Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 18 May 2022 17:00 IST

1. బస్టాండ్‌ కట్టలేని వారు 3 రాజధానులు కడతారా?: చంద్రబాబు

 వైకాపా ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని.. ఇక ఎవరూ ఆపలేరని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడపలో పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. బాదుడే బాదుడుతో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ఒంగోలులోని స్టేడియం ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

2. రాష్ట్రాల్లో పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి: సీఎం కేసీఆర్‌

తెలంగాణలో తడిసిన వరి ధాన్యాన్ని కూడా కొంటామని... ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వరి ధాన్యం సేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి, 3. ధాన్యం సేకరణ ప్రక్రియపై ఆరా తీశారు.


Video: అట్టహాసంగా ప్రారంభమైన కేన్స్ చలనచిత్రోత్సవం


3. కోనసీమ జిల్లా పేరు మార్పు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం!

కోనసీమ జిల్లా పేరు మారనుంది. ఆ జిల్లా పేరును డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి.

4. మేమొస్తే 30 రోజుల్లో రుణమాఫీ: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని.. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని  విమర్శించారు. హైదరాబాద్‌లో తెలంగాణ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

5. షీనా బొరా హత్య కేసు.. ఇంద్రాణీ ముఖర్జియాకు బెయిల్‌

ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బొరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జియాకు  సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలిచ్చింది. విచారణ పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టనుండటంతో ఆమెకు బెయిలిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.


Srikakulam: పరీక్ష హాల్లోనే విద్యార్ధి మృతి


 

6. 113 విమానాలు రష్యార్పణం..!

పశ్చిమ దేశాల ఆంక్షలు ఐర్లాండ్‌కు చెందిన ఓ సంస్థకు పీడకలగా మారాయి. ఆ సంస్థకు చెందిన 113 భారీ విమానాలను రష్యా సీజ్‌ చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగినందుకు పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకొంది. ఐర్లాండ్‌కు చెందిన ఏరోకాప్‌ హోల్డింగ్స్‌కు చెందిన 113 విమానాలు, 11 ఇంజిన్లను రష్యా అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. రష్యా చర్యలు తీసుకోవడానికి ముందే 22 విమానాలు, 3 ఇంజిన్లను మాత్రం విజయవంతంగా ఏరోకాప్‌ హోల్డింగ్స్‌ వెనక్కి తెచ్చుకోగలిగింది.

7. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌తో తలపడేదెవరు?

భారత టీ20 లీగ్‌ చివరి దశకు చేరింది. దీంతో ఒక్కో మ్యాచ్‌ ఆసక్తిగా సాగుతోంది. ప్లే ఆఫ్స్‌కు చేరే ఆ 3 జట్లు ఏవీ అనే విషయంలో ఇంకా లెక్క తేలలేదు. తొలి స్థానం గుజరాత్‌కి పక్కా అనేది అందరికీ తెలిసిందే. పాయింట్ల పట్టికలో గుజరాత్ 20 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఆ జట్టు ఇంకా బెంగళూరుతో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అదీ గెలిస్తే మొత్తం 22 పాయింట్లతో లీగ్‌ స్టేజ్‌ను దిగ్విజయంగా పూర్తి చేయనుంది. ఒకవేళ ఓడినా తొలి స్థానానికి ఢోకా లేదు. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌, లఖ్‌నవూ చెరో 16 పాయింట్లతో ఉన్నాయి.

8. చివరగా బర్గర్‌ రుచి చూసేందుకు.. బారులు తీరుతున్న రష్యన్లు..!

‘ఆహారాన్ని అందుబాటులో ఉంచడం, వేల సంఖ్యలో సాధారణ పౌరులకు ఉపాధిని కొనసాగించడం కచ్చితంగా సరైన పని అని కొందరు వాదించొచ్చు. కానీ, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని విస్మరించడం అసాధ్యం. అందుకే రష్యాలో వ్యాపారాన్ని కొనసాగించడం ఇక ఏ మాత్రం సమర్థనీయం కాదు. అది మెక్‌డొనాల్డ్స్‌ విలువలకు ఏ మాత్రం సరిపోదు’ అంటూ అమెరికన్ ఫాస్ట్‌ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్‌ ప్రెసిడెంట్ రష్యాలోని తన సిబ్బందికి ఇటీవల లేఖ పంపారు.


Video: రష్యా వేసిన ఎత్తుకు ఉక్రెయిన్ చిత్తు


9. ఇప్పుడు మరో ఛార్లీ చాప్లిన్‌ రావాలేమో..: జెలెన్‌స్కీ

రష్యా దండయాత్రలో నలిగిపోతున్న తమకు అండగా నిలిచి.. క్రెమ్లిన్‌ దురాగతాలను గొంతెత్తి చాటాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థించారు. ప్రతిష్ఠాత్మక చలన చిత్రోత్సవం కేన్స్‌ వేడుక ఫ్రాన్స్‌లో మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌ నుంచి లైవ్‌ శాటిలైట్‌ వీడియో ద్వారా కేన్స్‌ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ప్రసంగం చేశారు.

10. రుచిసోయా చేతికి పతంజలి ఫుడ్‌ బిజినెస్‌

పతంజలి ఆయుర్వేదకు చెందిన ఆహార పదార్థాల వ్యాపారాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్నట్లు రుచిసోయా బుధవారం ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ రూ.690 కోట్లు. ఎఫ్‌ఎంసీజీ రంగంలో అగ్రగామిగా నిలిచే ప్రయత్నంలోనే భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పతంజలి పేరిట ఉన్న నెయ్యి, తేనె, మసాలాలు, పండ్ల రసాలు, గోధుమ పిండి సహా మొత్తం 21 ఉత్పత్తులు రుచిసోయా సొంతం కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని