Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 22 Aug 2022 14:15 IST

1. ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర రాష్ట్రాల్లోనూ ఈహెచ్‌ఎస్‌

ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్ఎస్) కార్డులపై ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవల కోసం అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద ఇప్పటివరకూ కవర్‌ కాని 565 వైద్య విధానాలను ఉద్యోగులకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యం చేసిన బిల్లులను ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లోనే ఆటోడెబిట్‌ స్కీమ్‌ ద్వారా చెల్లింపులకు అంగీకారం తెలిపింది.

2. మూడు దశాబ్దాలు కాంగ్రెస్‌కు హోంగార్డును.. ట్విటర్‌ ప్రొఫైల్‌ను మార్చేసిన ఎంపీ కోమటిరెడ్డి

గత కొద్ది రోజులుగా పీసీసీ తీరుపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ట్విటర్‌ ప్రొఫైల్‌లో తాను కాంగ్రెస్‌ హోంగార్డు అంటూ పేర్కొనడం గమనార్హం. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ప్రస్తుతం ఎంపీని.. అని పేర్కొంటూ మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌ పార్టీకి హోంగార్డుగా పనిచేస్తున్నానని తన ట్విటర్‌ ఖాతాలో ఆయన మార్పులు చేశారు. 


Video: ఫ్రీడం ఫర్‌ ర్యాలీ.. గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌


3. మాధవ్‌ నగ్న వీడియో నకిలీది కాదు.. ఇదిగో ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌: పట్టాభి

హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో నకిలీది కాదని.. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్ధారించినట్లు తెలుగుదేశం నేతలు వెల్లడించారు. ఈమేరకు పార్టీ తరఫున వీడియోను ప్రైవేటుగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. ఆ వీడియోలో మార్ఫింగ్‌ జరగలేదని ల్యాబ్‌ నిపుణుడు జిమ్‌ స్టాఫ్‌ వార్డ్‌ నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు. ల్యాబ్‌ ఇచ్చిన నివేదికను పార్టీ నేతలు కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, వంగలపూడి అనిత బహిర్గతం చేశారు.

4. మంకీపాక్స్‌ ప్రమాదకరం కాదు కానీ... ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

మంకీపాక్స్‌ ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్నిచోట్ల మరణాలు కూడా సంభవించాయి. ఇది స్మాల్‌పాక్స్‌లాగే తగ్గుతుందని చెప్పినా కొందరికి ప్రమాదకరంగా మారుతుందనే వాదన కూడా వస్తోంది. జ్వరం వచ్చి చర్మంపై నీటి బుడగలు వస్తే పాక్స్‌గా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. అన్ని పాక్స్‌ల్లో ఇదే తరహా సమస్య ఉన్నా కోతుల నుంచి వచ్చిన మంకీపాక్స్‌ మనుషుల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ శంకరప్రసాద్‌ వివరించారు.

5. వాళ్లే మా సినిమాను ట్రోల్‌ చేశారు..అందుకే ఇలా! కరీనా కపూర్‌

ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘లాల్‌ సింగ్ చడ్డా’ పైనే గత కొంతకాలంగా బాలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం(ఆగస్టు11)దేశవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రారంభ వసూళ్లను దక్కించుకోలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో వసూళ్లు రాకపోవడంపై సినీ పండితులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సినిమా ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచే ‘బాయ్‌కట్‌ లాల్‌ సింగ్‌చడ్డా’ ట్యాగ్‌లైన్‌తో సామాజిక మాధ్యమాల్లో కొందరు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు.


రివ్యూ: కార్తికేయ-2


6. కాచుకో టీమ్‌ఇండియా.. సవాల్‌కి సిద్ధంగా ఉండండి!

దాదాపు ఆరేళ్ల తర్వాత జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడేందుకు టీమ్‌ఇండియా హరారేకి బయల్దేరి వెళ్లింది. కేఎల్‌ రాహుల్ నాయకత్వంలోని భారత్‌ ఆగస్ట్‌ 18న తొలి వన్డేలో జింబాబ్వేతో తలపడనుంది. ఆగస్టు 20, ఆగస్టు 22న మ్యాచ్‌లను ఆడనుంది. తాజాగా బంగ్లాదేశ్‌ వంటి జట్టును ఓడించిన జింబాబ్వే.. భారత్‌కు సవాల్ విసిరడం గమనార్హం. తమ జట్టుతో టీమ్‌ఇండియా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు జింబాబ్వే ప్రధాన కోచ్‌ డేవ్ హౌటన్. 

7. LIC పాల‌సీదారుల‌కు శుభ‌వార్త‌.. ల్యాప్స్ అయిన పాల‌సీల‌ పున‌రుద్ధరణకు అవకాశం

దేశీయ అతి పెద్ద జీవిత‌ బీమా సంస్థ‌ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC).. త‌మ పాల‌సీదార్ల‌కు శుభ‌వార్త తెలిపింది. ర‌ద్దయిన పాలసీలను పునరుద్ధరించాలనుకునే వారికి.. ప్రత్యేక అవకాశాన్ని ఇస్తున్న‌ట్లు ప్రకటించింది. అయితే ఇది వ్య‌క్తిగ‌త పాల‌సీల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ఈ ఆఫ‌ర్‌లో భాగంగా అన్ని యులిప్‌-యేత‌ర పాల‌సీల‌ను ఆల‌స్య రుముసు చెల్లించి పున‌రుద్ధరించుకోవ‌చ్చు. ఆల‌స్య రుసుములో రాయితీ కూడా అందిస్తుంది. ఈ ఆఫ‌ర్ ఆగ‌స్టు 17 నుంచి అక్టోబ‌రు 21 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

8. ఇదొక ‘లంచం.. మంచం ప్రభుత్వం’.. కర్ణాటక మాజీ మంత్రి వ్యాఖ్యలపై దుమారం!

‘కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలి’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రియాంక్‌ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో అవినీతి జరుగుతోందని ఆరోపించే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే తనయుడైన ప్రియాంక్‌ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై భాజపా ఎదురుదాడికి దిగింది.


Video: ఇల్లు కూలుస్తుండగా.. గోడలో నుంచి బయటపడ్డ పురాతన లాకర్!


9. మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!

ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 61 పతకాలు దేశానికి అందించి.. భారత్‌ను నాలుగో స్థానంలో నిలిపిన క్రీడా బృందం శనివారం ప్రధాని మోదీని కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో వారితో ముచ్చటించారు. వారు సాధించిన విజయాలను కొనియాడారు. అలాగే చెస్‌ ఒలింపియాడ్ నిర్వహణ గురించి ప్రస్తావించారు.

10. ఎవరీ హాది మతార్‌.. సల్మాన్‌ రష్దీపై ఎందుకు దాడికి పాల్పడ్డాడు..?

భారత మూలాలున్న ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీ(75)పై జరిగిన దాడి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. తీవ్ర గాయాలపాలైన రష్దీ కాలేయం దెబ్బతిందని, ఓ కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన బుక్ ఏజెంట్ ఒకరు రాయిటర్స్‌కు వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉన్నారని, పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిపారు. అందరూ చూస్తుండగానే వేదికపైకి దూసుకొచ్చి కత్తితో రచయితపై దాడి చేసింది ఓ యువకుడు. అతడిని న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హాది మతార్‌గా గుర్తించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని