Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Sep 2022 09:15 IST

1. వత్సా.. నీ పట్టుదలకు మెచ్చా

అమెరికాలో ఉన్నత చదువు ఆశయం..యూఎస్‌లోని ప్రఖ్యాత యూనివర్సిటీలో సీటు..విజయవంతంగా కోర్సు పూర్తి..అయినా దక్కని ఉద్యోగం..ఇప్పుడెలా? ఈ పరిస్థితి ఎదుర్కోవడానికేనా ఇంత దూరం వచ్చింది.. ఇంత గొప్పగా చదివింది అన్న సంఘర్షణ..సీన్‌ కట్‌ చేస్తే 23 ఏళ్లు నిండని ఆ కుర్రాడు ఇప్పుడు ప్రపంచబ్యాంకులో కొలువు కొట్టేసి ఎందరికో ఆదర్శమైపోయాడు. ఈ ఘనత తానెలా సాధించానన్నది అతడు లింక్డ్‌ఇన్‌ వేదికగా పంచుకోగా అది వైరల్‌గా మారింది. దానిని ఇప్పటి వరకూ 15వేల మంది లైక్‌ చేశారు. అనేకమంది షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బాడుగకు బాయ్‌ ఫ్రెండ్‌!

 గంటల ఆధారంగా మీకు కావలసిన బాయ్‌ ఫ్రెండ్‌ను బాడుగకు ఇస్తామంటూ బెంగళూరులో కొందరు టెకీలు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించడం సంచలనంగా మారింది. ప్రియుడు వంచించాడనో, ప్రేమ విఫలమైందనో, నిజమైన ప్రేమ దక్కలేదనో వ్యథకు గురైన వారికి ‘టాయ్‌ బాయ్‌’ పేరిట వీరు ఒక పోర్టల్‌ను ప్రారంభించారు. కాకపోతే ఆ ‘బాయ్‌’ ఎవరి వద్దకూ భౌతికంగా రాడు. ఫోన్‌ ద్వారా వారి సమస్యను పూర్తిగా విని మానసిక ఆందోళనను దూరం చేసేందుకు సహకారం అందిస్తాడని పోర్టల్‌ను అభివృద్ధి చేసిన కౌశల్‌ ప్రకాశ్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కొవిడ్‌తో పిల్లలకు మధుమేహ ముప్పు!

కొవిడ్‌-19 బారినపడిన పిల్లలు, కౌమారప్రాయులకు టైప్‌-1 మధుమేహం ముప్పు బాగా పెరుగుతున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. 13 దేశాల్లో 18 ఏళ్ల లోపు వయసున్న 10 లక్షల మందిపై దీన్ని నిర్వహించారు. కొవిడ్‌ సోకాక ఆరు నెలలలోపు వీరిలో అనేక మంది కొత్తగా మధుమేహం బారినపడుతున్నట్లు గుర్తించారు. కరోనా బారినపడని వారితో పోలిస్తే ఇలాంటివారిలో వ్యాధి ముప్పు 73 శాతం అధికమని తేల్చారు. అయితే దీనికి ఇన్‌ఫెక్షనే కారణమా అన్నది ఇంకా వెల్లడి కాలేదు. టైప్‌-1 మధుమేహాన్ని ఆటోఇమ్యూన్‌ వ్యాధిగా పరిగణిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బీటెక్‌ రెండో ఏడాదే కొలువు బాట

 చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కలల దీపం.. సాఫ్ట్‌వేర్‌ కొలువు. బీటెక్‌ నాలుగో సంవత్సరం ఎప్పుడు పూర్తవుతుంది? మంచి కంపెనీలో ఎన్ని రోజుల్లో ఉద్యోగం వస్తుంది? అన్నదే వారి ఆందోళన.. ఆదుర్దా! కానీ.. ఇదంతా ఒకప్పటి మాట. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం ఇప్పుడు బీటెక్‌ నాలుగో సంవత్సరంలోకి ప్రవేశించే వరకు కూడా ఆగాల్సిన పనిలేదు. మెరికల్లాంటి ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఐటీ కంపెనీలే కళాశాలలకు వచ్చి, కోర్సు పూర్తవకముందే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వాట్సప్‌లో ఇక లింక్‌లతోనూ వాయిస్‌, వీడియో కాల్‌లు

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘వాట్సప్‌’లో ఈ వారం నుంచి కొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై ఆ యాప్‌లో వీడియో, వాయిస్‌ కాల్‌ల కోసం ఇతరులను ఆహ్వానించేందుకు ప్రత్యేక లింక్‌లను ఉపయోగించుకోవచ్చు. లింక్‌పై క్లిక్‌ చేసిన వెంటనే కాల్‌లో చేరేందుకు ఈ సదుపాయం వీలు కల్పిస్తుంది. వాట్సప్‌లోని ‘కాల్‌’ సెక్షన్‌లోకి వెళ్లి లింక్‌ను సృష్టించొచ్చు. ఇందుకోసం యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సీఎంను విమర్శిస్తే పథకాలు రద్దు చేస్తాం

ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు పొందుతూ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఎవరైనా విమర్శిస్తే వారి సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర హెచ్చరించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో సోమవారం జరిగిన చేయూత పథకం చెక్కు పంపిణీ సభలో రాజన్నదొర మాట్లాడుతూ.. కొందరు గిట్టనివారు పథకాలు పొందుతూ సీఎం జగన్‌, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఈ పద్ధతి సరికాదని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వాహనాలకు పండగ ఉత్సాహం!

దసరా - దీపావళి పండగల సమయంలో కొత్త వాహనాలు కొనేందుకు అధికులు ఉత్సాహం చూపుతారు. కొవిడ్‌ పరిణామాలు, చిప్‌ కొరత వల్ల గత రెండేళ్లు విక్రయాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ అవరోధాలు తొలగినందున, వాహన కంపెనీలు ఈసారి తమ విక్రయాలు పెంచుకునేందుకు సరికొత్త మోడళ్లను విడుదల చేస్తూ, సులభ వాయిదాలపై కొనుగోలుకు రుణ సదుపాయాన్నీ కల్పిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ద్రవిడ్‌ను దాటేశాడు..

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ కోహ్లి ఖాతాలో మరో ఘనత. అతడు అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రాహుల్‌ (24,064, 504 మ్యాచ్‌లు) ద్రవిడ్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు. 33 ఏళ్ల కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 471 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 24078 పరుగులు చేశాడు. సచిన్‌ (34,357, 664 మ్యాచ్‌లు) మాత్రమే విరాట్‌ కన్నా ముందున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 71 శతకాలు, 125 అర్ధశతకాలు సాధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాళ్లరిగేలా తిరిగినా ఫలితం సున్నా

సమీకరణలో భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారంలో సీఆర్డీఏ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లకు పలు చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ప్లాట్లను అభ్యంతరకర భూముల్లో ఇవ్వడమే ఇందుకు కారణం. వీటిని మార్చి మరో చోట ఇవ్వమని అన్నదాతలు ఏళ్ల తరబడి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. కష్ట సమయాల్లో తమకు అక్కరకొస్తాయనుకున్న ప్లాట్లు కాగితాలకే పరిమితం అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రజా ప్రతినిధులకే దళితబంధు వరం

వెనుకబడిన దళిత కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కొందరు ప్రజాప్రతినిధులు, దళారులకు వరంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల సమీక్షలు, ఆదేశాలు, ప్రభుత్వ సూచనలన్నీ కేవలం కాగితాలకే పరిమితం కాగా... వాస్తవ పరిస్థితుల్లో యూనిట్‌ మొత్తంలో సగానికి సగం కూడా లబ్ధిదారుల దరికి చేరడం లేదని తెలుస్తోంది. ఆర్థికంగా నిలబడటం మాటేమో కానీ, అదనంగా ఆర్థిక కష్టాలను కొనితెచ్చుకునే పరిస్థితులను పలువురు ఎదుర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని