Covid 19: జేఎన్‌.1 ఉపరకం కేసులు@312.. కేరళలోనే సగం!

దేశంలో కొవిడ్‌-19 జేఎన్‌.1 ఉపరకానికి సంబంధించి ఇప్పటివరకు 312 కేసులు గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది.

Updated : 02 Jan 2024 19:39 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌ (Coronavirus) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జేఎన్‌.1 ఉపరకం కేసులు భారీగా నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 312 కేసులు గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది. వీటిలో 47శాతం కేసులు కేరళలోనే ఉండటం గమనార్హం.

కొవిడ్‌ ‘జేఎన్‌.1’ ఉపరకం కేసులు ఇప్పటివరకు పది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో బయటపడ్డాయి. అత్యధికంగా కేరళలో (147), గోవా (51), గుజరాత్‌ (34), మహారాష్ట్ర (26), తమిళనాడు (22), దిల్లీ (16), కర్ణాటక (ఎనిమిది), రాజస్థాన్‌ (ఐదు), తెలంగాణ (రెండు), ఒడిశాలో ఒక కేసు నిర్ధారణ అయినట్లు ఇన్సాకాగ్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 573 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 4565కు చేరుకున్నట్లు అయ్యింది.

ఇదిలాఉంటే, ‘జేఎన్‌.1’ ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. ముప్పు తక్కువేనని పేర్కొంది. అమెరికా, సింగపూర్‌ సహా పలు దేశాల్లో ఈ సబ్‌ వేరియంట్‌ వ్యాప్తిలో ఉన్నట్లు తెలిపింది. మనదేశంలోనూ ఈ ఉపరకం కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ భరోసా ఇచ్చింది. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని