Lok Sabha polls: మోదీ గ్యారంటీ vs కాంగ్రెస్‌ న్యాయ్‌ గ్యారంటీ.. 2024 పోరు షురూ!

లోక్‌సభ ఎన్నికల్లోనూ (Lok Sabha Elections) ‘గ్యారంటీ’ల హవా నడుస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టిన ప్రధాన రాజకీయ పార్టీలు వీటినే (Guarantee) అస్త్రాలుగా మలుచుకున్నాయి.

Published : 16 Mar 2024 18:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల సీజన్‌ అంటేనే రాజకీయ పార్టీల వాగ్దానాలు. ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని చూడాలని అధికారంలో ఉన్నవారు చెబుతుంటే.. విపక్ష పార్టీలు మాత్రం అధికారంలోకి వచ్చేందుకు కొత్త హామీలను కురిపించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లోనూ (Lok Sabha Elections) ‘గ్యారంటీ’ల హవా నడుస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టిన ప్రధాన రాజకీయ పార్టీలు వీటినే (Guarantee) అస్త్రాలుగా మలుచుకున్నాయి. హామీలు ఎలా ఉన్నా రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించేవి మాత్రం క్షేత్రస్థాయి అంశాలే. ఈక్రమంలో లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) ప్రచారంలో క్షేత్రస్థాయిలో లేవనెత్తే అవకాశమున్న పలు అంశాలను పరిశీలిస్తే..

మోదీ కీ గ్యారంటీ: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఎన్నికల ప్రచారంలో ‘మోదీ గ్యారంటీ’ నినాదాన్నే ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. యువత, మహిళా సాధికారత, రైతుల సంక్షేమంతోపాటు దశాబ్దాలుగా నిరాదరణకు గురైన అట్టడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ‘మోదీ గ్యారంటీ’లో భాగమని చెబుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఇదే నినాదం తాజా ఎన్నికల్లో అధికార, ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధానికి తెర తీస్తోంది.

కాంగ్రెస్ న్యాయ్‌ గ్యారంటీ : వరుస ఓటములతో నిరాశలో మునిగిపోయిన కాంగ్రెస్‌ పార్టీకి ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఊపిరినిచ్చాయి. ‘ఐదు గ్యారంటీ’లతో ఎన్నికలకు వెళ్లిన హస్తం పార్టీ అధికారాన్ని చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ‘5 న్యాయ్‌ గ్యారంటీ’ మంత్రాన్ని బయటకు తీసి.. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, ఇతర వర్గాలకు న్యాయం పేరుతో హామీలు కురిపిస్తోంది. మణిపుర్‌ నుంచి ముంబయికి ‘భారత్‌ జోడో న్యాయ్‌యాత్ర’ మొదలుపెట్టిన అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ హామీలను ప్రకటించారు. ఈ వాగ్దానాలతోనే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

నిరుద్యోగం, ధరల పెరుగుదల: దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుండటంతోపాటు నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చిన విషయాన్ని కాంగ్రెస్‌తో పాటు విపక్ష ‘ఇండియా’ కూటమి ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఉద్యోగాలు కల్పించకపోవడమే అతిపెద్ద సమస్య అని విపక్షాలు చెబుతుంటే.. అధికార భాజపా మాత్రం వీటిని తిప్పికొడుతోంది. పెరుగుతోన్న ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ఉదహరిస్తోంది.

ఆర్టికల్‌ 370 రద్దు, సీఏఏ అమలు : భాజపా సుదీర్ఘకాలంగా ఇస్తోన్న వాగ్దానాల్లో ఇవి ముఖ్యమైనవి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంతోపాటు పౌరసత్వ సవరణ చట్టం అమలులో సాధించిన విజయాన్ని కాషాయ పార్టీ ప్రధానంగా ప్రచారం చేసుకోనుంది. ఉమ్మడి పౌరస్మృతిని జాతీయస్థాయిలో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోన్న భాజపా.. ఉత్తరాఖండ్‌లో చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రజల్లో విభజన తెచ్చే ప్రయత్నమని విమర్శలు గుప్పిస్తున్నాయి.

రామ‌ మందిరం: శతాబ్దాలుగా ఎదురుచూసిన రామమందిరం నిర్మాణం చివరకు సాకారమైంది. జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ (Ayodhya Ram Mandir) వేడుకకు ప్రధాని మోదీ నేతృత్వం వహించడంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోదీ వల్లే ఇది సాధ్యమైందని పార్టీ శ్రేణులు పేర్కొంటుండగా.. ఇది భాజపాకు లబ్ధి చేకూర్చే అంశమేనని విపక్ష పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి!

ఎన్నికల బాండ్లు : సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం అయ్యాయి. వీటిపై అనేక అనుమానాలు వ్యక్తంచేస్తోన్న కాంగ్రెస్‌.. ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించడంతోపాటు, భాజపా బ్యాంకు ఖాతాలనూ నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే కొన్నిరోజుల ముందే తెరపైకి రావడంతో విపక్షాలు దీన్ని ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

‘అమృత్‌ కాల్‌’ వర్సెస్‌ ‘అన్యాయ్‌ కాల్‌’ : సుపరిపాలన, వేగవంతమైన వృద్ధి, భవిష్యత్తు కోసం దార్శనికతపై మోదీ హామీ ఇస్తున్నట్లు భాజపా చెబుతోంది. దీన్నే ‘అమృత్‌ కాల్‌’గా పేర్కొంటోంది. కానీ, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవస్థల అణిచివేత, రాజ్యాంగంపై దాడి, ఆర్థిక అసమానతలు గత పదేళ్లలో పెరిగాయని చెబుతోన్న కాంగ్రెస్‌.. ఇది ‘అన్యాయ్‌ కాల్‌’ అని విమర్శలు గుప్పిస్తోంది.

రైతుల ఆందోళన : కనీస మద్దతు ధర, ఇతర సమస్యలపై ఉద్యమం చేస్తోన్న రైతులు.. దేశ రాజధానిని మరోసారి ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని లేవనెత్తుతోన్న విపక్షాలు.. రైతులను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శిస్తున్నాయి. భాజపా నేతలు మాత్రం రైతులతో చర్చలు జరుపుతున్నామని, ఇది రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఇది కూడా ఓ ప్రచారాస్త్రంగా మారనుంది.

పార్టీ సిద్ధాంతాలు: ఈ ఎన్నికలు భాజపా, కాంగ్రెస్‌ల మధ్య ‘సిద్ధాంతాల యుద్ధం’ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రెండు పార్టీలు తమ సైద్ధాంతిక సూత్రాలను ప్రజల ముందు ఉంచనున్నాయని, వీటిలో ఏది కావాలో తేల్చుకోవాలని ఓటర్లను కోరనున్నట్లు చెబుతున్నారు.

వికసిత్‌ భారత్‌ విజన్‌: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రధాని మోదీ ఉద్ఘాటిస్తున్నారు. 2047 నాటికి లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెబుతోంది. దీన్నే వికసిత్‌ భారత్‌గా భాజపా ప్రచారం చేస్తున్నప్పటికీ.. విపక్షాలు మాత్రం దీన్ని ‘మరో మోసం’ అని ఆరోపిస్తున్నాయి. ఇలా లోక్‌సభ ఎన్నికల వేళ పలు కీలక అంశాలు క్షేత్రస్థాయిలో ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని