఓ యూనివర్శిటీ ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు నిరసన సెగ తగిలింది. సభలో ఆయన ప్రసంగిస్తుండగా కొందరు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపి, తాను చెప్పేది ఓపికతో వినాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రూ.500నోట్ల ఉపసంహరణ ఆలోచన లేదు : ఆర్బీఐ

రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ నోట్లన్నీ డిపాజిట్లు, మార్పిడి రూపంలో బ్యాంకులకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రూ.500 నోట్లను కూడా ఆర్బీఐ ఉపసంహరించుకుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై తాజాగా ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. రూ.500 నోట్లను ఉపసంహరించుకోవడం, రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం వంటి ఆలోచన లేదని స్పష్టతనిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విమానం రష్యాకు మళ్లించిన ఘటన.. ప్రయాణికులకు ఎయిరిండియా ఆఫర్‌

దిల్లీ నుంచి బయల్దేరి సాంకేతిక లోపం కారణంగా 39 గంటల పాటు రష్యాలో చిక్కుకుపోయిన ఎయిరిండియా ప్రయాణికులు ఎట్టకేలకు అమెరికా చేరుకున్నారు. ముంబయి నుంచి వెళ్లిన ప్రత్యేక విమానం.. ఆ ప్రయాణికులను తీసుకుని గురువారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) శాన్‌ఫ్రాన్సిస్కోలో ల్యాండ్‌ అయ్యింది. అయితే, ఈ ఘటనతో తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ఎయిరిండియా క్షమాపణలు చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కెనడాలో భారతీయ విద్యార్థుల బహిష్కరణ ముప్పు.. స్పందించిన జై శంకర్‌

కొద్దినెలలుగా కెనడా(canada)లో వందలాదిమంది విద్యార్థులు బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నారు. దాంతో వారంతా వీధుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కెనడా విశ్వవిద్యాలయాల్లో మోసపూరిత అడ్మిషన్ల ద్వారా వీసాలు పొందామని అధికారులు ఆరోపిస్తున్నారని వారు వాపోయారు. ఇటీవల కెనడా బోర్డర్ సర్వీసెస్‌ ఏజెన్సీ(CBSA) 700 మందికి బహిష్కరణ లేఖలు ఇచ్చింది. విద్యార్థుల అడ్మిషన్ల ఆఫర్‌ లెటర్లు నకిలీవని గుర్తించిన తర్వాత ఈ లేఖలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అత్యంత లోతులో హోటల్‌.. ప్రయాణం కూడా సాహసమే!

ప్రపంచంలో అనేక హోటళ్లు వాటికవే కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో బ్రిటన్‌ లోని ‘ది డీప్‌ స్లీప్‌ హోటల్‌’ ఒకటి. భూగర్భంలో ఏర్పాటు చేసిన దీనికి.. ప్రపంచంలోనే అత్యంత లోతైన హోటల్‌గా గుర్తింపు ఉంది. దీన్ని చేరుకునేందుకు ఓ సాహస యాత్రే చేయాల్సి ఉంటుంది. బండరాళ్ల గనుల గుండా ట్రెక్కింగ్‌ చేస్తూ.. అనేక పురాతన వంతెనలు, మెట్ల బావులు దాటుకుంటూ.. కఠిన దారుల్లో గంటకుపైగా నడక సాగించాల్సిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దీర్ఘకాలిక కొవిడ్‌.. క్యాన్సర్‌ కంటే ప్రమాదం..: తాజా అధ్యయనంలో వెల్లడి

దీర్ఘకాల కొవిడ్‌ (Covid) బాధితుల్లో వైరస్‌ తీవ్ర ప్రభావం చూపిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ వైరస్‌ సోకిన తర్వాత ఎక్కువ కాలం కోలుకోని వారి ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధ్యయనం (Study) పేర్కొంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నాలుగో స్థాయిలో ఉన్న బాధితుడి అనారోగ్యం కంటే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తోందని తేల్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 200MP కెమెరా..5000mAh బ్యాటరీతో రియల్‌మీ 11ప్రో ఫోన్లు

రియల్‌మీ 11 ప్రో సిరీస్‌ (Realme 11 Pro Series) స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లో విడుదలయ్యాయి. రియల్‌మీ 11 ప్రో 5G, 11 ప్రో+ 5G (Realme 11 Pro+) పేరిట వస్తున్న ఈ ఫోన్లు మే 10నే చైనా మార్కెట్‌లోకి వచ్చేశాయి. వీటిలో 6.7 ఫుల్‌ హెచ్‌డీ+ తెర, ఆక్టాకోర్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. ఇవి మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని