కరోనా కలుషిత లేఖలొస్తున్నాయి.. జాగ్రత్త!

రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులకు కొంతమంది దుండగులు కరోనా వైరస్‌తో కలుషితం చేసిన లేఖల్ని పంపే ప్రమాదం ఉందని ఇంటర్నేషన్‌ పోలీసు ఆర్గనైజేషన్‌(ఇంటర్‌పోల్‌) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పోలీసు, సీబీఐ, సీఐడీ వంటి చట్ట పరిరక్షణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.........

Published : 20 Nov 2020 13:54 IST

హెచ్చరించిన ఇంటర్‌పోల్‌

దిల్లీ: రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులకు కొంతమంది దుండగులు కరోనా వైరస్‌తో కలుషితం చేసిన లేఖల్ని పంపే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్‌ పోలీసు ఆర్గనైజేషన్ ‌(ఇంటర్‌పోల్‌) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పోలీసు, సీబీఐ, సీఐడీ వంటి చట్ట పరిరక్షణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఇటీవల 194 సభ్యదేశాలకు మార్గదర్శకాలకు జారీ చేసింది. మరికొన్ని సందర్భాల్లో కొంతమంది కావాలనే పోలీసులు, ఇతర తనిఖీ, నిఘా అధికారులు, వైద్య, అత్యవసర సిబ్బంది ముఖంపై ఉమ్మడం, దగ్గడం చేస్తున్నారని ఇంటర్‌పోల్‌ తెలిపింది. పలు దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. ఇది ప్రమాదకరమైన విషయమని.. ప్రతిఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించింది. 

కొన్ని చోట్ల లేఖలు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లే వస్తువుల ఉపరితలాలపై కావాలనే కొంతమంది ఉమ్మడం, దగ్గడం చేస్తున్న ఘటనలూ వెలుగులోకి వచ్చాయని ఇంటర్‌పోల్‌ తెలిపింది. ఇలాంటి లేఖల్ని రాజకీయ నాయకులు, ప్రముఖులకు పంపుతున్నట్లు కొంతమంది నుంచి బెదిరింపు కాల్స్‌ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయంది. ప్రముఖుల భద్రతా వ్యవస్థలో భాగంగా ఉన్న సిబ్బంది వీటిపై అవగాహన కలిగి ఉండాలని ఇంటర్‌పోల్‌ సూచించింది. సైబర్‌ క్రైం, ఉగ్రవాద నిరోధక సంస్థలు ఆన్‌లైన్‌ మోసాలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని పేర్కొంది. తపాలా, ఇతర ఫ్రంట్‌ డెస్క్‌ సిబ్బందికి ఈ అంశంపై అవగాహన కల్పించాలని కోరింది. అనుమానిత పార్శిళ్లను క్షుణ్నంగా తనిఖీ చేసి కావాల్సిన రక్షణ చర్యలన్నీ తీసుకోవాలని ఇంటర్‌పోల్‌ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని