గంటల తరబడి వాదనలా?కట్టలుగా పత్రాలా? 

గంటల తరబడి వాదనలు వినిపిస్తుండడం, కట్టల కొద్దీ పత్రాలు సమర్పిస్తుండడంపై గురువారం సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Published : 09 Jul 2021 09:59 IST

సంక్షిప్తంగా ఉంటే వేగంగా తీర్పులు 
న్యాయవర్గాలు చర్చించాలి 
ఫేస్‌బుక్‌ కేసు తీర్పులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

దిల్లీ: గంటల తరబడి వాదనలు వినిపిస్తుండడం, కట్టల కొద్దీ పత్రాలు సమర్పిస్తుండడంపై గురువారం సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మౌఖిక వాదనలకు సమయ పరిమితి విధిస్తే ఎలా ఉంటుందని అభిప్రాయపడింది. ఫేస్‌బుక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌-సీయీవో అజిత్‌ మోహన్‌కు దిల్లీ శాసనసభ శాంతి-సామరస్య కమిటీ సమన్ల వ్యవహారమై ఇచ్చిన తీర్పులో ఈ సూచన చేసింది. దిల్లీలో జరిగిన అల్లర్లపై విచారణ జరుపుతున్నందున తమ ముందుకు హాజరై సమాచారం ఇవ్వాలని ఆ కమిటీ నోటీసు పంపడంతో దీనిని సవాలు చేస్తూ ఆయన వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాససం ఈ కేసును విచారణకు చేపట్టింది. వినతిని తిరస్కరించింది. వాదనలు జరిగే తీరులో మార్పులు రావాలని, దీనిపై న్యాయవర్గాలు చర్చలు జరపాలని సూచించింది. దీంట్లోని ముఖ్యాంశాలు...

ప్రస్తుత కేసులో...

‘‘ఈ కేసును పరిశీలిస్తే ఇరు పక్షాలు 26 గంటల పాటు వాదనలు వినిపించాయి. దానికితోడు లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాయి. అదనపు లిఖితపూర్వక వాదనలు అంటూ మరికొన్ని పత్రాలు ఇచ్చాయి. పాత తీర్పుల ఉదాహరణలు అంటూ చాలా పత్రాలు ఇచ్చాయి. వీటిని పరిశీలించడమే చాలా కష్టంగా మారింది. అందువల్ల పాత పద్ధతులను విడనాడి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది. ముందుగా వాదనల సారాంశాన్ని సంక్షిప్తంగా లిఖిత పూర్వకంగా ఇవ్వాలి. దానికి అనుగుణంగానే మౌఖిక వాదనలు వినిపించాలి. పాత తీర్పులో ఏ భాగం అవసరమో అంతవరకే తీసుకోవాలని జూనియర్లకు సూచించండి. సాధారణ కేసుల్లో కూడా సుదీర్ఘ వాదనలు ఉంటున్నాయి. దాంతో ముఖ్యమైన చట్టపరమైన అంశాలకు వివరణ ఇవ్వడం ఆలస్యమవుతోంది. అందుకే కోర్టులు విచారణకే పరిమితమవుతున్నాయి. తీర్పులు తరాల తరవాత వస్తున్నాయి’’ అని పేర్కొంది. ప్రధాన వ్యాజ్యంపై తీర్పు ఇస్తూ శాసనసభ కమిటీ నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఏమీ అయిపోలేదు కదా అని వ్యాఖ్యానించింది. ఇలా విచారణ జరిపే అధికారం దిల్లీ అసెంబ్లీకి లేదని కూడా స్పష్టం చేసింది. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని పేర్కొంది.

దాంపత్య హక్కుల పునరుద్ధరణ వివాదం..

దిల్లీ: విడిపోయిన దంపతులు మళ్లీ సహజీవనం చేయాలని, దాంపత్య జీవితాన్ని కొనసాగించాలంటూ ఆదేశించే అధికారాన్ని న్యాయస్థానాలకు కల్పించిన వైవాహిక చట్ట నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో ప్రస్తావించిన అంశాలు ‘ప్రాధాన్యం గలవి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన విషయాలపై స్పందనను కేంద్ర ప్రభుత్వం పది రోజుల్లోగా లిఖితపూర్వంగా సమర్పించాలని కోరింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించేందుకు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ల ధర్మాసనం అనుమతించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో తమకు సహకారం అందించాల్సిందిగా అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ను ధర్మాసనం గతంలోనే కోరింది. గురువారం కొద్ది సమయంపాటు జరిగిన విచారణకు హాజరైన ఆయన..న్యాయస్థానం కోరిన సమాచారాన్ని సమర్పించడానికి మరికొంత వ్యవధి కోరారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 9, ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్‌ 22, ఇతర నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు ఓజశ్వా పాఠక్, మయాంక్‌ గుప్తా పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొన్ని పిటిషన్లు కూడా న్యాయస్థానం ముందుకు వచ్చాయి.-సర్కారు స్పందన కోరిన సుప్రీంకోర్టు

సహకార సంఘాలపై కేంద్రం చట్టాలు చేయవచ్చా?

దిల్లీ: సహకార సంఘాలపై చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదంటూ గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు గురువారం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. సహకార సంఘాల నిర్వహణ అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో పలు విధానాలను రూపొందిస్తూ 2011 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం 97వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. ఇది 2012 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీనిపై గుజరాత్‌ హైకోర్టులో దావాలు దాఖలు కాగా, రాజ్యాంగ సవరణలోని కొన్ని అంశాలను కొట్టివేస్తూ 2013లో తీర్పు ఇచ్చింది. సహకార సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని, దీనిపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు లేదని స్పష్టం చేసింది. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్, జస్టిస్‌ కె.ఎం.జోసఫ్, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ దీని ద్వారా రాష్ట్రాలకు మార్గదర్శనం చేశామే తప్ప, వాటి అధికారాలను తీసుకోలేదని తెలిపారు.  -  తీర్పు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని