ఇండోనేషియాలోనూ ప్రమాదకర ‘డీ614జీ’ వైరస్‌!

అత్యంత ఎక్కువ తీవ్రత కలిగిన పరివర్తనం చెందిన కరోనా వైరస్‌ తాజాగా ఇండోనేషియాలోనూ బయటపడింది.

Updated : 30 Aug 2020 18:22 IST

తాజాగా గుర్తించిన ఇండోనేషియా నిపుణులు

జకర్తా: అత్యంత ఎక్కువ తీవ్రత కలిగిన పరివర్తనం చెందిన కరోనా వైరస్‌ తాజాగా ఇండోనేషియాలోనూ బయటపడింది. ప్రస్తుతం ఉన్న వైరస్‌తో పోలిస్తే 10రెట్ల తీవ్రత కలిగిన ‘డీ614జీ’ వైరస్‌ ఈ మధ్య మలేసియాలోనూ బయటపడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిని ఇండోనేషియాలో గుర్తించినట్లు జకర్తాలోని ఐజక్‌మాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మాలిక్యూలర్‌ బయోలజీ వెల్లడించింది. అయితే, ఈ ప్రాంతంలో గత కొన్నిరోజులుగా కేసుల సంఖ్య పెరగడానికి ఈ వైరస్‌ కారణమా? అని తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని సంస్థ డిప్యూటీ డైరక్టర్‌ హెరవాతీ సుడోయో మీడియాకు వెల్లడించారు.

కరోనా వైరస్‌ పరివర్తనం చెందిన ఈ ‘డీ614జీ’ వైరస్‌ను‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిబ్రవరి నెలలోనే గుర్తించింది. ఈ వైరస్‌కు విస్తృత వేగంతో వ్యాప్తించే గుణం ఉన్నప్పటికీ దీనివలన ప్రాణాపాయం ఎక్కువగా ఉన్నట్లు తేలలేదని అంతర్జాతీయంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండడంతో ఆ ప్రాంతంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉంటూ, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని  సూచిస్తున్నారు. ఇక తాజాగా బయటపడ్డ ఇండోనేషియాలోనే ఇప్పటికే వైరస్‌ వ్యాప్తి గణనీయంగా పెరిగిందని, పరీక్షల్లో బయటపడుతున్న కేసుల కంటే ఎక్కువగానే ఉండొచ్చని స్థానిక వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటివరకు ఇండోనేషియాలో 1,72,000 పాజిటివ్‌  కేసులు నమోదుకాగా 7300 మరణాలు సంభవించాయి. ఇండోనేషియాలో తాజాగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాగే కొనసాగితే ఈ సంవత్సరం చివరినాటికి ఇండోనేషియాలో కేసుల సంఖ్య ఐదు లక్షలకు చేరుకుంటుందని అక్కడి నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అక్కడి ఆరోగ్యశాఖ అప్రమత్తంచేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు