RBI: రూ.500నోట్ల ఉపసంహరణ ఆలోచన లేదు : ఆర్బీఐ

ఇటీవల ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లలో 50శాతం నోట్లు ఇప్పటికే బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ గవర్నర్‌ (RBI Governor) శక్తికాంతదాస్‌ వెల్లడించారు.

Updated : 08 Jun 2023 14:48 IST

ముంబయి: రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ నోట్లన్నీ డిపాజిట్లు, మార్పిడి రూపంలో బ్యాంకులకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రూ.500 నోట్లను కూడా ఆర్బీఐ ఉపసంహరించుకుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై తాజాగా ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. రూ.500 నోట్లను ఉపసంహరించుకోవడం, రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం వంటి ఆలోచన లేదని స్పష్టతనిచ్చింది. ఇటువంటి ఊహాగానాలను వ్యాప్తి చేయవద్దని పౌరులకు సూచించింది.

రూ. 2000నోట్లు 50శాతం వెనక్కి..

ఇటీవల ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లలో 50శాతం ఇప్పటికే బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ గవర్నర్‌ (RBI Governor) శక్తికాంతదాస్‌ వెల్లడించారు. వీటి విలువ రూ.1.80 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే నోట్లన్నీ దాదాపు 85శాతం డిపాజిట్ల రూపంలోనే బ్యాంకు ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని మార్చుకునేందుకు సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఉందని.. అయినప్పటికీ చివరి నిమిషం వరకూ వేచి ఉండవద్దని పౌరులకు సూచించారు. మార్పిడి చేసుకునేందుకుగాను ఆర్బీఐ దగ్గర ఇతర ఇతర కరెన్సీ ఉందని పేర్కొన్నారు.

మరోవైపు, 2018 మార్చి 31 నాటికి గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్ల మేర రూ.2.000 నోట్లు చలామణిలో ఉన్నట్లు అంచనా. అయితే, 2023 మార్చి 31 నాటికి కేవలం రూ.3.62 లక్షల కోట్లు మాత్రమే చాలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది. తాజాగా వీటిలో సగం ఇప్పటికే బ్యాంకులకు చేరిందని తెలిపింది. ఉపసంహరణ ప్రకటన చేసిన కేవలం 20 రోజుల్లోనే సగం నోట్లు వెనక్కి రావడం గమనార్హం. 

మార్కెట్‌లో చలామణిలో ఉన్న రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మే 19న ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికీ లావాదేవీలకు వీటిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు