Tiger: బెంగాల్‌లో అదృశ్యం.. బంగ్లాదేశ్‌లో ప్రత్యక్షం

పశ్చిమ బెంగాల్‌ అడవుల్లో నుంచి ఓ మగ పులి అదృశ్యమైంది. నాలుగు నెలల తర్వాత పొరుగు దేశమైన

Published : 09 Jun 2021 19:16 IST

నదులు, దీవులు దాటుకొని 100 కి.మీ. ప్రయాణించిన పులి


ఈనాడు, దిల్లీ: పశ్చిమ బెంగాల్‌ అడవుల్లో నుంచి ఓ మగ పులి అదృశ్యమైంది. నాలుగు నెలల తర్వాత పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ అడవుల్లో ప్రత్యక్షమైంది. అక్కడకు చేరుకోవడానికి సుమారు 100 కి.మీ. ప్రయాణించిన ఈ వ్యాఘ్రం.. ఆ క్రమంలో నాలుగుకు పైగా నదులను, మూడు దీవులను దాటేసింది! అయితే ఎక్కడా మనుషుల ఆవాసాల్లోకి చొరబడలేదు. పులి మెడకు అమర్చిన రేడియో ట్యాగింగ్‌ పరికరం వల్ల దాని ఆచూకీ తెలిసినట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్స్‌ చిట్టడవుల్లో కనిపించిన ఆ పులికి గతేడాది డిసెంబరులో అటవీ అధికారులు రేడియో ట్యాగింగ్‌ పరికరాన్ని అమర్చారు. పులుల కదలికలపై నిఘా పెట్టేందుకే ఈ ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఆ పులి ఎక్కడున్నదీ తెలుసుకోవచ్చు. అంతేకాదు.. ఆ పులి మరణిస్తే ఆ విషయాన్ని పసిగట్టి తెలియజేసే ఓ ప్రత్యేక సెన్సర్‌ను అందులో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయిన ఆ పులి బంగ్లాదేశ్‌ వైపు బయల్దేరింది. గత నెల 11న అది బంగ్లాదేశ్‌లోని తల్‌పాట్టి దీవిలో ఉన్నట్లు సంకేతాలు అందాయి. ఆ తర్వాత రేడియో ట్యాగింగ్‌ పరికరం పనిచేయడం ఆగిపోయింది. అది ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. చివరకు ఆ పులి బంగ్లాదేశ్‌లోని సుందర్బన్స్‌ అడవుల్లో ఉన్నట్లు అధికారులు కనిపెట్టారు. అయితే అది గతంలో అక్కడి నుంచే బెంగాల్‌ అడవుల్లోకి వచ్చి ఉండొచ్చని, అందుకే తిరిగి వెళ్లి ఉండొచ్చని చెబుతున్నారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని