Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 07 Apr 2024 16:59 IST

1.జగన్‌ కుంభకర్ణుడు.. 6నెలల ముందు నిద్రలేచారు: షర్మిల

వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓదార్చారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్‌ యాదవ్‌ ఇటీవల హత్యకు గురయ్యారు. కేసులో ఎస్‌ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయని, నిందితులంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులేనని షర్మిల ఆరోపించారు. భూమి కోసం అవినాష్‌ అనుచరులే హత్య చేశారని విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.  సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసు

సీఎం జగన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌మీనా నోటీసు ఇచ్చారు. సీఎం తన ప్రసంగాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఈవో.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3.‘భారత్‌ అద్భుతం’.. ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడి ప్రశంసలు

పేదరిక నిర్మూలన, కోట్లాది మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంలో భారత్‌ పనితీరు అద్భుతమని ఐరాస జనరల్‌ అసెంబ్లీ (UNGA) అధ్యక్షుడు డేనిస్‌ ఫ్రాన్సిస్‌ కొనియాడారు. అందుకోసం డిజిటలైజేషన్‌ను (Digitalisation) సమర్థంగా వినియోగించుకుంటోందని తెలిపారు. ఫోన్‌ లాంటి ఒక డివైజ్‌, డిజిటలైజేషన్‌ మోడల్‌తోనే ఇది సాధ్యమవుతోందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. భాజపాకు 300కు పైగా సీట్లు.. తెలంగాణలో తొలి లేదా రెండో స్థానం: ప్రశాంత్‌ కిశోర్‌

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీల గెలుపోటములపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార భాజపాకు (BJP) 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. తూర్పు, దక్షిణ భారతంలోనూ ఆ పార్టీ సీట్లు, ఓట్లశాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. అవినాష్ రెడ్డి ఏమైనా పాలు తాగే పిల్లాడా..?: సునీత

రాజకీయంగా అడ్డొస్తున్నారని వైఎస్‌ వివేకాను హత్య చేశారని ఆయన కుమార్తె సునీత ఆరోపించారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా సునీత ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ‘‘మంచి మనిషి, సౌమ్యుడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏదైనా చేయొచ్చు. కానీ.. నేను పద్ధతి ప్రకారమే వెళ్తున్నాను’’ అని సునీత అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ‘జమ్మూలో.. ఇన్నేళ్లు రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేదు’ - మోదీ

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోపై (Congress Manifesto) భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అది ముస్లిం లీగ్‌ మేనిఫెస్టో మాదిరిగానే ఉందని, బుజ్జగింపు రాజకీయాల కోసమే దాన్ని రూపొందించినట్లుగా కనిపించిందన్నారు. బిహార్‌లోని నవాడ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ.. ఆర్టికల్‌ 370 రద్దుపై కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. విద్యుత్‌ అక్రమాలపై 100 రోజుల్లో నివేదిక: జస్టిస్‌ నరసింహారెడ్డి

థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణ పనుల్లో అక్రమాలు, ఛత్తీస్‌గఢ్‌తో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు చేసుకున్న పీపీఏలపై విచారణ ప్రారంభించామని జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా విచారణ చేపడతామని, వంద రోజుల్లో నివేదిక సమర్పిస్తామని తెలిపారు. గతంలో నిర్మించిన థర్మల్‌ ప్లాంట్‌లు, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న పీపీఏలపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. మంగళగిరిలో కన్‌స్ట్రక్షన్‌ అకాడమీ ఏర్పాటు చేస్తాం: నారా లోకేశ్‌

చిర్రావూరు, పాతూరు, గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన బైక్‌ మెకానిక్‌లు, ఇసుక ముఠా కార్మికులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. పాత ఇసుక విధానంతో నిర్మాణరంగానికి గత వైభవం తీసుకొస్తామన్నారు. నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్‌స్ట్రక్షన్‌ అకాడమీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బైక్‌మెకానిక్‌లకు అధునాతన వాహనాలపై శిక్షణ అందిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. దక్షిణ చైనా సముద్రంలో పోటీగా డ్రాగన్‌ కాంబాట్‌ పెట్రోల్స్‌..!

దక్షిణ చైనా సముద్రంలో ఆదివారం డ్రాగన్‌ కాంబాట్‌ పెట్రోల్స్‌ నిర్వహించింది. అమెరికా, ఫిలిప్పీన్స్‌, జపాన్‌, ఆస్ట్రేలియా సంయుక్త విన్యాసాలు ప్రారంభించన రోజే ఈ చర్యకు దిగడం గమనార్హం. చైనా (China) కవ్వింపుల నేపథ్యంలో తమ దళాలు సంయుక్త విన్యాసాలు చేస్తాయని నాలుగు దేశాల డిఫెన్స్‌ ఛీఫ్‌లు శనివారం ప్రకటించారు. వెంటనే పీఎల్‌ఏ సదరన్‌ థియేటర్‌ కమాండ్‌ దీనికి స్పందించింది. తమ నౌకా, వైమానిక దళాలు కూడా దక్షిణ చైనా సముద్రంలో కాంబాట్‌ పెట్రోల్స్‌ నిర్వహిస్తాయిని ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10.  ‘సింగిల్ వర్డ్‌’ రిజెక్షన్‌.. సంస్థ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలు

ఉద్యోగం కోసం పరీక్షలను, ఇంటర్య్వూలను ఎదుర్కొన్న అనంతరం సెలక్ట్‌ అయ్యామా? లేదా?అనేది కంపెనీ నుంచి వచ్చే సమాధానంతో తెలుస్తుంది. కొన్ని సంస్థలు నేరుగా అభ్యర్థికి కాల్‌ చేసి చెబుతుంటాయి. మరికొన్ని మెయిల్స్‌ రూపంలో తెలియజేస్తాయి. అలాగే సెలక్ట్‌ కాకపోతే ఎందుకు చేయలేదనే విషయమూ అందులో ప్రస్తావిస్తుంటారు. కానీ, ఇటీవల ఓ అభ్యర్థికి మాత్రం విభిన్నమైన అనుభవం ఎదురైంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని